పాణ్యం: డప్పుల మోతలు..యువత కేరింతలు..చిన్నారుల చిందులు..గణపతి బప్పా..మోరియా అంటూ నినాదాలు..గణేశ్ నిమజ్జనోత్సవం ఆద్యంతం ఆసక్తిగా సాగి పూర్తవుతున్న సమయంలో అనుకోని విషాదం. వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న తరుణంలో ఈత రాక ఓ విద్యార్థి మృతి. పాణ్యం చెరువులో శనివారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం సోమాపురం గ్రామానికి చెందిన రామాంజినేయులు కుమారుడు మహేష్(19)..బనగానపల్లె సమీపంలోని నందివర్గం వద్దనున్న ఓ ప్రయివేట్ కళాశాలలో డీఎడ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
ప్రస్తుతం ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగుతున్నాయి. నాలుగు పరీక్షలు పూర్తికాగా..ఇంకా రెండు రాయాల్సి ఉంది. బనగానపల్లెలోని ఓ కళాశాలలో పరీక్ష రాసి అక్కడి నుంచి స్నేహితులతో కలిసి మహేష్.. పాణ్యం గ్రామంలో నిమజ్జనోత్సవానికి వచ్చాడు. స్నేహితులతో ఆనందంగా గడిపాడు. పాణ్యం చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న తరుణంలో మహేష్ నీటిలో దిగాడు. కొద్ది సేపటికే మునిగిపోయాడు. మునుగుతున్న సమయంలో పక్కనే ఉన్న వారి కాళ్లు పట్టుకున్నట్లు సాక్షులు చెప్పారు. గ్రామస్తులు దాదాపు రెండు గంటల పాటు గాలించారు. గజ ఈతగాళ్ల సాయంతో వినాయక నిమజ్జన ఘాట్ సమీపంలోని బురదలో ఇరుక్కుపోయిన మృతదేహాన్ని బయటకు తీశారు.
ట్రాక్టర్ బోల్తా 8 మందికి గాయాలు
కోసిగి:పెద్దభూంపల్లి గ్రామంలో వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడి 8 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. శనివారం సాయంత్రం వినాయక విగ్రహాల ర్యాలీ అనంతరం నిమజ్జనం కోసం ఐరన్‌గల్లు మీదుగా తుంగభద్ర నదికి తరలిస్తుండగా గ్రామ శివారులో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. ప్రమాదంలో నరసింహులు, హనుమంతు, మల్లికార్జున, రామకృష్ణ, రాఘవేంద్రలతో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని ద్విచక్ర వాహనాలపై కోసిగికు తీసుకొచ్చి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించారు. ఇన్‌చార్జ్ తహసీల్దార్ రజనీకాంత్ రెడ్డి, ఎస్‌ఐ అశోక్ కుమార్‌లు ఆస్పత్రికి చేరుకొని బాలుర పరిస్థితిని తెలుసుకొని వెంటనే 108 వాహనంలో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
సౌకర్యాలు నిల్..
పాణ్యం చెరువు వద్ద ఏర్పాటు చేసిన వినాయక ఘాట్‌లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. చెరువులోకి దిగే సమయంలో మెట్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. విద్యుత్ దీపాలు కూడా అరకొరగా వేశారు. నిమజ్జన సమయంలో గజ ఈతగాళ్లు సైతం ఘాట్ వద్ద లేరు. ఏర్పాట్లు అరకొర ఉండడం, అప్రమత్తంగా లేకపోవడంతో ఓ నిండు ప్రాణం బలైందనే ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment