![డిగ్రీ విద్యార్థి దుర్మరణం](/styles/webp/s3/article_images/2017/09/3/61457650708_625x300.jpg.webp?itok=VERKa5xJ)
డిగ్రీ విద్యార్థి దుర్మరణం
గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం
గిద్దలూరు మండలం పాతపాడు సమీపంలో ఘటన..
కొనకనమిట్ల : గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థి దుర్మరణం పాలయ్యూడు. ఈ సంఘటన ఒంగోలు- గిద్దలూరు రహదారిలోని పాతపాడు సమీపంలో గురువారం ఉదయం జరిగింది. వివరాలు.. కొనకనమిట్ల మండలం చినమనగుండం ఎస్సీ కాలనీకి చెందిన పాపాబత్తిన బాబు కుమారుడు ప్రవీణ్‌కుమార్ (20) పొదిలి ఎస్‌ఎస్‌ఎన్ కాలేజీలో బీఎస్సీ (కంప్యూటర్స్) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షలు దగ్గర పడుతుండటంతో పొదిలిలో తన బాబాయి ఇంట్లో ఉంటూ కాలేజీకి వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రవీణ్‌కుమార్ బుధవారం సాయంత్రం గొట్లగట్టు వచ్చి తన మిత్రునికి చెందిన బైకుపై మళ్లీ పొదిలి వెళ్లాడు. రాత్రి పొదిలిలో ఉండి గురువారం ఉదయాన్నే పొదిలి నుంచి స్వగ్రామం చినమనగుండం వస్తున్నాడు.
పాతపాడు సమీపంలో ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రవీణ్‌కుమార్ ఎగిరి రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఢీకొట్టిన వాహనం ఆగకుండా వెళ్లింది. ప్రవీణ్‌కుమార్ తల్లిదండ్రులు సంఘటన స్థలానికి వచ్చి కన్నీటిపర్యంతమయ్యూడు. కాలేజీ ప్రిన్సిపాల్ కేవీఆర్ కృష్ణారెడ్డి, విద్యార్థులు సంఘటన స్థలానికి చేరుకొని విచారం వ్యక్తం చేశారు. ఎస్సై బ్రహ్మనాయుడు వచ్చి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.