మాకేదీ ఆసరా..?
నేను సచ్చిపోయిన్నట ..!
ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు అపరాద బుచ్చిమల్లమ్మ. హుజూరాబాద్‌లోని పోచమ్మవాడకు చెందిన ఈమె ఏనభైఏళ్లపైనే ఉంటుంది. భర్త చాలా ఏళ్ల కిందట చనిపోయాడు. పిల్లలు లేరు. ఈమెకు కళ్లు మొత్తానికే కనిపించవు. కాళ్లు, చేతులు చక్కగా పనిచేయవు. వృద్ధురాలు, వితంతువు. మూడింటిలో ఏ ఒక్క కోటాలోనైనా ఈమెకు పింఛన్ ఇవ్వాలి. కానీ, కళ్లు లేవని ఆధార్‌కార్డును తిరస్కరించారు. ఆధార్ లేదని రేషన్‌కార్డు పోయింది.
ఇవన్నీ లేవని ఓటర్ లిస్టులో పేరు కూడా తొలగించారు. దిక్కుమొక్కులేని బుచ్చిమల్లమ్మను ఆమె మరిది కొడుకులు చూస్తున్నారు. తమ పెద్దమ్మకు పింఛన్ రావడం లేదని అధికారులకు చెప్పగా.. ఇంతకీ ఆమె బతికే ఉందా? ఆమె పేరు ఎందులో కూడా లేదు కదా? అని చెప్పడంతో ప్రయత్నాలు విరమించుకున్నట్లు ‘సాక్షి’ ఎదుట వాపోయారు. ‘నేను సచ్చిపోయినా అంటుండ్రట. నేను బతికే ఉన్నా... బిడ్డా గీ సచ్చిపోయే ముంగట పింఛన్ అచ్చేటట్టు జెయ్యండ్రి. కడుపు నిండ తింట’ అని బుచ్చిమల్లమ్మ బతిమిలాడింది.
- హుజూరాబాద్