వర్గల్, న్యూస్‌లైన్: మండల పరిధిలోని గిర్మాపూర్ దళితవాడలోని ఓ ఇంట్లో మంగళవారం ‘గ్యాస్’ సిలిండర్ పేలింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఆ కుటుంబంలోని వారంతా వంటగదికి దూరంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో పైకప్పు రేకులు ధ్వంసం కాగా, మంటలకు పలు వస్తువులు, చీరలు కాలిపోయాయి. ఈ ఘటనతో దళిత వాడ ప్రజలు భీతిల్లి పరుగులు తీశారు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన డ్యాగ వెంకటయ్య ఇంట్లో మంగళవారం ఉదయం అతని భార్య మల్లమ్మ వంటావార్పు చేసింది. భర్త, కుమారుడితోపాటు తాను కూడా భోజనం ముగించింది. అనంతరం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మల్లమ్మ ఇంటిని శుభ్రం చేసే పనిలో నిమగ్నమైంది.
ఈ సమయంలో కుటుంబ సభ్యులందరూ ఇంటి వెలుపల ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో వంట గదిలోని సిలిండర్‌కు మంటలు అంటుకున్నాయి. గది నిండా పొగ కమ్ముకోగా ఆ తర్వాత పేలిన శబ్ధం వినిపించింది. దీంతో వెంకటయ్య కుటుంబీకులతో పాటు ఇరుగుపొరుగు భయంతో పరుగులు తీశారు. ప్రమాద విషయం తెలుసుకున్న సమీప గ్రామంలో ఉన్న మరో గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని గ్యాస్ సిలిండర్‌ను బయటకు తీసుకువచ్చారు. సిలిండర్ అడుగున రంధ్రాలు పడడంతోనే ప్రమాదం సంభవించినట్లు స్థానికులు భావిస్తున్నారు. ప్రమాదంలో ఇంట్లోని అనేక వస్తువులు కాలిపోయాయని, పైకప్పు రేకులు ధ్వంసమయ్యాయని ఇంటి యజమాని వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా భీతిల్లి పోయామని, ఘటనపై తహశీల్దార్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తగు నష్ట పరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
గ్యాస్ ఏజెన్సీ సిబ్బందిపై మండిపాటు
కాలం చెల్లిన పాత సిలిండర్లు సరఫరా చేయడం వల్లే ప్రమాదం జరిగిందని పలువురు స్థానికులు సంఘటనా స్థలంలో గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలంటే అంత అలుసా అంటూ నిలదీశారు. ఇకనుంచి కాలం చెల్లిన సిలిండర్లు ఇస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
పేలిన గ్యాస్‌బండ
Published Tue, Dec 31 2013 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM
Advertisement
Advertisement