వేంపల్లె మండల ఉపాధ్యక్షుడి హత్య
- బైక్‌ను సుమోతో ఢీకొట్టి.. ఆపై కొడవళ్లతో దాడి
- ఐదుగురు అధికార పార్టీ నేతలపై ఫిర్యాదు
వేంపల్లె: వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండల ఉపాధ్యక్షుడు గజ్జెల రామిరెడ్డి(42) శుక్రవారం మధ్యాహ్నం దారుణహత్యకు గురయ్యారు. అధికారపార్టీకి చెందిన ప్రత్యర్థులే రామిరెడ్డిని హతమార్చారని వారి బంధువు రామిరెడ్డి శేఖరరెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాలస్వామిరెడ్డి, ఆయన సోదరులు రాజశేఖరరెడ్డి, మరియానందరెడ్డితో పాటు పేరం కృష్ణారెడ్డి, జూద రాఘవరెడ్డి రామిరెడ్డిపై కొడవళ్లు, ఇనుపరాడ్లతో దాడిచేసి హతమార్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రామిరెడ్డి శేఖరరెడ్డి కథనం మేరకు..వేంపల్లె మండలం అలవలపాడు గ్రామానికి చెందిన గజ్జెల రామిరెడ్డి గత సెప్టెంబర్ 29న మండల ఉపాధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం స్థానిక ఎంపీడీఓ సభాభవనంలో ఆయన అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ సమావేశం మధ్యాహ్నం 2గంటలకు అయిపోగానే.. బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. బస్టాండ్ వద్ద రామిరెడ్డి శేఖరరెడ్డి, పుల్లారెడ్డి ఉండగా.. ఇంటికి రమ్మని పిలిచాడు. దీంతో శేఖరరెడ్డి, పుల్లారెడ్డి అతని వెనుక మరో బైకుపై బయలుదేరారు. అయ్యవారిపల్లె–అలవలపాడు మధ్యలో ప్రత్యర్థులు ఒక తెలుపురంగు సుమోతో రామిరెడ్డి బైక్‌ను ఢీకొట్టారు. అతను కిందపడిన తర్వాత ప్రత్యర్థులు వేటకొడవళ్లు, ఇనుప రాడ్లతో దాడిచేశారు. అది చూసిన శేఖరరెడ్డి, పుల్లారెడ్డి ప్రాణభయంతో పారిపోయారు. అదే సమయంలో అలవలపాడు వైపు నుంచి వెంకటేశ్వరరెడ్డి, చిన్న నాగిరెడ్డి ఆటోలో వేంపల్లెకు వస్తుండగా మధ్యలో రామిరెడ్డిపై ప్రత్యర్థులు దాడి చేస్తుడటం చూసి కేకలు వేశారు. దుండగులు వారిపైకీ వెళ్లడంతో ప్రాణభయంతో పారిపోయారు. పారిపోయిన నలుగురు అలవలపాడుకు వెళ్లి విషయం చెప్పారు. అంతలోపే ఎవరో రామిరెడ్డి మృతదేహాన్ని వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ఈ మేరకు వేంపల్లె పోలీస్‌స్టేషన్‌లో శేఖరరెడ్డి ఫిర్యాదు చేశారు.