
స్విమ్స్ టెండర్లలో మాయాజాలం
ప్రస్తుతం స్విమ్స్‌లో చర్చనీయాంశం గా మారిన టెండర్ల రద్దు వ్యవహారంలో ఇద్దరు డిప్యూటీ డెరైక్టర్లదే కీలక మంత్రాంగమని ..
స్విమ్స్ టెండర్లలో మాయాజాలం
చక్రం తిప్పుతున్న డిప్యూటీ డెరైక్టర్లు
బంధుగణ ప్రయోజనాలే లక్ష్యం
టీడీపీ, బీజేపీ పెద్దలదే తెరవెనుక మంత్రాంగం
తిరుపతి: ప్రస్తుతం స్విమ్స్‌లో చర్చనీయాంశం గా మారిన టెండర్ల రద్దు వ్యవహారంలో ఇద్దరు డిప్యూటీ డెరైక్టర్లదే కీలక మంత్రాంగమని తెలుస్తోంది. అధికార పార్టీ పెద్దల ఆశీ స్సులు పుష్కలంగా ఉన్న వీరిద్ధరి నిర్ణయాలకు ఎదురు చెప్పే ధైర్యం లేక టెండరు కమిటీల్లోని మిగతా సభ్యులు తమ నిర్ణయాలను స్వేచ్ఛగా వెలిబుచ్చే విషయంలో వెనుకంజ వేస్తున్నారు. తాజాగా చోటుచేసుకున్న పరి ణామాలను పరిశీలిస్తే ఇది తేటతెల్లమవుతోంది. స్విమ్స్‌లో శానిటేషన్, పారామెడికల్, సెక్యూరిటీ, నాన్‌పారా మెడికల్ ఉద్యోగుల సరఫరా కోసం అక్టోబరు 6న పిలిచిన రూ.1.65 కోట్ల టెండరును అదే నెల 28న తెరిచారు. ఇందులో ఎల్-1గా నిలిచిన చైతన్యజ్యోతి సొసైటీకి వర్క్ ఆర్డర్ ఇవ్వాల్సిన తరుణంలో టెండర్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అధికారికంగా బయటికి వచ్చిన కారణాలు ఏమైనప్పటికీ అసలు కారణాలు వేరే ఉన్నాయని తెలుస్తోంది. తమకు అనుకూలమైన కాంట్రాక్టర్ల ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్న డిప్యూటీ డెరైక్టర్లు బంధుప్రీతితో టెండర్ల రద్దుకు చక్రం తిప్పారని తెలుస్తోంది. అధికార పార్టీ లోని కొందరు మంత్రులు, వారి వద్ద పనిచేసే వ్యక్తులు ఇందులో తలో చేయి వేశారు. దీంతో నాలుగోసారి టెండర్లు రద్దయ్యాయి. టెండర్లను ర ద్దు చేసిన స్విమ్స్ డెరైక్టర్ ఉన్నపళంగా అమెరికా పయనమై వెళ్లడం కూడా అనుమానాలకు తావిస్తోంది.
బాధ్యతల నుంచి వైదొలిగిన ఇద్దరు అధికారులు
టెండర్ల రద్దు వ్యవహారం తెరమీదకు రావడంతో గురువారం సాయంత్రం వేర్వేరు బాధ్యతల్లో ఉన్న ఇద్దరు స్వి మ్స్ అధికారులు బాధ్యతల నుంచి త ప్పుకున్నట్లు తెలిసింది. ఇన్‌చార్జి రిజిస్ట్రార్ వాసుదేవరెడ్డి, మెడికల్ కా లేజీ ప్రిన్సిపల్ హనుమంతరావు స్వ చ్ఛందంగా బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ఉన్నతాధికారులకు చెప్పినట్లు సమాచారం. ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా డాక్టర్ కళావత్‌ను కూడా నియమించినట్లు తెల్సింది. టెండరు కమిటీలో సభ్యుడైన వాసుదేవరెడ్డి టెండర్లపరంగా జరుగుతున్న అనధికార నిర్ణయాలను, స్విమ్స్‌లో జరిగే కార్యకలాపాలను వ్యతిరేకిస్తూ పక్కకు తప్పుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
సీఎం ఆరా...
స్విమ్స్ టెండర్లు నాలుగోసారి రద్దయిన వ్యవహారంపై సీఎం చంద్రబాబునాయుడు ఆరా తీసినట్లు తెల్సింది. ఎవరెవరు బిడ్లు వేశారు, టెండర్లు ఎవరికి దక్కాయన్న వివరాలతో తాజా వ్యవహారాలపై మంత్రి కామినేని శ్రీనివాస్‌తో మాట్లాడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా తనకు దక్కాల్సిన టెండర్లను అన్యాయంగా రద్దు చేశారని చైతన్యజ్యోతి సొసైటీ అధ్యక్షుడు ప్రసాదరెడ్డి, సభ్యుడు నాగార్జునరెడ్డిలు చేసిన ఫిర్యాదును సీఎం పేషీ స్వీకరించింది. 2016-6098560 నెంబరు కింద ఫిర్యాదును స్వీకరించి విచారణ జరిపి సమస్యను పరిష్కరించాలని చిత్తూరు కలెక్టర్‌కు సూచించినట్లు తెల్సింది.