
ఎదురుచూపులు ఫలించేనా..!
- రుణమాఫీ కోసం కొందరు...
- కొత్త రుణాల కోసం మరికొందరు..
- పెండింగ్ దరఖాస్తులు
- బ్యాంకుల్లో స్తంభించిన లావాదేవీలు..!
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : రుణమాఫీ కోసం కొందరు.. కొత్త రుణాల కోసం మరి కొందరు మహిళలు ఎదురుచూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. ఆయనుుఖ్యమంత్రి అయితే తమ రుణాలు మాఫీ అవుతాయనే ఉద్దేశంతో జిల్లాలోని 90 శాతం డ్వాక్రా గ్రూపు మహిళలు ఫిబ్రవరి నుంచి నెలవారీ వాయిదాలు చెల్లించడం లేదు. ఫలి తంగా బ్యాంకుల్లో లావాదేవీలు స్తంభించాయి.
ఈ నేపథ్యంలో నాలుగు రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అదే సమయంలో ఆయన రుణమాఫీ ఫైలుపై సంతకం చేస్తారని చెబుతున్నారు. దీంతో తమ రుణాలు మాఫీ అవుతాయని మహిళలు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే మార్చి 31 వరకు ఇచ్చిన రుణాలను మాఫీ చేస్తారా.. పాత బకాలయిలు మొత్తం రద్దు చేస్తారా.. అనే విషయమై డ్వాక్రా గ్రూపు సభ్యులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు రుణాలు మాఫీ చేస్తే వందల కోట్ల రూపాయల లావాదేవీలు స్తంభిస్తాయని భావించిన బ్యాంకర్లు మూడు నాలుగు నెలలుగా కొత్త రుణాలను మంజూరుచేయడం లేదు.
ఫిబ్రవరి నుంచి డబ్బు చెల్లించని వైనం..
జిల్లా వ్యాప్తంగా సుమారు 50వేల డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. వాటిలో 24వేల వరకు గ్రూపులు రుణాలు పొందాయి. ఒక్కో గ్రూపునకు కనీసం రూ.20వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలు తీసుకున్నాయి. స్వయం శక్తి సంఘాల సభ్యులు కూడా రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు రుణాలు తీసుకున్నారు. రుణమాఫీపై ఆశతో వీరిలో 90 శాతం మంది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు బ్యాంకులకు నెలవారీ వాయిదాలు చెల్లించడం లేదు. విజయవాడ నగరపాలక సంస్థ, జగ్గయ్యపేట, మచిలీపట్నం, పెడన, గుడివాడ, ఉయ్యూరు, నందిగామ, తిరువూరు, నూజివీడు మున్సిపాలిటీల పరిధిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ఒక్కో మున్సిపాలిటీలో నెలకు సుమారు కోటి రూపాయల చొప్పున డ్వాక్వా రుణాల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని బ్యాంకర్లు చెబుతున్నారు. విజయవాడ నగరంలో లక్షన్నర మంది డ్వాక్వా గ్రూపు సభ్యులు ఉండగా... ఏప్రిల్‌లో 20శాతం మంది, మేలో 10 శాతం మంది మాత్రమే నెలవారీ వాయిదాలను చెల్లించారని బ్యాంకు అధికారులు తెలిపారు.
ఈ చొప్పున నగరంలో నెలకు మూడు కోట్లకు పైగా ప్రతీ బ్యాంక్‌కు డ్వాక్వా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గత నాలుగు నెలలుగా సుమారు రూ.470 కోట్ల మేరకు లావాదేవీలు నిలిచిపోయినట్లు భావిస్తున్నారు. పాత బకాయిలు సక్రమంగా చెల్లిస్తేనే కొత్త రుణాలిచ్చే అవకాశం ఉందని బ్యాంకర్లు చెబుతున్నారు.
ఇతర రుణాలపైనా ప్రభావం...!
సక్రమంగా వాయిదాలు చెల్లిస్తున్న డ్వాక్రా గ్రూపు సభ్యులు తిరిగి రుణం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇవ్వలేని పరిస్థితి నెలకొందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. పెద్దమొత్తంలో లావాదేవీలు నిలిచిపోవడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా మంజూరు చేసిన రుణాలను కూడా మంజూరు చేయలేకపోతున్నారు. తమకు డబ్బులు రొటేషన్ కావడం లేదని, అందువల్లే రుణాల దరఖాస్తులను పక్కన పెడుతున్నామని ఓ వాణిజ్య బ్యాంకు అధికారి తెలిపారు.