ఎవరడ్డు వచ్చినా లెక్కచేయం..
- పట్టిసీమ పూర్తి చేస్తాం: చంద్రబాబు
- కృష్ణాడెల్టా, సీమకు ఉపయోగమనే నిర్మాణం
- ఏడాదిలోగా పట్టిసీమ పూర్తిచేయకపోతే బోనస్ ఇవ్వబోమని టెండరులో పెట్టాం
- ఐదేళ్లలో 30 లక్షల ఎకరాలకు సాగునీరు
- మిగులు జలాలపై హక్కు అడగబోమని లేఖ ఇచ్చింది వైఎస్ ప్రభుత్వమే
- పోలవరం కట్టే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే
సాక్షి, హైదరాబాద్: ఎవరడ్డు వచ్చినా లెక్కచేయబోమని, పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుండబద్దలు కొట్టారు. వచ్చే ఐదేళ్లలో 30 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు ఇవ్వడం టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నదుల అనుసంధానంపై అసెంబ్లీలో బుధవారం 344 నిబంధన కింద జరిగిన చర్చలో సీఎం ఈ మేరకు స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందంటూ.. కృష్ణా డెల్టా, రాయలసీమకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే పట్టిసీమ ప్రాజెక్టును చేపడుతున్నామని చెప్పుకొచ్చారు. ‘‘ఆల్మట్టి ఎత్తు పెంచడానికి వీలులేదని గతంలో ప్రధానమంత్రి దేవెగౌడతో నేను వాదన పెట్టుకున్నా. అస్సాం, బిహార్, పశ్చిమబెంగాల్, తమిళనాడు సీఎంలతో నిపుణుల కమిటీ వేయించా. బచావత్ ట్రిబ్యునల్ పూర్తయి కొత్త ట్రిబ్యునల్ వచ్చేవరకూ ఆంధ్రప్రదేశ్ మిగులు జలాలు వాడుకోవచ్చని కమిటీ పేర్కొంది. ఆల్మట్టి ఎత్తు 519.6 మీటర్లకే పరిమితం కావాలని రిపోర్టు ఇచ్చింది. దీనిపై కర్ణాటక కోర్టుకు వెళ్లింది.. ఇలా ఆల్మట్టి ఎత్తు పెంచకుండా మేం ఆపగలిగాం. తర్వాత కొత్త ట్రిబ్యునల్ వేశారు. అప్పటి ప్రభుత్వం వాదనలకోసం సుదర్శన్‌రెడ్డిని అడ్వొకేట్ జనరల్‌గా నియమించింది.
ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న ఐదు ప్రాజెక్టులకు మిగులు జలాలపై హక్కు అడగబోమని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు ప్రభుత్వం 2006లో లేఖ ఇచ్చింది. ఎవరైనా సబ్జెక్టు స్టడీ చేయాలి. ఏదో అరకొరగా మాట్లాడి సెల్ఫ్‌గోల్ చేసుకోవడం కాదు.. 2006లో ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? మిగులు జలాలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చని మేం తెచ్చుకుంటే.. వాటిపై హక్కు అడగబోమని ఆయన(జగన్) తండ్రి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు లేఖ ఇస్తే ఏమనాలి? మీ చేతగానితనంవల్ల రాష్ట్ర హక్కులు తాకట్టు పెట్టారు. మీరు కాంట్రాక్టర్ల ప్రయోజనాలు చూశారేగానీ రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోలేదు’’ అని చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు.
టెండరు నిబంధనల్లో పెట్టాం
పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో ఎక్సెస్‌కు సంబంధించి టెండరు నిబంధనావళి 28-1(బి)లో స్పష్టంగా పెట్టామని సీఎం పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తికి సంవత్సరం దాటి ఒక్కరోజు జరిగినా 16.9 శాతం బోనస్‌ను చెల్లించేది లేదని నిబంధన పెట్టామన్నారు. పోలవరం పూర్తి చేయడానికి నాలుగున్నరేళ్లు పడుతుందని, దీనిని పరిగణనలోకి తీసుకున్నాకే పట్టిసీమ చేపట్టాలని నిర్ణయించామని చెప్పారు. ఏటా సగటున 3,000 టీఎంసీలు సముద్రంలోకి వెళుతోందని, 1,500 టీఎంసీలను రిజర్వాయర్లలో నిల్వ చేయడంద్వారా ఆంధ్రప్రదేశ్‌ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ‘‘ఏడాదిలోగా పూర్తి చేయకపోతే ప్రాజెక్టు దగ్గరే నిద్రపోతా. 2005 డిసెంబర్ 10న పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆరోజే పట్టిసీమ చేపడితే రాయలసీమకు నీరందేది. మీ ధ్యాసంతా టెండర్లు, కాలువలపైనే. మట్టిపనిపైనే. మీకు క్లారిటీ లేదు.. పాలెగాళ్ల వ్యవస్థ కొనసాగాలన్నదే మీ లక్ష్యం. రాయలసీమకు నీరొచ్చి రైతులు పంటలు పండించుకుంటే పెత్తనం పోతుందని మీరు భయపడుతున్నారు..’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
మీ తండ్రి అసమర్థుడా?
‘‘పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీరిస్తామనే అంశం జీవోలో ఉందా? అని మీరు ప్రశ్నిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు జీవోలో మీ తండ్రి ఆనాడు ఈ అంశం పెట్టారా? మరి ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదు? ఆనాడు సీఎంగా ఉన్న మీనాన్న అసమర్థుడా? చేతకానివాడా చెప్పండి’’ అని జగన్‌నుద్దేశించి సీఎం కోపంగా ప్రశ్నించారు. నదులను అనుసంధానం చేసుకుంటే రాష్ట్రంలో కరువు ఉండదన్నారు. ఇందుకు చర్యలు తీసుకోవడంతోపాటు నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా భూగర్భ జలమట్టం పెంచుతామని, పట్టిసీమ, గాలేరు-నగరి, తోటపల్లి, వంశధార ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యం కింద పూర్తి చేస్తామని ప్రకటించారు.
ఇంత ఎక్సెస్ వేస్తారని కలగన్నామా?: మంత్రి దేవినేని
పట్టిసీమ ప్రాజెక్టు కాంట్రాక్టర్ 16.9 శాతం ఎక్సెస్‌కు వేస్తారని నేనేమైనా కలగన్నానా? అని నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. చర్చకు మంత్రి సమాధానమిస్తూ.. రాయలసీమ తాగు, సాగునీటి అవసరాలు తీర్చేందుకు ఛాలెంజ్‌గా తీసుకుని ఏడాదిలోగా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. కృష్ణా జలాలకు సంబంధించి చివరిప్రాంత రైతుల సమస్యలు తనకు తెలుసని, కరువుసీమ రాయలసీమలో తాగు, సాగునీటి కష్టాలను తాను స్వయంగా చూశానని, ఈ సమస్యలను తొలగించేందుకే పట్టిసీమను చేపడుతున్నామని వివరించారు.
2018 కల్లా పోలవరం పూర్తవుతుందని, అప్పటివరకూ(ఈ నాలుగేళ్ల) అవసరాలను దృష్టిలో పెట్టుకుని పట్టిసీమను చేపట్టామని చెప్పారు. తాడిపూడి, పుష్కరం ఎత్తిపోతల పథకాల ద్వారా 3 లక్షల ఎకరాలకు నీరందిస్తామన్నారు. పోలవరం రాకముందే రైతులకు సాగునీరు అందుబాటులోకి తేవడమే వీటి లక్ష్యమన్నారు. పెండింగ్‌లో ఉన్న 30 శాతం పోలవరం కుడికాలువ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి రాయలసీమకు తాగు, సాగునీరు అందిస్తామన్నారు. దీనివల్ల కోస్తాకూ మేలు జరుగుతుందన్నారు. ‘‘మొబిలైజేషన్ అడ్వాన్సు ఇవ్వబోమని పట్టిసీమ ప్రాజెక్టు టెండర్లలో నిబంధన పెట్టాం. ఎల్ అండ్ టీ 28.9 శాతం, ఎంఈఐఎల్ 21.9 శాతం ఎక్సెస్‌కు టెండర్లు వేశాయి..’’ అని దేవినేని వివరించారు.
ఎక్సెస్ వేస్తే 16.9 శాతం బోనస్ ఇస్తామని టెండరు డాక్యుమెంటులో ఎక్కడైనా ఉందా? అని విపక్షనేత జగన్ అడిగిన ప్రశ్నకు.. ‘ఎంఈఐఎల్‌ఇంతకు వేస్తుందని నేనేమైనా కల కంటానా? ఎంతసేపూ మీ ధ్యాసంతా పర్సంటేజీలు, కమీషన్లు, కలెక్షన్లపైనే.. వరదనీటిని తెచ్చుకుని రాష్ట్ర సాగు, తాగునీటి అవసరాలు ఎలా తీర్చాలన్నదే మా ధ్యాస... జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేశారు. అవినీతి డబ్బులు మీరే కట్టాలి’’ అని ఆయన్నుద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు అంచనా వ్యయంపై ఐదు శాతం వరకూ ఎక్సెస్‌కు అనుమతిస్తామని టెండరు నిబంధనల్లో స్పష్టంగా పెట్టామన్నారు. 1988 నుంచి 2014 వరకూ ఎన్ని రోజులు వరద వచ్చిందనే గణాంకాలను మంత్రి ఈ సందర్భంగా వివరించారు.