ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ
Published Sun, Jan 26 2014 12:57 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
గుంటూరుసిటీ, న్యూస్‌లైన్ :ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఓటు హక్కు తప్పనిసరని జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 4వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 35 లక్షలమంది ఓటర్లున్నారని, 3.5 లక్షల మందిని కొత్త ఓటర్లుగా చేర్చినట్టు పేర్కొన్నారు. జిల్లా జడ్జి ఎస్‌ఎం.రఫీ మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన వారు తమకు నచ్చిన, మెచ్చిన నాయకులను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోవాలని కోరారు. బాధ్యతగా భావించి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జేసీ వివేక్ యాదవ్ మాట్లాడుతూ ఓటు హక్కు చాలా విలువైందన్నారు.
రాజ్యాంగం ద్వారా పొందిన ఈ హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్బన్ ఎస్పీ జెట్టి గోపీనాథ్ మాట్లాడుతూ నిబద ్ధతతో, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. రూరల్ ఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ ఓటు హక్కుతో దేశ ప్రగతికి బాటలు వేయాలని సూచించారు. ఓటు హక్కు విలువను తెలిపే సందేశాన్ని వినిపించారు. కార్యక్రమానికి అడిషనల్ మున్సిపల్ కమిషనర్ పి.శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. ఓటు హక్కును ఎక్కువసార్లు వినియోగించుకుని ఆదర్శంగా నిలిచిన సిహెచ్ దుర్గయ్య, ఎన్‌ఎం. శేషగిరి, డి.హనుమంతరావు, తిరుపతయ్యలను ఈ సందర్భంగా శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. విద్యార్థినుల నృత్యాలు అలరించాయి. అనంతరం వ్యాసరచన, డ్రాయింగ్, డిబేట్, క్విజ్ విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పంపిన సర్టిఫికెట్లను శాసనసభ్యుడు ఎస్‌కే మస్తాన్‌వలీ, కలెక్టర్, జిల్లా జడ్జి పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు జేసీ కె.నాగేశ్వరరావు, డీఆర్వో కె.నాగబాబు, డీఈవో డి.ఆంజనేయులు, మెప్మా పిడి కృష్ణకపర్థి, డ్వామా పిడి ఎస్.ఢిల్లీరావు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు.
విద్యార్థుల ర్యాలీ...
ఓటు హక్కు విలువ తెలుపుతూ తొలుత పోలిసు పరేడ్ గ్రౌండ్ నుంచి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ ఆచార్య వియ్యన్నారావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటామని ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, కలెక్టర్, జేసీ, ఏజేసీ తదితరులు ప్రమాణం చేశారు.
Advertisement
Advertisement