డీఈఓకు జ్ఞాపికను అందజేస్తున్న ఆదిత్య కళాశాల యాజమాన్యం
సాక్షి, టెక్కలి(శ్రీకాకుళం) : దేశ ప్రతిష్ట పెంచేందుకు ప్రతి విద్యార్థి కృషి చేయాలని, భవిష్యత్‌లో అంతరిక్ష శాస్త్రవేత్తలుగా ఎదగాలని డీఈఓ కె.చంద్రకళ ఆకాంక్షించారు. ఇస్రో, షార్ ఆధ్వర్యంలో టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 5 నుంచి జరుగుతున్న అంతరిక్ష వారోత్సవాల వైజ్ఞానిక ప్రదర్శనలు సోమవారంతో ముగిశాయి. ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ మాట్లాడుతూ అంతరిక్ష శాస్త్రవేత్తలుగా ఎదగాలంటే విద్యార్థి స్థాయి నుంచి గణితం, ఫిజిక్స్‌పై మక్కువ పెంచుకోవాలని సూచించారు. అంతరిక్ష ప్రయోగాల విజయం వెనుక ఎంతో మంది శాస్త్రవేత్తల కృషి ఉంటుందన్నారు. అంతరిక్ష శాస్త్రవేత్తగా ప్రయాణం మొదలు పెట్టి రాష్ట్రపతిగా దేశానికి గుర్తింపు తీసుకువచ్చిన అబ్దుల్ కలాం వంటి మహానుభావుల అడుగు జాడల్లో నడవాలన్నారు.
క్విజ్, చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఇస్రో ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. ఇస్రో ప్రతినిధులు, కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో డీఈఓను సన్మానించి జ్ఞాపికను అందజేశారు. టెక్కలి ఎస్‌ఐ బి.గణేష్ వైజ్ఞానిక ప్రదర్శనలను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఇస్రో గ్రూప్ డైరక్టర్ ఎ.ప్రసాదరావు, ప్రోగ్రాం మేనేజర్ టి.హరికృష్ణ వైజ్ఞానిక ప్రదర్శన కన్వీనర్ పీ.శ్రీనివాసులు, డీజీఎం అప్పన్న, డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ ఎం.రమణా రావు, ఆదిత్య కళాశాల డైరక్టర్ వి.వి. నాగేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్. నాయుడు, కోశాధికారి టి.నాగరాజు, ప్రిన్సిపాల్ ఏ.ఎస్.శ్రీనివాసరావు, డీన్ డి.విష్ణుమూర్తి, ఉప విద్యా శాఖాధికారి కే.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.
ఆనందంగా ఉంది
ఇస్రో ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్‌పోటీల్లో జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల మాలాంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అంతరిక్ష అంశాల ఎంతో విజ్ఞానం లభిస్తుంది.
– డి.శ్రీకాంత్, క్విజ్ విజేత, పోలవరం, టెక్కలి మండలం
ఆసక్తి కలుగుతోంది
ఇస్రో నిర్వహించిన అంతరిక్ష వారోత్సవాల్లో చివరిగా జరిగిన చిత్రలేఖనం పోటీల్లో జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం నిలిచాను. గత 3 రోజులుగా జరిగిన వైజ్ఞానిక ప్రదర్శనలు చూసిన తరువాత అంతరిక్ష అంశాలపై ఎంతో ఆసక్తి కలుగుతోంది.
– వి.ఖగేశ్వరి, చిత్రలేఖనం విజేత, నర్సింగపల్లి, టెక్కలి మండలం
ఎంతగానో ఉపయోగం
ఇస్రో ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల కోసం ఇటువంటి అంతరిక్ష వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేసి, వివిధ రకాల పోటీలు నిర్వహించడం ఎంతగానో ఉపయోగం. చిత్రలేఖనం పోటీల్లో ప్రథమ స్థానంలో విజేత కావడం ఎంతో ఆనందంగా ఉంది.
–ఎం.దినేష్, చిత్రలేఖనం విజేత, నౌపడ, సంతబొమ్మాళి మండలం
Comments
Please login to add a commentAdd a comment