కర్నూలు : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధ, గురువారాల్లో జిల్లాలోని గోరుకల్లు, భానకచెర్ల, అవుకు రిజర్వాయర్లను సందర్శించనున్న నేపథ్యంలో పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. జిల్లాతో పాటు వైఎస్సార్, అనంతపురం జిల్లాల నుంచి కూడా పోలీసు బలగాలను రప్పిస్తున్నారు. ఎస్పీ ఆకే రవికృష్ణ బందోబస్తు ఏర్పాట్లపై కసరత్తు పూర్తి చేశారు. 13న ఉదయం చంద్రబాబు జిల్లా పర్యటనకు రానుండటంతో మంగళవారం సాయంత్రమే ఆయా ప్రాంతాలను పోలీసులు స్వాధీనంలోకి తీసుకున్నారు.
అదనపు ఎస్పీ శివకోటి బాబురావు, ఏఆర్ అదనపు ఎస్పీ రాధాకృష్ణ, ఆళ్లగడ్డ ఏఎస్పీ శశికుమార్, హోంగార్డు కమాండెంట్ మూసాబిన్ ఇబ్రహీం తదితరుల పర్యవేక్షణలో సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. 14 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, 106 మంది ఎస్‌ఐలు, 175 మంది ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 770 మంది కానిస్టేబుళ్లు, 56 మంది మహిళా కానిస్టేబుళ్లు, 360 మంది హోంగార్డులు, 15 ప్లటూన్ల ఏఆర్ బలగాలు, 30 స్పెషల్ పార్టీలను బందోబస్తు విధులకు నియమించారు.
అదేవిధంగా వైఎస్సార్ జిల్లా నుంచి 200 మంది, అనంతపురం జిల్లా నుంచి 100 మంది కానిస్టేబుళ్లను బందోబస్తు విధులకు రప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సాగే పరిసర గ్రామాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీసు జాగిలాలతో అనువనువు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆరు బాంబ్‌స్క్వాడ్ బృందాలను తనిఖీలకు నియమించారు.
ఏర్పాట్లు పూర్తి
పాణ్యం : మండల పరిధిలోని గోరుకల్లు గ్రామ సమీపంలోని రిజర్వాయర్ పరిశీలనకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం కలెక్టర్ విజయమోహన్, ఎస్పీ రవికృష్ణతో పాటు అధికారులు రూట్‌మ్యాప్‌లను, హెలిప్యాడ్ స్థలాలను, సెక్యూరిటీ ఏర్పాట్లను పరిశీలించారు. వీరి వెంట ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం డీఎస్పీ రాజారెడ్డి ఉన్నారు.
ఉదయం 12 గంటల సమయానికి సీఎం రిజర్వాయర్ వద్దకు చేరుకోనున్నారు. రైతులతో ముఖాముఖి అనంతరం భోజన విరామం తీసుకుంటారు. అక్కడే కాసేపు అధికారులతో సమస్యలపై చర్చించనున్నారు. ఏర్పాట్ల పరిశీలనలో డీఐజీ రమణకుమార్, కడప డీఎస్పీ మురళీ, ఏఎస్పీ శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత
Published Wed, May 13 2015 3:41 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM
Advertisement
Advertisement