Daylight
-
పట్టపగలే రెండు ఇళ్లలో చోరీ
నల్లగొండ క్రైం : పట్టణంలోని పానగల్ రోడ్డులోని నందీశ్వర కాలనీలో సోమవారం రెండు ఇళ్లలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితులు, టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన శ్రీనివాస్, బి.అంజయ్య ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇళ్లకు వెళ్లారు. దీనిని గమనించిన దుండగులు ఇంటి తాళాలలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. శ్రీనివాస్ ఇంట్లో 20 తులాల వెండి, 2 తులాల బంగారం, రూ. 2 వేల నగదు, బి.అంజయ్య ఇంట్లో రూ.50 వేలు నగదు, 2 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఇంటి తాళాలలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి స్థానికులు బాధితులకు సమాచారం ఇచ్చారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. సీసీ కెమెరాల్లో రికార్డు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పట్టపగలే దారిదోపిడీ
చిలమత్తూరు :ఓ ప్రభుత్వోద్యోగి పట్టపగలే దారిదోపిడీకి గురయ్యాడు. వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండల పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న జయకుమార్ సోమవారం దారిదోపిడీకి గురయ్యాడు. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న బైరేకుంట ప్రధాన రహదారిపై నలుగురు వ్యక్తులు జయకుమార్‌ను అటకాయించి కత్తితో బెదిరించి అతని చేతికి ఉన్న మూడు ఉంగరాలు, రూ.5 వేల నగదు, ఒక సెల్‌ఫోన్ దోచుకున్నారు. దుండగులు రెండు ద్విచక్రవాహనాలపై ముసుగులు ధరించి రావడంతో జయకుమార్ వారిని గుర్తుపట్టలేకపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పట్టపగలు దోపిడీ
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : బెల్లంపల్లిలో సోమవారం పట్టపగలు గుర్తు తెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు. ట్రాన్స్ కో బిల్లులు వసూలు చేసే కాంట్రాక్ట్ రెవెన్యూ కలెక్టర్‌ను కత్తులతో బెదిరించి రూ.1.19 లక్షలు అపహరించుకుని వెళ్లా రు. బాధితుడి కథనం ప్రకారం.. మంచిర్యాలలోని జన్మభూమినగర్‌కు చెందిన బుజాడి శ్రీనివాస్ బెల్లంపల్లిలో ట్రాన్స్‌కోలో కాంట్రాక్ట్ పద్ధతిన రెవెన్యూ కలెక్టర్(బిల్లులు వసూలు చేసే వ్యక్తి)గా ఏడేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం స్థానిక బజార్ ఏరియా చిన్నరాజయ్య కాంప్లెక్స్‌లో ఉన్న ట్రాన్స్‌కో కలెక్షన్ సెంటర్‌కు వెళ్లాడు. మధ్యాహ్నం 12 గంటల వరకు బిల్లులు వసూలు చేశాడు. అకస్మాత్తుగా శ్రీనివాస్‌కు కడుపులో తిప్పినట్లు కావడంతో బహిర్భూమి కోసం బెల్లంపల్లిబస్తీలో ఉన్న సులభ్ కాంప్లెక్స్ వద్దకు డబ్బుల బ్యాగుతో వెళ్లాడు. కాలకృత్యాలు తీర్చుకుని బయటకు వస్తుండగా ముఖానికి గుడ్డలు కట్టుకుని ఉన్న నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా శ్రీనివాస్‌ను అటకాయించి కత్తులతో బెదిరించారు. డబ్బుల బ్యాగ్‌ను లాక్కొని అతడిని పక్కనే నిలిపి ఉంచిన ఆటోలో ఎక్కించుకుని గురిజాలకు వెళ్లే రహదారికి బయల్దేరారు. ఎంపీడీవో కార్యాలయం, ఐటీడీఏ హార్టికల్చర్ మధ్యలో ఆటో నిలిపి శ్రీనివాస్‌ను కిందికి దింపారు. చెట్లపొదల్లోకి తీసుకెళ్లి బ్యాగ్‌లో ఉన్న రూ.1.19 లక్షలు, సెల్‌ఫోన్ తీసుకున్నారు. ఖాళీ బ్యాగ్‌ను శ్రీనివాస్ చేతిలో పెట్టి క్షణాల్లో అదే ఆటోలో దుండగులు బెల్లంపల్లి వైపు పారిపోయూరు. నిర్ఘాంతపోయి శ్రీనివాస్ కలెక్షన్ సెంటర్‌కు వచ్చి సిబ్బందికి వివరాలు తెలిపాడు. ట్రాన్స్‌కో పట్టణ ఏఈ మల్లేశం పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఎస్.పి.రవీందర్, వన్‌టౌన్ ఎస్సై కె.స్వామి, ఐడీ పార్టీ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడు వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై స్వామి తెలిపారు. -
పట్టపగలు వృద్ధురాలి హత్య
కొత్తవలస, న్యూస్‌లైన్ : మండలంలోని కొత్తవలస మేజర్ పంచాయతీ శివారు చీపురువలస గ్రామంలో శనివారం పట్టపగలే వృద్ధురాలు హత్యకు గురైంది. గ్రామంలోని వ్యక్తే ఈ హత్య చేసి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖ జిల్లా సబ్బవరం మండలం గుల్లిపల్లి గ్రామానికి చెందిన బోకం దేముడమ్మ(60) వారం రోజుల క్రితం కంటి శస్త్రచికిత్స చేయించుకుంది. శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుందామని కొత్తవలస మండలం చీపురువలసలో ఉంటున్న కుమార్తె అన్నంరెడ్డి పైడితల్లమ్మ ఇంటికి ఆమె వచ్చింది. శనివారం పైడితల్లమ్మ.. తల్లి దేముడమ్మను ఇంటి వద్దే ఉంచి రోజూ మాదిరిగా పొలం పనులకు వెళ్లిపోయింది. మధ్యాహ్నం సమయంలో పైడితల్లమ్మ కుమారుడు ఇంటికి వచ్చాడు. అమ్మమ్మకు పండ్లు ఇచ్చేందుకు తట్టి లేపాడు. అయితే ఆమె ఎప్పటికీ లేవకపోవడంతో ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించాడు. అప్పటికే ఆమె మృతి చెంది ఉండడంతో భోరుమన్నాడు. డబ్బు కోసమే హత్య.. మృతురాలి కుమార్తె పైడితల్లమ్మ ఇటీవలే పాడిగేదెను రూ.20 వేలకు అమ్మింది. ఆ డబ్బు ను ఇంట్లోని సూట్‌కేసులో దాచింది. ఆ డబ్బు కోసమే ఆ వ్యక్తి లోపలికి ప్రవేశించి ఉంటాడని, అడ్డొచ్చిన వృద్ధురాలిని హత్య చేసి ఉంటాడని తెలుస్తోంది. బాగా తెలిసిన వారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యాహ్నం సుమా రు 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగి ఉంటుందని తెలుస్తోంది. ఇంట్లోని సూట్ కేసు తాళం విరగ్గొటి, అందులో నగదును అగంతకుడు అపహరించాడు. వృద్ధురాలి ముక్కుకు ఉన్న పావుతులం బంగారపు పుడకను దోచుకున్నాడు. మృతురాలి గొంతు కింద ఉన్న ఆనవాళ్లతో పాటు, ముక్కుపై ఉన్న గాయాలను బట్టి వృద్ధురాలు తీవ్రంగా పెనుగులాడినట్లు తెలుస్తోంది. దుండగుడు ఆమె గొంతు పిసికి హత్య చేసినట్లు స్పష్టమవుతోంది. విశ్రాంతి తీసుకుందామని వచ్చి.. విగతజీవైంది... కంటి శస్త్రచికిత్స చేయించుకుని రెండు రోజులు విశ్రాంతి తీసుకుందామని వచ్చిందని, ఇలా హత్యకు గురైందని మృతురాలి కుమార్తె పైడితల్లమ్మ గుండెలవిసేలా రోదిస్తోంది. తాను పొలం పనులకు వెళ్లిన రెండు గంటల్లోనే ఘోరం జరిగిపోయిందని వాపోయింది. ఇంట్లో ఉన్న డబ్బుల కోసం మనుషుల ప్రాణాలు తీసేస్తారా? అంటూ కన్నీటిపర్యంతమైంది. గ్రామ తలయారి ఫిర్యాదు మేరకు కొత్తవలస సీఐ జూరెడ్డి మురళి, ఏఎస్సై ఎస్.జియాఉద్దీన్, హెచ్‌సీ బి.చిన్నయ్య సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కొంతమంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట సీహెచ్‌ఎన్‌సీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.