నెలాఖరులోగా ‘అమ్మఒడి’ అర్హుల జాబితా | Department of School Education released new guidelines | Sakshi
Sakshi News home page

నెలాఖరులోగా ‘అమ్మఒడి’ అర్హుల జాబితా

Published Sat, Nov 23 2019 5:04 AM | Last Updated on Sat, Nov 23 2019 5:04 AM

Department of School Education released new guidelines - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. నవంబర్‌ నెలాఖరులోగా అర్హుల జాబితా రూపొందించేందుకు వీలుగా షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇప్పటికే ‘చైల్డ్‌ ఇన్ఫో’లో నమోదైన  సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్‌ సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ సిస్టమ్స్, సర్వీసెస్‌కు(ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌) అందించారు. ఆ సమాచారాన్ని తెల్లరేషన్‌కార్డుల సమాచారంతో అనుసంధానించి, ఆ వివరాలను పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు(హెచ్‌ఎం) అందుబాటులో ఉంచుతారు.

షెడ్యూల్‌ ఇలా..  
- నవంబర్‌ 24న హెచ్‌ఎంలకు యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇస్తారు. ఈలోగా హెచ్‌ఎం పిల్లల హాజరు శాతాన్ని సిద్ధం చేయాలి. స్కూళ్లు ప్రారంభమైనప్పటి నుంచి హాజరును లెక్కించాలి. ఎవరైనా విద్యార్థులు మధ్యలో చేరినట్లయితే వారు చేరిన తేదీ నుండి హాజరు శాతాన్ని లెక్కగట్టాలి.  
ప్రధానోపాధ్యాయులు విద్యార్థి తల్లి/సంరక్షకుల ఆధార్‌ నెంబరు, నివాస గ్రామం, బ్యాంక్‌ ఖాతా సంఖ్య, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ సేకరించాలి. లాగిన్‌ ద్వారా వచ్చిన సమాచారాన్ని సరిపోల్చుకోవాలి. లోపాలుంటే సరిదిద్దాలి. ఆ సమాచారాన్ని ఎంఈఓలకు అందజేయాలి.  
100 లోపు విద్యార్థులున్న పాఠశాలలు ఆన్‌లైన్‌లో వివరాల నమోదును నవంబర్‌ 25వ తేదీలోగా పూర్తి చేయాలి 
100 నుంచి 300 మంది పిల్లలున్న పాఠశాలలు 26వ తేదీలోగా పూర్తి చేయాలి. 
300, అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలు 27వ తేదీలోగా పూర్తి చేయాలి.  
ప్రధానోపాధ్యాయుల నుంచి వచ్చిన సమాచారాన్ని ఎంఈవోలు ప్రింట్‌ చేసి, గ్రామ సచివాలయ విద్యాసంక్షేమ సహాయకునికి అందించాలి. వారు లేకపోతే సీఆర్పీలకు ఇవ్వాలి. 
విద్యాసంక్షేమ సహాయకులు క్షేత్రస్థాయిలో కుటుంబాల వారీగా పరిశీలన చేయాలి. తెల్లరేషన్‌కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ తదితర వివరాలు సేకరించాలి. రేషన్‌కార్డులు లేకుంటే ఆరు అంచెల పరిశీలన ద్వారా వారు నిరుపేదలు లేదా అమ్మ ఒడి పథకానికి అర్హులేనన్న అంశాన్ని ధ్రువీకరించుకోవాలి. నవంబర్‌ 31వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. గ్రామ సచివాలయ సిబ్బంది ఈ సమాచారాన్ని ఎంఈఓలకు అందించాలి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement