ఎమ్మిగనూరు రూరల్ : ప్రతి విద్యార్థికీ ఓ లక్ష్యం ఉండాలని ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. గురువారం బనవాసి ఏపీ గురుకుల జూనియర్ కాలేజిలో ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్‌డే వేడుకులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలకు, విద్యార్థులకు ఓ అన్నగా ఉంటానని చెప్పారు. ఓరే..! రిక్షా సినిమాలోని ‘మల్లె తీగకు పందిరివోలే..నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా..తోబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లమ్మా..!’ అంటూ పాట పాడారు. అనంతరం పలు కథలు చెప్పారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణించటం తను బాధించిందన్నారు.
నంద్యాలలో అప్పుడే పుట్టిన ఆడబిడ్డను వదలి వెళ్లటం, ర్యాగింగ్‌తో రితికేశ్వరి ఆత్మహత్య చేసుకోవడం.. మనస్సును కలచివేశాయన్నారు. ప్రతి విద్యార్థినీ ఆంగ్లంపై పట్టు సాధించాలని చెప్పారు. ర్యాగింగ్, ఈవీటీజింగ్‌లను సమర్థంగా ఎదుర్కోవాలన్నారు. ఏ సమస్య వచ్చినా 100 ఫోన్ చేయాలని సూచించారు. కష్టాలు ప్రతి ఒక్కరికీ వస్తాయని, వాటిని చూస్తూ బాధపడకుండా జయించేందుకు యత్నించాలన్నారు. తన కూమార్తెను కూడా బనవాసి ఏపీ గురుకులంలోనే చదివిస్తానని చెప్పారు.
అనంతరం విద్యార్థినులతో కలసి భోజనం చేశారు. కాలేజి అధ్యాపకులు.. ఎస్పీకి శాలువా కప్పి సన్మానం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసగుప్త, ఏపీటీ రమణ, అధ్యాపక బృందం,డీఎస్‌పీ బీఆర్ శ్రీనివాసులు, సీఐ శ్రీనివాసమూర్తి, పట్టణ, రూరల్, నందవరం ఎస్‌ఐలు శంకరయ్య, వేణుగోపాల్, వేణుగోపాల్‌రాజు పాల్గొన్నారు.
ప్రతి విద్యార్థికీ ఓ లక్ష్యం ఉండాలి
Published Fri, Aug 7 2015 3:22 AM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM
Advertisement
Advertisement