SP RK Ravi Krishna
-
ప్రతి విద్యార్థికీ ఓ లక్ష్యం ఉండాలి
ఎమ్మిగనూరు రూరల్ : ప్రతి విద్యార్థికీ ఓ లక్ష్యం ఉండాలని ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. గురువారం బనవాసి ఏపీ గురుకుల జూనియర్ కాలేజిలో ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్‌డే వేడుకులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలకు, విద్యార్థులకు ఓ అన్నగా ఉంటానని చెప్పారు. ఓరే..! రిక్షా సినిమాలోని ‘మల్లె తీగకు పందిరివోలే..నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా..తోబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లమ్మా..!’ అంటూ పాట పాడారు. అనంతరం పలు కథలు చెప్పారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణించటం తను బాధించిందన్నారు. నంద్యాలలో అప్పుడే పుట్టిన ఆడబిడ్డను వదలి వెళ్లటం, ర్యాగింగ్‌తో రితికేశ్వరి ఆత్మహత్య చేసుకోవడం.. మనస్సును కలచివేశాయన్నారు. ప్రతి విద్యార్థినీ ఆంగ్లంపై పట్టు సాధించాలని చెప్పారు. ర్యాగింగ్, ఈవీటీజింగ్లను సమర్థంగా ఎదుర్కోవాలన్నారు. ఏ సమస్య వచ్చినా 100 ఫోన్ చేయాలని సూచించారు. కష్టాలు ప్రతి ఒక్కరికీ వస్తాయని, వాటిని చూస్తూ బాధపడకుండా జయించేందుకు యత్నించాలన్నారు. తన కూమార్తెను కూడా బనవాసి ఏపీ గురుకులంలోనే చదివిస్తానని చెప్పారు. అనంతరం విద్యార్థినులతో కలసి భోజనం చేశారు. కాలేజి అధ్యాపకులు.. ఎస్పీకి శాలువా కప్పి సన్మానం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసగుప్త, ఏపీటీ రమణ, అధ్యాపక బృందం,డీఎస్పీ బీఆర్ శ్రీనివాసులు, సీఐ శ్రీనివాసమూర్తి, పట్టణ, రూరల్, నందవరం ఎస్ఐలు శంకరయ్య, వేణుగోపాల్, వేణుగోపాల్‌రాజు పాల్గొన్నారు. -
రక్తమిస్తే ప్రాణం పోసినట్టే!
కర్నూలు : రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర సమయాల్లో రక్తం ఇచ్చి ఆదుకుంటే బాధితులకు ప్రాణం పోసినట్టేననే ఎస్పీ ఆకేరవికృష్ణ అన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు రక్తం అందక మరణించేవారికి రక్తం ఇచ్చి ఆదుకోవాలని ప్రజాసంఘాలు, స్వచ్చంద సంస్థలు, జిల్లా యువతకు ఎస్పీ పిలుపునిచ్చారు. కల్లూరు ఎస్టేట్ గోదావరి పాలిమర్స్ ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో శనివారం భగత్‌సింగ్ వీర్‌దళ్ యూత్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ఎస్పీ ఆకే రవికృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. శిబిరాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. స్నేహితుని వర్ధంతిని పురస్కరించుకుని భగత్‌సింగ్ వీర్‌దళ్ యూత్ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఎస్పీ కొనియాడారు. యూత్‌లో సభ్యుడిగా ఉన్న రాజేష్ 2011 జూన్ 20వ తేదీన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్నేహితుని జ్ఞాపకార్థం యూత్ సభ్యు లు అప్పటి నుంచి ఏటా రక్తదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ .. రాజేష్ తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు పాటించాలని సూచించా రు. ప్రజాసంఘాలు, స్వచ్చంద సంస్థలు రక్తదాన శిబిరాల ను విరివి గా నిర్వహించాలన్నారు. మంచి కార్యక్రమాలు చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలవాలని యువతకు పిలుపునిచ్చా రు. భగత్‌సింగ్ వీర్‌దళ్ యూత్ సభ్యు లు 65 మంది రక్తదానం చేసి ప్రభు త్వ ఆసుపత్రి రక్త నిధికి అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వాసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ మల్లికార్జున, నాల్గవ పట్టణ సీఐ రంగనాయకులు, ఎస్ఐ లు గోపీనాథ్, నాగలక్ష్మయ్య, స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ రంగయ్య, యూత్ సభ్యులు రాము, నవీన్, మాలిక్, ఖాదర్, రహీమ్, రామకృష్ణ, మస్తాన్,రాజు, పురుషోత్తం పాల్గొన్నారు. -
ఇక నిఘా తీవ్రతరం
పోలీసుల చెంతకు అత్యాధునిక వాహనాలు {పారంభించిన ఎస్పీ ఆకె రవికృష్ణ {పత్యేకతల ఇంటర్ సెప్టర్ వాహనం కర్నూలు : అసాంఘిక కార్యకలపాలను అడ్డుకునేందుకు, నేర నియంత్రణ కోసం పోలీస్ శాఖకు అత్యాధునిక వాహనాలు వచ్చాయి. వీటి సాయంతో నిఘాను తీవ్రతరం చేయవచ్చు. పోలీసు యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఇంటర్‌సెప్టర్ హైవే పెట్రోలింగ్ వాహనాలను జారీ చేసింది. జిల్లా పోలీసు శాఖకు ఇచ్చిన వీటిని బుధవారం ఉదయం పోలీస్ కార్యాలయ పెరేడ్ మైదానంలో ఎస్పీ ఆకే రవికృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో ఒకటి ఇంటర్‌సెప్టర్ మహింద్రా జైలో, మూడు ఫోర్డ్ కార్లు ఉన్నాయి. ఇంటర్ సెప్టర్ వాహనం ప్రత్యేకత... ఇంటర్‌సెప్టర్ వాహనం 360 డిగ్రీలు చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాలను, 1.5 కిలోమీటర్ల దూరంలో వస్తున్న వాహనాలను ముందుగానే గుర్తిస్తుంది. అతివేగంగా వచ్చే వాహనాల నంబర్ ప్లేట్లను, మద్యం తాగి వాహనాలు నడిపే వ్యక్తులను గుర్తించి ఇందులో అమర్చిన కెమెరా ద్వారా క్లిక్ చేసి.. జరిమానా విధించవచ్చు. ఈ వాహనంలో అడ్వాన్స్డ్ బ్రీత్ అనలైజర్, జీపీఎస్ సిస్టమ్, కంప్యూటర్ ఉంటాయి. వీఐపీ బందోబస్తు సమయంలో కూడా 1.5 కిలోమీటర్ల దూరం నుంచి వివిధ రకాల పరిస్థితులను ఈ వాహనం క్షుణ్ణంగా పరిశీలించి రికార్డు చేస్తుంది. ఈ వాహనాలను ప్రత్యేకంగా హైవే పెట్రోలింగ్‌కు ఉపయోగిస్తున్నారు. ఈ వాహనాలకు ఆధునిక టెక్నాలజీలో ఉన్న కెమెరా అమర్చి ఉండటమే కాక ఒక కంప్యూటర్ ఆపరేటర్, డ్రైవర్, ఇన్చార్జి ఆఫీసర్, ఒక కానిస్టేబుల్ ఉంటారు. ఇవి నిరంతరం జాతీయ రహదారిపై పెట్రోలింగ్ చేస్తూ రోడ్డు ప్రమాద నివారణ కోసం పనిచేస్తాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శివకోటి బాబురావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ, ఆళ్లగడ్డ ఏఎస్పీ శశికుమార్, డీఎస్పీలు రమణమూర్తి, ఏజీ కృష్ణమూర్తి, బాబుప్రసాద్, డి.ఆర్.శ్రీనివాసులు, వి.వి.నాయుడు, పి.ఎన్.బాబు, దేవదానం, హరినాథరెడ్డి, మురళీధర్, వినోద్‌కుమార్, సుప్రజ, సీసీఎస్ సీఐ రవిబాబు, ఆర్ఐ రంగముని, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు. -
సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత
కర్నూలు : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధ, గురువారాల్లో జిల్లాలోని గోరుకల్లు, భానకచెర్ల, అవుకు రిజర్వాయర్లను సందర్శించనున్న నేపథ్యంలో పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. జిల్లాతో పాటు వైఎస్సార్, అనంతపురం జిల్లాల నుంచి కూడా పోలీసు బలగాలను రప్పిస్తున్నారు. ఎస్పీ ఆకే రవికృష్ణ బందోబస్తు ఏర్పాట్లపై కసరత్తు పూర్తి చేశారు. 13న ఉదయం చంద్రబాబు జిల్లా పర్యటనకు రానుండటంతో మంగళవారం సాయంత్రమే ఆయా ప్రాంతాలను పోలీసులు స్వాధీనంలోకి తీసుకున్నారు. అదనపు ఎస్పీ శివకోటి బాబురావు, ఏఆర్ అదనపు ఎస్పీ రాధాకృష్ణ, ఆళ్లగడ్డ ఏఎస్పీ శశికుమార్, హోంగార్డు కమాండెంట్ మూసాబిన్ ఇబ్రహీం తదితరుల పర్యవేక్షణలో సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. 14 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, 106 మంది ఎస్ఐలు, 175 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 770 మంది కానిస్టేబుళ్లు, 56 మంది మహిళా కానిస్టేబుళ్లు, 360 మంది హోంగార్డులు, 15 ప్లటూన్ల ఏఆర్ బలగాలు, 30 స్పెషల్ పార్టీలను బందోబస్తు విధులకు నియమించారు. అదేవిధంగా వైఎస్సార్ జిల్లా నుంచి 200 మంది, అనంతపురం జిల్లా నుంచి 100 మంది కానిస్టేబుళ్లను బందోబస్తు విధులకు రప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సాగే పరిసర గ్రామాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీసు జాగిలాలతో అనువనువు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆరు బాంబ్‌స్క్వాడ్ బృందాలను తనిఖీలకు నియమించారు. ఏర్పాట్లు పూర్తి పాణ్యం : మండల పరిధిలోని గోరుకల్లు గ్రామ సమీపంలోని రిజర్వాయర్ పరిశీలనకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం కలెక్టర్ విజయమోహన్, ఎస్పీ రవికృష్ణతో పాటు అధికారులు రూట్‌మ్యాప్‌లను, హెలిప్యాడ్ స్థలాలను, సెక్యూరిటీ ఏర్పాట్లను పరిశీలించారు. వీరి వెంట ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం డీఎస్పీ రాజారెడ్డి ఉన్నారు. ఉదయం 12 గంటల సమయానికి సీఎం రిజర్వాయర్ వద్దకు చేరుకోనున్నారు. రైతులతో ముఖాముఖి అనంతరం భోజన విరామం తీసుకుంటారు. అక్కడే కాసేపు అధికారులతో సమస్యలపై చర్చించనున్నారు. ఏర్పాట్ల పరిశీలనలో డీఐజీ రమణకుమార్, కడప డీఎస్పీ మురళీ, ఏఎస్పీ శశికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కటకటాల్లోకి మానవమృగం
కర్నూలు: కర్నూలు నగరంలోని బుధవారపేటకు చెందిన రవి అలియాస్ మట్టిగాడు ఎట్టకేలకు కటకటాలపాలయ్యాడు. పాత నేరస్తుడు ఇచ్చిన సమాచారంతో కర్నూలు నగరం బుధవారపేటలోని విజయా డెయిరీ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎస్పీ ఆకె రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. బుధవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవి నేర చరిత్రను ఆయన వివరించారు. మద్యం తాగితే రవి రాక్షసుడిగా మారిపోతాడు. 20 రోజుల్లో పది మంది మహిళలపై అత్యాచారానికి ఒడిగిట్టిన అతడిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఒళ్లు గగుర్పొడితే అకృత్యాలు వెలుగు చూశాయి. ఆటోలో ప్రయాణించే ఒంటరి మహిళలే ఇతని లక్ష్యం. నగర శివారుల్లోకి తీసుకెళ్లి వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు. ఇటీవల బంగారుపేటలో సారా తాగుతూ నీలి షికారీలతో గొడవ పడి గాయాలపాలైన రవి వైద్యం చేయించుకునేందుకు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నాడు. అప్పటికే అతనిపై పోలీస్ నిఘా ఉండటంతో కర్నూలులో రెలైక్కి డోన్‌కు చేరుకుని అక్కడి నుంచి నంద్యాల సమీపంలోని ఓంకారంలో ఐదు రోజుల పాటు తలదాచుకున్నాడు. మద్యం సేవించేందుకు నంద్యాలకు వెళ్లగా.. పాత నేరస్తుడు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ‘డయల్ 100’కు సమాచారం ఇవ్వండి మహిళలకు, యువతులకు ఆకతాయిల నుంచి ఇబ్బందులు ఎదురైతే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. మహిళల రక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని వివరించారు. రవి చేసిన నేరాలపై దర్యాప్తు కొనసాగుతుందని అతన్ని పూర్తి స్థాయిలో విచారించేందుకు కోర్టులో పిటిషన్ దాఖ లు చేసి మరోసారి కస్టడీలోకి తీసుకుంటామన్నారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, సీఐలు మధుసూదన్‌రావు, ప్రవీణ్‌కుమార్, పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు. నేరాల చిట్టాలో కొంత... ఓ నేరంలో జైలుకు వెళ్లిన రవి కడప సెంట్రల్ జైలు నుంచి గత డిసెంబర్ 10న బెయిల్‌పై విడుదలయ్యాడు. అదే నెల 31న డోన్‌లో ఆటో చోరీ చేసి కర్నూలుకు చేరుకున్నాడు. జనవరి 1న మద్యం సేవించి పుల్లారెడ్డి కళాశాల సమీపంలోని ముళ్లపొదల్లోకి ఓ మహిళను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. రాత్రి కాలేజీ పరిపర ప్రాంతాల్లో ఆటోలోనే నిద్రించాడు. 2వ తేదీన అమ్మ హాస్పిటల్ వద్ద ఓ మహిళ చందన బ్రదర్స్‌కు వెళ్లేందుకు ఆటోలో ఎక్కింది. అయితే మద్దూరునగర్‌లో రెండు లారీలు ఢీకొని ట్రాఫిక్ జామ్ అయిందంటూ నమ్మబలికి నందికొట్కూరు రోడ్డులోని పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలి కేకలు విని చుట్టుపక్క పొలాల్లోని జనం గుమికూడటంతో ఆటో వదిలి జొహరాపురం వైపు పారిపోయాడు. అలంపూర్ వెళ్లేందుకు ఓ మహిళ ఆటో ఎక్కడంతో మునగాలపాడు బ్రిడ్జి సమీపంలో అత్యాచారం చేశాడు. నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని పెట్రోల్ బంకు ఎదుటనున్న కాలనీ మహిళ ఒంటరిగా వెళ్తుండటం గమనించి ముళ్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. కడప జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి మూడు ఆటోలను వివిధ ప్రాంతాల్లో దొంగిలించాడు. బుధవారపేటలోని రాజీవ్‌గృహకల్ప సమీపంలోని ఓ మహిళా హాస్టల్లోకి రాత్రి పూట మారణాయుధంతో బెదిరించి సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లాడు. 2011లో గాంధీనగర్ నుంచి మహిళా డాక్టర్ ఆటోలో వెళ్తుండగా దారి మళ్లించి జొహరాపురం వైపు తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. 2013లో ఉల్లిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని తడకనపల్లి క్రాస్‌రోడ్డు వద్ద నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. -
కర్నూలులో హై అలర్ట్
►దొంగల కోసం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ► నగర పోలీసుల పనితీరుపై ఎస్పీ సీరియస్ ►ఐదు స్టేషన్ల పరిధిలో ముమ్మర తనిఖీలు ►బాధితులను కలసి వివరాలు తెలుసుకున్న ఎస్పీ కర్నూలు: వరుస దొంగతనాల నేపథ్యంలో ఎస్పీ ఆకె రవికృష్ణ నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. గొలుసు దొంగలు చెలరేగిపోతున్నా పట్టుకోలేకపోతున్నారంటూ నగర పోలీసుల పనితీరుపై ఎస్పీ సీరియస్ అయ్యారు. ఆయన ఆదేశాల మేరకు శివారు కాలనీలపై క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. గురువారం నాలుగు చోట్ల చైన్ స్నాచింగ్ జరగడంతో ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దింపారు. 12 టీములను ఏర్పాటు చేసి ఐదుగురు ఎస్ఐలు, ఒక ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో గొలుసు దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. ఇన్చార్జి డీఎస్పీ మనోహర్‌రావు తన ఛాంబర్లో నగర సీఐలతో ప్రత్యేకంగా సమావేశమై నేరాల నియంత్రణపై చర్చించారు. నగర పరిధిలోని మొత్తం 5 పోలీస్స్టేషన్లు ఉండగా, ఒక్కొక్క స్టేషన్ పరిధిలో మూడు టీమ్‌లను నియమించారు. ఎస్ఐల ఆధ్వర్యంలో వాహనాలు, నగరంలోని లాడ్జిల్లో తనిఖీలు నిర్వహించారు. ఉదయం 5:30 నుంచి 9:30 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని సిబ్బంది మొత్తం రోడ్లపైనే ఉండి గస్తీ విధులు నిర్వహించే విధంగా ఎస్పీ ఆదేశించడంతో అధికారులు రోజంతా కాలనీల్లో పర్యటించారు. అర్బన్ తాలుకా సీఐ మధుసూధన్‌రావు బాలాజీనగర్, సంతోష్‌నగర్, నాల్గవ పట్టణ సీఐ రంగనాయకులు ఆధ్వర్యంలో క్రిష్ణానగర్ ప్రాంతంలోను, మూడవ పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్ నంద్యాల చెక్‌పోస్టు నుంచి సీక్యాంప్ సెంటర్ వరకు తన సిబ్బందితో ఇరువైపుల కాలనీల్లో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేసి అనుమానం ఉన్న ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. నెంబర్లు లేని వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. మహిళల మెడలో బంగారు గొలుసులు లాక్కుని వెళ్లే దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటూ ముద్రించిన కరపత్రాలను కాలనీల్లో పర్యటిస్తూ పంపిణీ చేశారు. ఎస్పీ ఆకె రవికృష్ణ, ఓఎస్డీ మనోహర్‌రావు రాత్రి బి.క్యాంప్‌లోని రిటైర్డ్ ఎస్ఐ ఆంజనేయులు, మణెమ్మ దంపతుల ఇంటికి వెళ్లి చైన్ స్నాచింగ్ జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఎలాగైనా రికవరీ చేయాలంటూ బాధితుడు ఆంజనేయులు ఈ సందర్భంగా ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. దొంగలను పట్టుకుని సొమ్ము రికవరీ చేయిస్తానని వారికి ఎస్పీ హామీ ఇచ్చారు.