కటకటాల్లోకి మానవమృగం
కర్నూలు: కర్నూలు నగరంలోని బుధవారపేటకు చెందిన రవి అలియాస్ మట్టిగాడు ఎట్టకేలకు కటకటాలపాలయ్యాడు. పాత నేరస్తుడు ఇచ్చిన సమాచారంతో కర్నూలు నగరం బుధవారపేటలోని విజయా డెయిరీ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎస్పీ ఆకె రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. బుధవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవి నేర చరిత్రను ఆయన వివరించారు. మద్యం తాగితే రవి రాక్షసుడిగా మారిపోతాడు.
20 రోజుల్లో పది మంది మహిళలపై అత్యాచారానికి ఒడిగిట్టిన అతడిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఒళ్లు గగుర్పొడితే అకృత్యాలు వెలుగు చూశాయి. ఆటోలో ప్రయాణించే ఒంటరి మహిళలే ఇతని లక్ష్యం. నగర శివారుల్లోకి తీసుకెళ్లి వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు.
ఇటీవల బంగారుపేటలో సారా తాగుతూ నీలి షికారీలతో గొడవ పడి గాయాలపాలైన రవి వైద్యం చేయించుకునేందుకు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నాడు. అప్పటికే అతనిపై పోలీస్ నిఘా ఉండటంతో కర్నూలులో రెలైక్కి డోన్‌కు చేరుకుని అక్కడి నుంచి నంద్యాల సమీపంలోని ఓంకారంలో ఐదు రోజుల పాటు తలదాచుకున్నాడు. మద్యం సేవించేందుకు నంద్యాలకు వెళ్లగా.. పాత నేరస్తుడు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు.
‘డయల్ 100’కు సమాచారం ఇవ్వండి
మహిళలకు, యువతులకు ఆకతాయిల నుంచి ఇబ్బందులు ఎదురైతే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. మహిళల రక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని వివరించారు. రవి చేసిన నేరాలపై దర్యాప్తు కొనసాగుతుందని అతన్ని పూర్తి స్థాయిలో విచారించేందుకు కోర్టులో పిటిషన్ దాఖ లు చేసి మరోసారి కస్టడీలోకి తీసుకుంటామన్నారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, సీఐలు మధుసూదన్‌రావు, ప్రవీణ్‌కుమార్, పలువురు ఎస్‌ఐలు పాల్గొన్నారు.
నేరాల చిట్టాలో కొంత...
ఓ నేరంలో జైలుకు వెళ్లిన రవి కడప సెంట్రల్ జైలు నుంచి గత డిసెంబర్ 10న బెయిల్‌పై విడుదలయ్యాడు. అదే నెల 31న డోన్‌లో ఆటో చోరీ చేసి కర్నూలుకు చేరుకున్నాడు.
జనవరి 1న మద్యం సేవించి పుల్లారెడ్డి కళాశాల సమీపంలోని ముళ్లపొదల్లోకి ఓ మహిళను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. రాత్రి కాలేజీ పరిపర ప్రాంతాల్లో ఆటోలోనే నిద్రించాడు.
2వ తేదీన అమ్మ హాస్పిటల్ వద్ద ఓ మహిళ చందన బ్రదర్స్‌కు వెళ్లేందుకు ఆటోలో ఎక్కింది. అయితే మద్దూరునగర్‌లో రెండు లారీలు ఢీకొని ట్రాఫిక్ జామ్ అయిందంటూ నమ్మబలికి నందికొట్కూరు రోడ్డులోని పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలి కేకలు విని చుట్టుపక్క పొలాల్లోని జనం గుమికూడటంతో ఆటో వదిలి జొహరాపురం వైపు
పారిపోయాడు.
అలంపూర్ వెళ్లేందుకు ఓ మహిళ ఆటో ఎక్కడంతో మునగాలపాడు బ్రిడ్జి సమీపంలో అత్యాచారం చేశాడు.
నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని పెట్రోల్ బంకు ఎదుటనున్న కాలనీ మహిళ ఒంటరిగా వెళ్తుండటం గమనించి ముళ్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
కడప జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి మూడు ఆటోలను వివిధ ప్రాంతాల్లో దొంగిలించాడు.
బుధవారపేటలోని రాజీవ్‌గృహకల్ప సమీపంలోని ఓ మహిళా హాస్టల్‌లోకి రాత్రి పూట మారణాయుధంతో బెదిరించి సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లాడు.
2011లో గాంధీనగర్ నుంచి మహిళా డాక్టర్ ఆటోలో వెళ్తుండగా దారి మళ్లించి జొహరాపురం వైపు తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు.
2013లో ఉల్లిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని తడకనపల్లి క్రాస్‌రోడ్డు వద్ద నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.