మహాజాతరపై సీఎస్ సమీక్ష | Deadline 31 | Sakshi
Sakshi News home page

మహాజాతరపై సీఎస్ సమీక్ష

Published Tue, Jan 7 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM

మహాజాతరపై సీఎస్ సమీక్ష

మహాజాతరపై సీఎస్ సమీక్ష

మహాజాతరపై సీఎస్ సమీక్ష
 =ఈ నెలాఖరులోపు పనులన్నీ పూర్తి చేయాలి
 =నిర్వహణకు మరో రూ. 6 కోట్లు
 =ఇందులో విద్యుత్ శాఖకు రూ.కోటి విడుదల
 =రెవెన్యూకు రూ.3 కోట్లు.. పోలీసులకు రూ.2 కోట్లు
 =పనుల పర్యవేక్షణకు సీనియర్ అధికారులు
 =హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో మహంతి

 
వరంగల్, న్యూస్‌లైన్ : వచ్చే నెల 12 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న మేడారం మహాజాతరకు సంబంధించి చేపట్టిన అభివృద్ధి పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే.మహంతి ఆదేశించారు. జాతర పనులపై హైదరాబాద్‌లో సోమవారం కలెక్టర్ కిషన్‌తోపాటు పలు శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు.

సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు జరిగిన సమావేశంలో నిధుల కేటాయింపు, విడుదల... విద్యుత్, దేవాదాయ శాఖల మధ్య కొన్ని రోజులుగానెలకొన్న వివాదానికి సీఎస్ తెరదించారు. విద్యుత్ శాఖకు జిల్లా యంత్రాంగం రూ.25 లక్షలు ఇచ్చిందని... ఆ శాఖ ప్రస్తుతం చేపట్టే పనులకు ప్రభుత్వం తరఫున రూ.కోటి విడుదల చేస్తున్నట్లు మహంతి తెలిపారు. ఇప్పటికైనా పనులు త్వరగా పూర్తి చేయాలని సూచిం చారు. అదేవిధంగా జాతర నిర్వహణ కోసం మరో రూ.ఐదు కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఇందులో నుంచి జాతరలో ప్రొటోకాల్, భోజనాలు, నాలుగు రోజులపాటు అధికారుల బస, ఇతర నిర్వహణ ఖర్చుల కింద రెవెన్యూ శాఖకు రూ.3 కోట్లు కేటారుుంచినట్లు వెల్లడించారు. ఇక పోలీస్ శాఖకు కూడా ఈసారి ముందుగానే నిధులిస్తున్నామని... భద్రత, భోజనాలు, ఇతర అలవెన్స్‌లకు రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. వెంటనే రూ.6 కోట్లు విడుదల చేయూలని ఫైనాన్స్ విభాగానికి ఉత్తర్వులిచ్చినట్లు వివరించారు. జాతరలో ప్రధానంగా ఇంజినీరింగ్ పనులన్నింటినీ ఈనెలాఖరు వరకు పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని జిల్లా అధికారులకు సీఎస్ సూచించారు.

 పనుల ప్రగతిపై కలెక్టర్ వివరణ

 మేడారం పనుల ప్రగతిపై కలెక్టర్ కిషన్ ముందుగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎస్ మహంతికి వివరించారు. ప్రధానంగా ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, వాటి ప్రగతిని నివేదించారు. మహా జాతరను పురస్కరించుకుని ఫిబ్రవరి ఐదో తేదీ నుంచే పోలీస్, మెడికల్, పంచాయతీతోపాటు పలు విభాగాల అధికారులు స్థానికంగానే ఉంటారని... ఫిబ్రవరి 1 నుంచే ప్రత్యేక బస్సులను మేడారానికి తిప్పునున్నట్లు వివరించారు. అనంతరం జిల్లా యంత్రాంగానికి సీఎస్ పలు సూచనలు చేశారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూ.4.99 కోట్లతో చేపట్టిన ఏజెన్సీ రోడ్ల అభివృద్ధి, తాగునీటి సరఫరా పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, మేడారం వెళ్లి తనిఖీలు చేపట్టాలనిగిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజినీర్‌ను ఆదేశించారు. పీఆర్ విభాగం రూ. 7.69 కోట్లతో చేపట్టిన ఆరు రోడ్ల విస్తరణ, సీసీ రోడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
 
పర్యవేక్షణకు సీనియర్ అధికారులు
 
మేడారం పనుల పర్యవేక్షణకు హైదరాబాద్ నుంచి సీనియర్ అధికారులను నియమించనున్నట్లు సీఎస్ మహంతి వెల్లడించారు. మొత్తం రూ.100 కోట్లతో చేపట్టనున్న పనులకు సంబంధించి నాణ్యత ప్రమాణాలను వారు పరిశీలించనున్నట్లు వివరించారు. అదేవిధంగా పారిశుద్ధ్య పనుల కోసం రాజమండ్రి నుంచి రెండు వేల మంది కార్మికులను ప్రత్యేకంగా రప్పించనున్నట్లు పేర్కొన్నారు. జాతరకు నాలుగు రోజుల ముందు, పూర్తి అయిన వారం రోజుల వర కు వారు మేడారంలో విధులు నిర్వర్తిస్తారని చెప్పా రు. శానిటేషన్ నిర్వహణకు వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్ సాయం తీసుకోవాలని సూచించారు.
 
పారిశుద్ధ్యం, వైద్యం, తాగునీరు ప్రధానం
 
కోటి మందికి పైగా వచ్చే ఈ జాతరకు పారిశుద్ధ్యం, వైద్యం, తాగునీటి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సీఎస్ సూచించారు. నీటి పారుదల శాఖ ద్వారా రూ. 9.81 కోట్లతో 426 మీటర్ల స్నాన ఘట్టాల నిర్మాణం, కొత్తగా 50 బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జాతరకు మూడు రోజుల ముందు నుంచే క్లోరినేషన్ చేయాలని, బ్లీచింగ్ పౌడర్‌ను ప్రధాన ప్రాంతాల్లో నిల్వ చేయాలని, పంచాయతీ విభాగం వాటర్ క్లోరినేషన్‌లో జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు.
 
శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలి
 
పలు పనులను జాతర కోసమే కాకుండా... జాతర తర్వాత కూడా ఉపయోగపడేలా శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు సీఎస్ సూచించారు. ఏటా చేపట్టాల్సినవి కాకుండా... శాశ్వతంగా ఉపయోగపడే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జాతర పనులపై కలెక్టర్ కిషన్‌దే బాధ్యత అని, పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పారు.
 
ఆ అధికారుల వివరాలు ఇవ్వండి...

గత జాతరలో విధులు నిర్వర్తించిన అధికారుల సహాయ సహకారాలు తీసుకోవాలని, ఐదు రోజుల పాటు డిప్యూటేషన్ విధులు కేటాయించాలన్నారు. జాతర నిర్వహణలో అనుభవం ఉండి, ఇతర జిల్లాలో పనిచేస్తున్న అధికారుల వివరాలివ్వాలని కలెక్టర్ కిషన్‌కు సీఎస్ సూచించారు. ఈ సందర్భంగా జాతర నిమిత్తం 3600 బస్సులను ప్రత్యేకంగా నడుపుతున్నామని ఆర్టీసీ ఎండీ తెలిపారు. జాతరలో శాంతిభద్రతల పర్యవేక్షణకు పది వేల మంది పోలీసు సిబ్బందిని నియమిస్తున్నట్లు ఐజీ వివరించారు.

సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి డి.సాంబశివరావు, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి విద్యాసాగర్, కమిషనర్ ఉదయలక్ష్మి,  దేవాదాయ శాఖ కార్యదర్శి వెంకటేశ్వర్లు, కమిషనర్ ముక్తేశ్వర్‌రావు, నీటి పారుదల శాఖ కార్యదర్శి అరవిందరెడ్డి, అటవీ శాఖ ప్రిన్సిపల్ సీసీఎఫ్ జోసెఫ్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ కాస్‌రాజవశ్రీ, సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకుడు సుభాష్, ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా, ఈఎన్‌సీ రాజేంద్ర ప్రసాద్, జేసీ పౌసుమిబసు, ఐటీడీఏ పీఓగా పని చేసి ఇటీవలే కరీంనగర్ జేసీగా బదిలీ అయిన సర్ఫరాజ్ అహ్మద్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మోహన్ నాయక్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సురేష్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement