సమ్మె శిబిరంలోనే తుదిశ్వాస
మనోవేదనకు గురై కుప్పకూలిన
గజ్వేల్ మున్సిపల్ కార్మికురాలు
గజ్వేల్: మెదక్ జిల్లా గజ్వేల్‌లో మంగళవారం మున్సిపల్ కార్మికురాలు సమ్మె శిబిరంలోనే కుప్పకూలి ప్రాణాలొదిలింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాలు... గజ్వేల్‌లోని నగర పంచాయతీ కార్యాలయం వద్ద 22 రోజులకుపైగా కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. రోజులు గడుస్తున్నా సమ్మెకు పరి ష్కారం దొరక్క వేదనతో ఆటాకూరి మల్లమ్మ(50) సమ్మె శిబిరంలోనే కుప్పకూలిపోయింది. తోటి కార్మికులు ఆసుపత్రికి తరలించేలోపే తుదిశ్వాస విడిచింది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, టీడీపీ నేత బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకున్నది. పోలీ సులు ఇరు వర్గాలను అక్కడి నుంచి పక్కకు తప్పిం చారు. బాధిత కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ సాయం, పాలకవర్గం తరుపున రూ.60 వేల అందిస్తామని భాస్కర్, కమిషనర్ శంకర్ భరోసా ఇచ్చారు. తక్షణ సాయం కింద రూ.10 వేలు అందించారు.