
గొడవ.. గొడవ !
* ఉండవల్లి ఇసుక క్వారీ ప్రారంభోత్సవంలో అధికారులు, ట్రాక్టర్ యజమానుల మధ్య వాగ్వాదం
* చలానాల చెల్లింపుపై వివరణ కోరిన కుంచనపల్లి సర్పంచ్
* దురుసుగా ప్రవర్తించిన అధికారులు
* పోలీస్ కేసు పెట్టిస్తానని డీఆర్‌డీఏ ఏపీడీ బెదిరింపు
తాడేపల్లి రూరల్ : ఇసుక తరలింపు విషయమై అధికారులు, ట్రాక్టర్ యజమానులు, ఓ సర్పంచ్ మధ్య జరిగిన వాగ్వాదం చివరకు గొడవకు దారితీసిన సంఘటన గురువారం ఉండవల్లిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... ఉండవల్లి ఇసుక క్వారీని ప్రభుత్వం డ్వాక్రా గ్రూపు మహిళల కు అప్పగించింది. దీనిలో భాగంగా గురువారం క్వారీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యఅతిథిగా డీఆర్‌డీఏ ఏపీడీ పొట్లూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు విచ్చేశారు. అంతకు ముందే కొందరు ట్రాక్టర్ యజమాను లు చలానాలు చెల్లించి, ఇసుక తరలించుకున్నారు. ఆ తరువా త గొడవ చోటుచేసుకుంది. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ట్రాక్ట ర్ యజమానులు చలానాలు ఎక్కడ చెల్లించాలి, విధానమేమిటని ఈ సందర్భంగా అధికారులను అడిగారు. దీని గురించి స్థానిక ఎంపీడీవో, తహశీల్దార్లను అడిగి తెలుసుకోవాలని అధికారులు బదులిచ్చారు.
* దీనిపై అసహనానికి గురైన ట్రాక్టర్ యజమానులు.. కొద్ది రోజులుగా చలానాల గురించి అడుగుతుంటే డీఆర్‌డీఏ ఏపీడీ, డ్వాక్రా మహిళలకే తెలుసంటూ స్థానిక అధికారులు సమాధానం ఇచ్చారని, తీరా ఇక్కడకు వస్తే, తెలియదంటున్నా రేంటని ఏపీడీని ప్రశ్నించారు.
* దీంతో సదరు అధికారి ట్రాక్టర్ యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో ట్రాక్టర్ యజమానులు గట్టిగా నిలదీయడంతో ఇసుక క్వారీ వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది.
* ఈ సమయంలో కుంచనపల్లి సర్పంచ్ బడుగు శ్రీనివాసరావు క్వారీ వద్దకు చేరుకుని, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా చలానాలు ఎలా చెల్లించాలో తెలియజేయకుండా క్వారీని ఎలా ప్రారంభిస్తున్నారని అధికారులను నిలదీశారు.
* దీనిపై ఏపీడీ దురుసుగా వ్యవహరిస్తూ, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, క్వారీ నుంచి బయటకు వెళ్లండి, లేదా పోలీసు కేసు పెడతామని కేకలేశారు.
* దీంతో బడుగు శ్రీనివాసరావు మాట్లాడుతూ ముందు వచ్చిన వారికి మాత్రమే చలానాలు ఎక్కడ కట్టాలో ముందస్తు సమాచారం ఎందుకు ఇచ్చారు? దీని వెనుక ఆంతర్యం ఏమి టి, అధికార పార్టీ నేతలకు అమ్ముడుపోయారా అంటూ ప్రశ్నించారు. కనీసం పత్రికా ప్రకటన ఇవ్వకుండా అధికారులు ఇలా సమాధానం చెప్పడం పలు అనుమానాలకు దారి తీస్తుందంటూ ఆయన అన్నారు. ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానన్నారు.