విద్యుత్ శాఖకు హెలెన్ షాక్
Published Sun, Nov 24 2013 4:26 AM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM
సాక్షి, రాజమండ్రి :హెలెన్ తుపాను కోనసీమలో విద్యుత్ వ్యవస్థను కకావికలం చేసింది. గత నెలలో భారీ వర్షాలు జిల్లాలో విద్యుత్ శాఖకు రూ.1.13 కోట్ల మేర నష్టాన్ని కలుగజేయగా, ప్రస్తుతం హెలెన్ మరో రూ.కోటి మేర నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలో ఎక్కువగా కోనసీమలో నష్టం వాటిల్లింది. గ్రామాల్లో ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వందల కిలోమీటర్ల మేర విద్యుత్ తీగలు కుప్పకూలిన చెట్లలో చిక్కుకున్నాయి. యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించినా.. మరో 48 గంటలు దాటితే మినహా కోనసీమ పల్లెల్లో కరెంటు దీపాలు వెలిగే అవకాశం కనిపించడం లేదు.
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
జిల్లావ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి అంధకారం అలుముకుంది. శుక్రవారం నాటికి నగరాలు, పట్టణాలకు అధికార యంత్రాంగం విద్యుత్ సరఫరా చేసింది. శనివారం ఉదయం నాటికి వీటిలో సుమారు రెండు లక్షల సర్వీసులకు కరెంటు సమస్య కొనసాగింది. సాయంత్రం వరకూ లక్ష వరకు సర్వీసులను పునరుద్ధరించగలిగారు. కాగా కోనసీమలో 250 గ్రామాల్లో ఇంకా లక్ష సర్వీసులకు విద్యుత్ సరఫరా లేదు. వీటి పునరుద్ధరణకు మరో 48 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
నష్టం తీరు ఇలా..
జిల్లాలో 19 సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. 33/11 కేవీ స్తంభాలు 11 నేలకూలాయి. శనివారం సాయంత్రానికి 90 శా తం చక్కదిద్దారు. 15.47 కిలోమీటర్ల పరిధిలో 11 కేవీ విద్యుత్ పంపిణీ చేసే 559 స్తంభాలు నేలకూలాయి. వీటిని పునరుద్ధరించే చర్యలు వేగవంతం చేశామని ఈపీడీసీఎల్ రాజమండ్రి సర్కిల్ ఎస్‌ఈ వైఎల్‌ఎన్ ప్రసాద్ తెలిపారు. 200 కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఎల్‌టీ సరఫరా స్తంభాలు కూలిపోగా, వాటిని సరిదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ముం దుగా 11 కేవీ లైన్లు పునరుద్ధరణ పూర్తయితే కానీ గృహ వినియోగ పంపిణీని సరిచేయడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ స్తంభాలు, లైన్లు తదితర పరికరాలకు వాటిల్లిన నష్టం రూ.88 లక్షలు కాగా, మరో రూ.12 లక్షల మేరకు పంపిణీ పరికరాలకు నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement