కర్నూలులో హై అలర్ట్ | high alert in kurnool | Sakshi
Sakshi News home page

కర్నూలులో హై అలర్ట్

Published Fri, Sep 12 2014 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 PM

high alert in kurnool

దొంగల కోసం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు
నగర పోలీసుల పనితీరుపై ఎస్పీ సీరియస్
ఐదు స్టేషన్ల పరిధిలో ముమ్మర తనిఖీలు
బాధితులను కలసి వివరాలు తెలుసుకున్న ఎస్పీ
కర్నూలు: వరుస దొంగతనాల నేపథ్యంలో ఎస్పీ ఆకె రవికృష్ణ నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. గొలుసు దొంగలు చెలరేగిపోతున్నా పట్టుకోలేకపోతున్నారంటూ నగర పోలీసుల పనితీరుపై ఎస్పీ సీరియస్ అయ్యారు. ఆయన ఆదేశాల మేరకు శివారు కాలనీలపై క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. గురువారం నాలుగు చోట్ల చైన్ స్నాచింగ్ జరగడంతో ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దింపారు.

12 టీములను ఏర్పాటు చేసి ఐదుగురు ఎస్‌ఐలు, ఒక ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షణలో గొలుసు దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. ఇన్‌చార్జి డీఎస్పీ మనోహర్‌రావు తన ఛాంబర్‌లో నగర సీఐలతో ప్రత్యేకంగా సమావేశమై నేరాల నియంత్రణపై చర్చించారు. నగర పరిధిలోని మొత్తం 5 పోలీస్‌స్టేషన్లు ఉండగా, ఒక్కొక్క స్టేషన్ పరిధిలో మూడు టీమ్‌లను నియమించారు. ఎస్‌ఐల ఆధ్వర్యంలో వాహనాలు, నగరంలోని లాడ్జిల్లో తనిఖీలు నిర్వహించారు. ఉదయం 5:30 నుంచి 9:30 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని సిబ్బంది మొత్తం రోడ్లపైనే ఉండి గస్తీ విధులు నిర్వహించే విధంగా ఎస్పీ ఆదేశించడంతో అధికారులు రోజంతా కాలనీల్లో పర్యటించారు.

అర్బన్ తాలుకా సీఐ మధుసూధన్‌రావు బాలాజీనగర్, సంతోష్‌నగర్, నాల్గవ పట్టణ సీఐ రంగనాయకులు ఆధ్వర్యంలో క్రిష్ణానగర్ ప్రాంతంలోను, మూడవ పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్ నంద్యాల చెక్‌పోస్టు నుంచి సీక్యాంప్ సెంటర్ వరకు తన సిబ్బందితో ఇరువైపుల కాలనీల్లో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేసి అనుమానం ఉన్న ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. నెంబర్లు లేని వాహనాలను అదుపులోకి తీసుకున్నారు.

మహిళల మెడలో బంగారు గొలుసులు లాక్కుని వెళ్లే దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటూ ముద్రించిన కరపత్రాలను కాలనీల్లో పర్యటిస్తూ పంపిణీ చేశారు. ఎస్పీ ఆకె రవికృష్ణ, ఓఎస్‌డీ మనోహర్‌రావు రాత్రి బి.క్యాంప్‌లోని రిటైర్డ్ ఎస్‌ఐ ఆంజనేయులు, మణెమ్మ దంపతుల ఇంటికి వెళ్లి చైన్ స్నాచింగ్ జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఎలాగైనా రికవరీ చేయాలంటూ బాధితుడు ఆంజనేయులు ఈ సందర్భంగా ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. దొంగలను పట్టుకుని సొమ్ము రికవరీ చేయిస్తానని వారికి ఎస్పీ హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement