mallamma
-
తాళాల గుట్టు.. మల్లమ్మ కెరుక!
సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా చోరులు ఖరీదైన ప్రాంతాలనే టార్గెట్‌గా చేసుకుంటారు. అయితే బాలమ్రాయ్కి చెందిన పసుపుల కల్పన అలియాస్ మల్లమ్మ శైలి దీనికి విరుద్ధం. కేవలం మధ్య తరగతి ప్రజలు ఉండే కాలనీల్లోనే తన చేతికి ‘పని’ చెబుతుంది. భార్యభర్తలు ఉద్యోగస్తులుగా ఉన్న, పనులపై బయటికి వెళ్తున్న వారు ఇంటి తాళాలను ఎక్కడ దాస్తారో ఈమెకు బాగా తెలుసు. ఇప్పటికే అనేకసార్లు జైలుకు వెళ్లి వచ్చిన మల్లమ్మను తాజాగా మార్కెట్ పరిధిలో జరిగిన నేరానికి సంబంధించి ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఘటన చోటు చేసుకున్న మూడు రోజుల్లోనే ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితురాలి నుంచి రూ.4.7 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ పి.రాధాకిషన్‌రావు ఆదివారం వివరాలు వెల్లడించారు. బాలమ్రాయ్ ప్రాంతానికి చెందిన మల్లమ్మ వృత్తిరీత్యా హౌస్ కీపింగ్ పని చేసేది. అయితే తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం నేరాల బాట పట్టింది. ఇప్పటి వరకు ఈమెపై కుషాయిగూడ, నాచారం, బేగంపేట ఠాణాల్లో 13 కేసులు నమోదై ఉన్నాయి. పగలు–రాత్రి తేడా లేకుండా చేతివాటం చూపించే ఈమె గతంలో పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చింది. ఓ స్క్రూడ్రైవర్, కటింగ్ ప్లేయర్ పట్టుకుని మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో సంచరిస్తుంటుంది. బయట నుంచి తాళం వేసున్న ఇల్లు కనిపిస్తే వెంటనే అప్రమత్తమవుతుంది. చుట్టుపక్కల పరిస్థితులను అధ్యయనం చేసి తనకు అనుకూలంగా ఉన్న ఇంటి ఎంచుకుంటుంది. ముందుగా ఆ ఇంటి వద్దకు వెళ్ళి బయటపక్కన తాళం చెవులు పెట్టడానికి అవకాశం ఉండే అన్నిచోట్లా వెతుకుతుంది. అవి లభిస్తే వాటిని వినియోగించి... లేదా తన వద్ద ఉన్న కటింగ్ ప్లేయర్, స్క్రూడ్రైవర్లతో తాళం పగులకొట్టి ఇంట్లోకి వెళ్తుంది. అక్కడున్న బీరువాలు, అల్మరాల్లో గాలించే మల్లమ్మ వెండి, బంగారు ఆభరణాలతో పాటు నగదు ఎత్తుకెళ్లేది. గురువారం మార్కెట్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఆదయ్య నగర్లో చోరీ చేసింది. ఆ రోజు ఉదయం ఎస్.శైలజ అనే మహిళ ఇంటి తాళం పగుల కొట్టి లోపలకు ప్రవేశించి 135.2 గ్రాముల బంగారు, 50 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు వాచీలు తదితరాలు ఎత్తుకెళ్లింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును ఛేదించడానికి నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సైలు కేఎస్ రవి, కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్, జి.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన బృందం సీసీ కెమెరాలను పరిశీలించి మల్లమ్మను అనుమానితురాలిగా గుర్తించారు. ఆదివారం వలపన్ని నిందితురాలిని అదుపులోకి తీసుకుని చోరీ సొత్తురికవరీ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితురాలితో పాటు రికవరీ చేసిన సొత్తును మార్కెట్ పోలీసులకు అప్పగించారు. -
పురుగుల మందు తాగిన మహిళ మృతి
వట్పల్లి(అందోల్): పురుగుల మందు తాగిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆదివారం మండల పరిధిలోని కేరూర్ గ్రామంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఎస్ఐ గణేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పుల్కల్ మండలం పెద్దరెడ్డిపేట గ్రామానికి చెందిన కొత్తగడి సంగయ్య తన కూతురు మల్లమ్మ(30)ను వట్పల్లి మండలం కేరూర్ గ్రామానికి చెందిన చిన్నెల్లి నాగయ్యకు ఇచ్చి 15 సంవత్సరాల క్రితం పెళ్లి జరిపించాడు. వారికి ఇద్దరు మగ పిల్లలు. అదే గ్రామానికి చెందిన చిన్నెల్లి ఎల్లయ్య ఆరేళ్ల నుంచి ఆమెను వేధిస్తుండడం భార్య, భర్తల మధ్య గొడవలకు దారితీసింది. ఈ నెల 26న ఎల్లయ్య రాత్రి వారి ఇంటి వైపు వచ్చాడు. అది గమనించిన నాగయ్య తన భార్య కోసమే వచ్చాడని భావించి అతడిపై చేయిచేసుకున్నాడు. ఈ విషయమై మనస్తాపం చెందిన మల్లమ్మ ఈ నెల 27న పురుగుల మందు తాగింది. ఈ క్రమంలో వెంటనే జోగిపేట, సంగారెడ్డి ప్రభుత్వాస్రత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
5 నెలల పసికందు సహా తల్లి ఆత్మహత్య
దేవరకద్ర: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన వివాహిత తన ఐదు నెలల చిన్నారితో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మల్లమ్మకు (22) మణికొండకు చెందిన వ్యక్తితో మూడేళ్ల క్రితం పెళైంది. వీరికి ఐదునెలల పాప ఉంది. పండుగ కోసం తల్లి గారింటికి వచ్చిన మల్లమ్మ తిరిగి భర్త దగ్గరకు వెళ్లకపోవడంతో కుటుంబంలో తగాదాలు తలెత్తాయి. దీంతో మనస్తాపం చెందిన మల్లమ్మ తన పాపతో సహా ఆదివారం రాత్రి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. -
సమ్మె శిబిరంలోనే తుదిశ్వాస
మనోవేదనకు గురై కుప్పకూలిన గజ్వేల్ మున్సిపల్ కార్మికురాలు గజ్వేల్: మెదక్ జిల్లా గజ్వేల్‌లో మంగళవారం మున్సిపల్ కార్మికురాలు సమ్మె శిబిరంలోనే కుప్పకూలి ప్రాణాలొదిలింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాలు... గజ్వేల్‌లోని నగర పంచాయతీ కార్యాలయం వద్ద 22 రోజులకుపైగా కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. రోజులు గడుస్తున్నా సమ్మెకు పరి ష్కారం దొరక్క వేదనతో ఆటాకూరి మల్లమ్మ(50) సమ్మె శిబిరంలోనే కుప్పకూలిపోయింది. తోటి కార్మికులు ఆసుపత్రికి తరలించేలోపే తుదిశ్వాస విడిచింది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, టీడీపీ నేత బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకున్నది. పోలీ సులు ఇరు వర్గాలను అక్కడి నుంచి పక్కకు తప్పిం చారు. బాధిత కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ సాయం, పాలకవర్గం తరుపున రూ.60 వేల అందిస్తామని భాస్కర్, కమిషనర్ శంకర్ భరోసా ఇచ్చారు. తక్షణ సాయం కింద రూ.10 వేలు అందించారు. -
విద్యుదాఘాతంతో ఉపసర్పంచ్ మృతి
పరిగి: విద్యుదాఘాతంతో ఓ ఉపసర్పంచ్ మృతి చెందారు. ఈ సంఘటన మండల పరిధిలోని పేటమాదారంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబీకుల కథనం ప్రకారం... గ్రామంలో కొంతకాలంగా విద్యుత్ సమస్య నెలకొంది. గ్రామస్తులు పలుమార్లు విద్యుత్ అధికారులు విషయం తెలియజేసినా సమస్య పూర్తిగా పరిష్కరించలేదు. దీంతో గ్రామస్తులే ట్రాన్స్ఫార్మర్ నుంచి ైడె రెక్ట్ కనెక్షన్ ఇచ్చుకున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో గ్రామస్తులు ఉపసర్పంచ్ గూడూరు రాంచంద్రయ్య(38) వద్దకు వెళ్లి నిలదీశారు. దీంతో అతను ట్రాన్స్ఫార్మర్ వద్దకు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో వెళ్లాడు. బాగు చేసేందుకు ప్రయత్నిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అలాగే పట్టుకుంది. గ్రామస్తులు కర్రలతో కొట్టి విడిపించారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో గ్రామస్తులు, కుటుంబీకులు పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రామచంద్రయ్య అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య మల్లమ్మ, కూతురు నితీష(15) కుమారుడు బాలు(10) ఉన్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి యాదయ్య, సీపీఎం డివిజన్ కార్యదర్శి వెంకటయ్యలు సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబీకులను పరామర్శించారు. -
మహిళపై అత్యాచారం, హత్య
జోగిపేట: వితంతువుపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేశారు. ఈ సంఘటన మెదక్ జిల్లా పుల్కల్ మండలం ఎస్ ఇటిక్యాలలో సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి.. మిన్పూరు మల్లమ్మ (28) భర్త చనిపోవడంతో ఇటిక్యాల గ్రామంలోని తల్లిదండ్రుల వద్ద ఉంటూ కల్లు డిపోలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ నెల 20న పనికి వెళ్లిన మల్లమ్మ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కుటుం బసభ్యులు బంధువులు, తెలిసిన వారివద్ద వాకబు చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఈ నెల 24న ఆమె సోదరుడు పుల్కల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలావుండగా, సోమవారం అదే గ్రామానికి చెందిన మేకల కాపరి మల్లేశం శివారులోని చెరకుతోటలో మహిళ మృతదేహాన్ని గుర్తించి గ్రామస్తులకు విషయం చెప్పాడు. మృతదేహం కుళ్లిపోయి గుర్తుపట్టలేని విధంగా మారింది. చీర ఆధారంగా మృతదేహం మల్లమ్మదిగా గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ నాగయ్య, ఎస్ఐ లోకేశ్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ముఖం గుర్తించనంతగా ఉంది, రెండు కాళ్లు కూడా లేవు. ఒక చేయి మోచేతి వరకే ఉంది. ఆనవాళ్లను బట్టి ఎవరో అత్యాచారం చేసి, హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. -
మాకేదీ ఆసరా..?
నేను సచ్చిపోయిన్నట ..! ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు అపరాద బుచ్చిమల్లమ్మ. హుజూరాబాద్‌లోని పోచమ్మవాడకు చెందిన ఈమె ఏనభైఏళ్లపైనే ఉంటుంది. భర్త చాలా ఏళ్ల కిందట చనిపోయాడు. పిల్లలు లేరు. ఈమెకు కళ్లు మొత్తానికే కనిపించవు. కాళ్లు, చేతులు చక్కగా పనిచేయవు. వృద్ధురాలు, వితంతువు. మూడింటిలో ఏ ఒక్క కోటాలోనైనా ఈమెకు పింఛన్ ఇవ్వాలి. కానీ, కళ్లు లేవని ఆధార్‌కార్డును తిరస్కరించారు. ఆధార్ లేదని రేషన్‌కార్డు పోయింది. ఇవన్నీ లేవని ఓటర్ లిస్టులో పేరు కూడా తొలగించారు. దిక్కుమొక్కులేని బుచ్చిమల్లమ్మను ఆమె మరిది కొడుకులు చూస్తున్నారు. తమ పెద్దమ్మకు పింఛన్ రావడం లేదని అధికారులకు చెప్పగా.. ఇంతకీ ఆమె బతికే ఉందా? ఆమె పేరు ఎందులో కూడా లేదు కదా? అని చెప్పడంతో ప్రయత్నాలు విరమించుకున్నట్లు ‘సాక్షి’ ఎదుట వాపోయారు. ‘నేను సచ్చిపోయినా అంటుండ్రట. నేను బతికే ఉన్నా... బిడ్డా గీ సచ్చిపోయే ముంగట పింఛన్ అచ్చేటట్టు జెయ్యండ్రి. కడుపు నిండ తింట’ అని బుచ్చిమల్లమ్మ బతిమిలాడింది. - హుజూరాబాద్ -
పేలిన గ్యాస్‌బండ
వర్గల్, న్యూస్‌లైన్: మండల పరిధిలోని గిర్మాపూర్ దళితవాడలోని ఓ ఇంట్లో మంగళవారం ‘గ్యాస్’ సిలిండర్ పేలింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఆ కుటుంబంలోని వారంతా వంటగదికి దూరంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో పైకప్పు రేకులు ధ్వంసం కాగా, మంటలకు పలు వస్తువులు, చీరలు కాలిపోయాయి. ఈ ఘటనతో దళిత వాడ ప్రజలు భీతిల్లి పరుగులు తీశారు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన డ్యాగ వెంకటయ్య ఇంట్లో మంగళవారం ఉదయం అతని భార్య మల్లమ్మ వంటావార్పు చేసింది. భర్త, కుమారుడితోపాటు తాను కూడా భోజనం ముగించింది. అనంతరం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మల్లమ్మ ఇంటిని శుభ్రం చేసే పనిలో నిమగ్నమైంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులందరూ ఇంటి వెలుపల ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో వంట గదిలోని సిలిండర్‌కు మంటలు అంటుకున్నాయి. గది నిండా పొగ కమ్ముకోగా ఆ తర్వాత పేలిన శబ్ధం వినిపించింది. దీంతో వెంకటయ్య కుటుంబీకులతో పాటు ఇరుగుపొరుగు భయంతో పరుగులు తీశారు. ప్రమాద విషయం తెలుసుకున్న సమీప గ్రామంలో ఉన్న మరో గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని గ్యాస్ సిలిండర్‌ను బయటకు తీసుకువచ్చారు. సిలిండర్ అడుగున రంధ్రాలు పడడంతోనే ప్రమాదం సంభవించినట్లు స్థానికులు భావిస్తున్నారు. ప్రమాదంలో ఇంట్లోని అనేక వస్తువులు కాలిపోయాయని, పైకప్పు రేకులు ధ్వంసమయ్యాయని ఇంటి యజమాని వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా భీతిల్లి పోయామని, ఘటనపై తహశీల్దార్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తగు నష్ట పరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. గ్యాస్ ఏజెన్సీ సిబ్బందిపై మండిపాటు కాలం చెల్లిన పాత సిలిండర్లు సరఫరా చేయడం వల్లే ప్రమాదం జరిగిందని పలువురు స్థానికులు సంఘటనా స్థలంలో గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలంటే అంత అలుసా అంటూ నిలదీశారు. ఇకనుంచి కాలం చెల్లిన సిలిండర్లు ఇస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.