
తాడికొండలో నీటి నిల్వలను తొలగిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది
గుంటూరు మెడికల్: కృష్ణాజిల్లా నందిగామకు చెందిన విద్యార్థిని మారం జయశ్రీ (18) సోమవారం డెంగీ జ్వరంతో మృతిచెందింది. రాజధాని జిల్లా గుంటూరులో సైతం డెంగీ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. డెంగీ జ్వరం సోకినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోని పక్షంలో మరణాలు సంభవించే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్‌గా రామాంజనేయులు ఉన్న సమయంలో గుంటూరు జిల్లాలో పెద్ద సంఖ్యలో డెంగీ జ్వరాలు సోకి మరణాలు సంభవించడంతో హెల్త్ ఎమర్జన్సీ సైతం ప్రకటించారు. డెంగీ జ్వరంపై ప్రజలకు అవగాహన లేకపోవటంతో చాలా మంది ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో ప్లేట్‌లెట్స్ పేరిట జ్వరం బాధితుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. కొంతమంది బొప్పాయి రసం తాగితే, బొప్పాయి తింటే ప్లేట్‌లెట్స్ పెరుగుతాయనే అపోహల్లో ఉండి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. డెంగీపై కొద్దిపాటి అవగాహన కల్గి ఉండి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే జ్వరం బారిన పడకుండా ఉండవచ్చు. ప్రజలకు డెంగీ జ్వరంపై అవగాహన కల్పించేందుకు ‘సాక్షి ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
డెంగీ జ్వరం లక్షణాలు...
పగటి వేళల్లో కుట్టే ఎడిస్ ఈజిస్ట్ అనే దోమకాటు వల్ల డెంగీ జ్వరం వస్తుంది. జ్వరం వచ్చినప్పుడు వాంతులు, తలనొప్పి, కంటి గుడ్డు కదిలినప్పుడు నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, వాంతి అయినట్టు భ్రాంతి కలగడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఒంటిపై ఎర్రటి గుల్లలు ఏర్పడి, ప్లేట్‌లెట్స్ తగ్గిపోయి ఒక్కోసారి రక్తస్రావం జరుగుతుంది. రక్తపరీక్ష చేసి ఎలీసా పద్ధతిలో డెంగీ జ్వరాన్ని నిర్ధారణ చేస్తారు.
దోమలు పెరిగే ప్రదేశాలు...
డెంగీ జ్వరాన్ని కలుగజేసే దోమలు మంచినీటిని నిల్వచేసే ప్రదేశంలో పెరుగుతాయి. వాడి పారేసిన వస్తువులు, నీటిని నిల్వచేసే డ్రమ్ములు, తొట్టెలు, గాబులు, రుబ్బురోళ్లు, వాడి పారేసిన టైర్లు, టీ కప్పులు, ప్లాస్టిక్ కప్పులు, వాడి పారేసిన కొబ్బరి చిప్పలు, కొబ్బరి బొండాలు, ఫ్రిజ్, ఎయిర్ కూలర్స్ వెనుక భాగాల్లో, పూల కుండీలు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, నీటి సంపుల్లో దోమ లార్వాలు పెరుగుతాయి.
తాడికొండలో డెంగీ కేసు నమోదు
తాడికొండ: తాడికొండలో డెంగీ కేసు నమోదైంది. పెదపరిమి రోడ్డులోని స్కౌట్స్ అండ్ గైడ్స్ భవనం సమీపంలో చెరుకూరి ప్రణవ్ తేజ(8) అనే చిన్నారికి డెంగీ జ్వరం సోకింది. ఈనెల 3వ తేదీన జ్వరం రావడంతో స్థానిక ఆసుపత్రుల్లో తిరిగినా ఫలితం లేకపోవడంతో గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉంది. అయితే డెంగీ కేసు నమోదైందని వైద్య ఆరోగ్య శాఖాధికారుల దృష్టికి సమాచారం అందడంతో మంగళవారం ఆ ప్రాంతానికి చేరుకున్న మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ రత్నాకర్ పంచాయతీ సిబ్బంది సహకారంతో నిల్వ ఉన్న నీటిని మళ్లించడంతో పాటు ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. గ్రామంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు అపరిశుభ్ర వాతావరణం ఏర్పడింది. ఇటీవల గ్రామంలో నూతనంగా డ్రెయిన్‌లు అసంపూర్ణంగా నిర్మించి వదిలేయడంతో మురుగు ముందుకు కదిలే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఎక్కడి నీరు అక్కడే నిలిచి ప్రధాన రహదారుల వెంట దుర్గంధం వెదజల్లుతోంది. శివారు ప్రాంతాల్లో సైతం మురుగు దెబ్బకు పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో జనం నానా అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు సత్వరమే స్పందించి అపరిశుభ్ర వాతావరణం తొలగించి దోమల నివారణకు చర్యలు తీసుకోకపోతే రోగాలు విజృంభించే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లేట్‌లెట్స్‌పై అపోహలు వీడండి
ఎలాంటి జ్వరం వచ్చినా ప్లేట్‌లెట్స్ తగ్గడం సహజంగా జరుగుతుంది. అంతమాత్రానికే రోగులు కంగారు పడకూడదు. సాధారణంగా 1.5 లక్షల నుంచి 4.5 లక్షల ప్లేట్‌లెట్స్ ఉంటాయి. వీటి సంఖ్య 20 వేల కన్నా తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ప్రమాదం సంభవించదు. శరీరంపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడి అవి పగిలి వాటి ద్వారా రక్తం వస్తే, మూత్రంలో, దగ్గుతున్నప్పుడు కళ్లె ద్వారా రక్తం పడిపోతూ ఉంటే అప్పుడు ప్లేట్‌లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది.–డాక్టర్ కె.కళ్యాణ చక్రవర్తి, జ్వరాల స్పెషలిస్ట్, హెల్ప్ హాస్పటల్
Comments
Please login to add a commentAdd a comment