Hujurabad
-
ధైర్యముంటే బహిరంగ చర్చకు రా..! ఈటలకు కౌశిక్ రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూపించేందుకు తాను సిద్ధమని.. ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ చేసిందేమిటో చూపించాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి సవాల్ చేశారు. హుజూరాబాద్‌లోని అంబేడ్కర్ చౌరస్తాలో ఈ నెల 5న బహిరంగ చర్చకు వేచి చూస్తానని ఆయన ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్‌లో ఏమీ సాధించని ఈటల రాజేందర్ గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. స్వగ్రామం కమలాపూర్‌లో కనీసం బస్టాండ్ కూడా ఈటల నిర్మించలేకపోయారని, సిద్దిపేట, సిరిసిల్ల తరహాలో హుజూరాబాద్‌లో అభివృద్ధి ఎందుకు సాధించలేక పోయారో ఈటల రాజేందర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈటల రాజేందర్‌ను జోకర్లా చూస్తున్నారని, బీజేపీలో చేరిన తర్వాత ఆయన పరిస్థితి దిగజారిపోయిందని ఎద్దేవా చేశారు. అధికారిక కార్యక్రమాలకు ఈటల రాజేందర్‌ను నియోజకవర్గ అధికారులు ఆహ్వానిస్తున్నా రావడం లేదని, శిలాఫలకాలపై తనతో పాటు ఈటల పేరు లేకుంటే ముక్కు నేలకు రాస్తానని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. చదవండి: టీఆర్ఎస్కు షాక్.. బీజేపీలోకి మంత్రి సోదరుడు! -
మూడు రోజులుగా మృతదేహంతో ఆందోళన
ఇల్లందకుంట (హుజూరాబాద్): కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో మూడు రోజులక్రితం మృతిచెందిన శ్రీరాములపల్లికి చెందిన గారంపల్లి సాంబశివరావు మృతదేహంతో గ్రామస్తులు మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అతని మృతికి కారణమైన సోదరుడు శ్రీకాంత్ నుంచి బాధిత కుటుంబానికి రావాల్సిన భూమిని ఇప్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇల్లందకుంట రోడ్డుపై దాదాపు మూడు గంటలపాటు బైఠాయించి, నిరసన తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని, ఆందోళన విరమించాలని సీఐ సురేశ్ చెప్పడంతో, తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీయబోమని, కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని మృతుడి కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. శ్రీరాములపల్లిలో మూడు రోజులుగా సాంబశివరావు మృతదేహం వద్దే గ్రామస్తులు వంటావార్పు నిర్వహిస్తున్నారు. -
కేసీఆర్, హరీష్.. దమ్ముంటే నాపై పోటీ చేసి గెలవండి: ఈటల
సాక్షి, కరీంనగర్ : హుజురాబాద్‌లో తన విజయాన్ని ఎవరూ ఆపలేరని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ‘నేను దిక్కులేని వాడ్ని కాదు.. హుజురాబాద్ ప్రజల హృదయాల్లో ఉన్న బిడ్డను. నేను వాళ్ల గుండెల్లో ఉన్నా. నన్ను ఓడించేందుకు రూ.5 వేల కోట్లైనా ఖర్చు పెడతారట. రేపు ఎన్నికల్లో చూసుకుందాం. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుకు సవాల్. దమ్ముంటే నాపై పోటీ చేసి గెలవండి’’ అని టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఈటల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. -
ఎక్కడున్నా హుజూరాబాద్‌కు వెళ్లేలా..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ పాదయత్ర సందర్భంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడినా, ఆ సమయంలో ఎక్కడున్నా అక్కడి నుంచి హుజూరాబాద్‌కు పాదయాత్రగా వెళ్లేలా పార్టీ నాయకత్వం షెడ్యూల్ రూపొందిస్తోంది. ఆగస్టు 9న హైదరాబాద్ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. నాలుగైదు లేదా అంతకు మించి విడతల్లో యాత్ర చేపట్టొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉన్నందున పాదయాత్రను రాజకీయంగా వీలైనంత ఎక్కువగా ఉపయోగపడేలా షెడ్యూల్ ఇతర కార్యక్రమాలను రూపొందించాలని పేర్కొంటున్నారు. పాదయాత్ర ఏర్పా ట్లపై వేయాల్సిన కమిటీలు తదితర అంశాలపై మంగళవారం ఉదయం సీనియర్ నేతలతో, సాయంత్రం రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జులతో బండి సంజయ్ అధ్యక్షతన రెండు విడతలుగా సమావేశం జరిగింది. -
కౌశిక్ వర్సెస్ కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందో ఇంకా తేలకపోయినా, ఆ నియోజకవర్గం రాష్ట్రంలో మరోమారు హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు టీఆర్ఎస్ వర్సెస్ ఈటలగా సాగుతున్న రాజకీయం, తాజాగా కౌశిక్‌రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా మారింది. తనకు టీఆర్ఎస్ టికెట్ ఖాయమని, యువకులందరినీ సమీకరించాలని కోరుతూ స్థానిక యువ నాయకుడు ఒకరితో.. కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పాడి కౌశిక్‌రెడ్డి జరిపిన ఫోన్ సంభాషణ లీకవడం, తదనంతర వరుస పరిణామాలు ఇందుకు కారణమయ్యాయి. హెచ్చరించినా మార్పు రాలేదు ఆడియో సంభాషణలపై సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో మాట్లాడిన ఆ పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఎం.కోదండరెడ్డి వెంటనే కౌశిక్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. గతంలో కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి, మంత్రి కేటీఆర్‌ను కలిసినందుకు షోకాజ్ నోటీసు ఇచ్చామని, అదే నెల 12వ తేదీన హెచ్చరించినా ప్రవర్తనలో మార్పు రాలేదని ఆ నోటీసులో పేర్కొన్నారు. తాజా ఆడియో సంభాషణ కూడా క్రమశిక్షణా రాహిత్యం కిందకే వస్తుందని తెలిపారు. 24 గంటల్లో తగిన వివరణ ఇవ్వకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామినవుతా.. అయితే, సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన కౌశిక్‌రెడ్డి.. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాసిన రాజీనామా లేఖను మీడియాకు విడుదల చేశారు. తాను పార్టీలో ఉండగానే ఈటల కాంగ్రెస్‌లోకి వస్తే గెలిచేవారని టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ఎలా ఉంటారని ప్రశ్నించారు. టీపీసీసీ పదవి కోసం మాణిక్యం ఠాగూర్‌కు రేవంత్‌రెడ్డి రూ.50 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. తాను పార్టీని వీడతానని, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామిని అవుతానని కౌశిక్ వెల్లడించారు. కేసీఆర్, కేటీఆర్‌లే మాట్లాడిస్తున్నారు ఈ నేపథ్యంలో కౌశిక్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు కోదండరెడ్డితో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియాకు తెలిపారు. ఆ తర్వాత మహేశ్‌కుమార్ గౌడ్ గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ కౌశిక్‌రెడ్డి బొమ్మ మాత్రమేనని, ఆయనతో చిలుక పలుకులు పలికిస్తున్నది కేసీఆర్, కేటీఆర్‌లేనని విమర్శించారు. ఈటల ఎపిసోడ్ మొదలైన నాటి నుంచి కౌశిక్ చదువుతున్న స్క్రిప్ట్ కేటీఆర్ ఇచ్చిందేనన్నారు. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను ఆయన బంధువు, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఖండించారు. రేవంత్, మాణిక్యం ఠాగూర్లనుద్దేశించి కౌశిక్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని బెంగళూరు జిందాల్ ఆశ్రమం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రత్యామ్నాయం ఎవరు? హుజూరాబాద్ ఇన్చార్జిగా ఉన్న కౌశిక్‌రెడ్డిని బహిష్కరించడంతో అక్కడ పార్టీ తరఫున ఎవరు పోటీ చేయాలన్న దానిపై కాంగ్రెస్ అప్పుడే ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. వీణవంక మండల కేంద్రానికి చెందిన ఓ మీడియా అధిపతి, కౌశిక్ సమీప బంధువు పాడి రాకేశ్‌రెడ్డి, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణరావులతో పాటు మరో బీసీ నేత పేరును కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. -
టీఆర్ఎస్ టికెట్టు నాకే: కౌశిక్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ / సాక్షి ప్రతినిధి, వరంగల్: హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పాడి కౌశిక్‌రెడ్డి, కమలాపూర్ మండలం మాదన్నపేటకి చెందిన విజయేందర్‌తో జరిపిన ఫోన్ సంభాషణ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయ్యి సంచలనం సృష్టించింది. ఈటల రాజేందర్ రాజీనామాతో జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఎవరు పోటీ చేస్తారు అనే ప్రశ్నకు అనూహ్యంగా సమాధానం దొరికినట్లయింది. తనకు టీఆర్ఎస్ టికెట్ ఖాయమైనట్లు ఆ ఫోన్ సంభాషణలో కౌశిక్‌రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు ‘ఎంత ఖర్చయినా పర్వాలేదు. యూత్ అందర్నీ పార్టీలోకి గుంజాలె..’అని కూడా అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిపై స్పష్టత! హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థిని టీఆర్ఎస్ ప్రకటించలేదు. కానీ మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి ద యాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రెండు నెలలుగా నియోజకవర్గంలో ప్రచారం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు ఫోన్ సంభాషణలు వెలుగులోకి రావడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో.. ఆయన టీఆర్ఎస్లో చేరడంపై, ఆ పార్టీ హుజూరాబాద్ అభ్యర్థి విషయంలో స్పష్టత వచ్చినట్టేనని అంటున్నారు. సీఎం కేసీఆర్ కూడా.. ఆదివారం తనను కలిసిన కొందరు నేతలతో కౌశిక్‌రెడ్డి అభ్యర్థి అయితే ఎలా ఉంటుందని ఆరా తీశారని సమాచారం. అప్పట్నుంచే టచ్‌లో..: పీసీసీ తాజా మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వరుసకు సోదరుడైన కౌశిక్‌రెడ్డి.. ఈటల వ్యవహారం వెలుగులోకి వచ్చిన నాటి నుంచే టీఆర్ఎస్తో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. జిల్లా మంత్రి గంగుల కమలాకర్ ద్వారా ఆయన టీఆర్ఎస్ పెద్దలతో మాట్లాడినట్లు తెలిసింది. గత నెల 10న ఓ ప్రైవేటు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో కౌశిక్‌రెడ్డి భేటీ కావడం, రహస్యంగా మాట్లాడుకున్న ఫొటోలు కూడా లీకయ్యాయి. అయితే ప్రైవేటు కార్యక్రమంలో అనుకోకుండా కలిసిందేనని అప్పట్లో కొట్టిపారేశారు. అంతేకాదు రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యాక కౌశిక్‌రెడ్డి వెళ్లి ఆయన్ను కలిశారు. దీంతో కౌశిక్ కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని అంతా భావించారు. అయితే ఆదివారం వాట్సాప్ గ్రూపుల్లో కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరబోతున్నట్లు మెస్సేజ్‌లు వెల్లువెత్తాయి. దీనిపై కౌశిక్‌రెడ్డిని ఆదివారం రాత్రి ‘సాక్షి’ప్రశ్నించగా.. ఆ ప్రచారాన్ని ఖండించారు. కానీ తెల్లవారగానే కౌశిక్ జరిపిన ఫోన్ సంభాషణ లీకవడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. హుజూరాబాద్ టికెట్టు ఎవరికివ్వాలనేది సీఎం నిర్ణయమని, కౌశిక్‌రెడ్డి ఫోన్ సంభాషణపై ఏమీ వ్యాఖ్యానించలేమని ఓ ముఖ్య నాయకుడు ‘సాక్షి’తో అన్నారు. 16న టీఆర్ఎస్లోకి కౌశిక్‌రెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో చేరిక సాక్షి, హైదరాబాద్: కౌశిక్‌రెడ్డి ఈ నెల 16న టీఆర్ఎస్లో చేరనున్నారు. ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్లో తన అనుచరులతో కలసి టీఆర్ఎస్ కండు వా కప్పుకోనున్నారు. ఈ నెల 14న హుజూరాబా ద్‌కు చెందిన కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో రాజీనామా చేస్తారని కౌశిక్‌రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గంలో వివిధ స్థాయిలకు చెందిన సుమారు 2 వేల మంది కార్యకర్తలు తన వెంట టీఆర్ఎస్లో చేరుతారని కౌశిక్‌రెడ్డి సంకేతాలు ఇచ్చారు. త్వరలో జరిగే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారని కొంత కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్‌ను ఓడించడమే లక్ష్యంగా టీఆర్ఎస్లో చేరుతున్నట్లు కౌశిక్‌రెడ్డి ప్రకటించారు. -
మంత్రి ఈటల సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్ : తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ నుంచి తప్పిస్తారని వస్తున్న ఊహాగానాలను కొట్టి పారేస్తూ.. మంత్రి పదవి ఎవరి భిక్ష కాదన్నారు. తాను పార్టీలోకి మధ్యలో వచ్చిన వాడిన కాదని, గులాబీ జెండా ఓనర్లలో ఒకడినని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. తన రాజకీయ జీవితంలో ఏ ఒక్కరి నుంచైనా రూ.5వేలు లంచం తీసుకున్నట్లు రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. తాను బీసీని కాబట్టి కుల ప్రాతిపదికన మంత్రి పదవి కావాలని ఎప్పుడూ అడగలేదని స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న చిల్లర ప్రచారంపై సమాధానం చెప్పాల్సిన పని లేదని అన్నారు. ‘తెలంగాణ ఆత్మగౌరవం కోసం నేను పోరాటం చేశాను. ఉద్యమంలో మూడున్నర కోట్ల ప్రజల తరపున పోరాడాను. నన్ను చంపాలని రెక్కీ నిర్వహించినా కూడా తెలంగాణ జెండా పట్టుకొని ఎదురెళ్లాను. తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడిన వ్యక్తిని. పార్టీలోకి మధ్యలోకి వచ్చిన వాడిని కాదు. గులాబీ జెండా ఓనర్లం. పదవులను అడుక్కునే వాడిని అసలే కాదు. నా తల్లిదండ్రులు రాజకీయాల్లో లేకున్నా అనామకుడిగా వచ్చి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. నా మంత్రి పదవి ఎవరి భిక్షా కాదు. బీసీ కోటాలో మంత్రి పదవి కావాలని ఎప్పుడూ అడగలేదు. అధికారం శాశ్వతం కాదు ధర్మం, న్యాయం శాశ్వతం. ప్రజలే చరిత్ర నిర్మాతలు తప్ప నాయకులు కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కుహానావాదులు, సంకుచిత బుద్ధితో వ్యవహరించేవారు జాగ్రత్తగా ఉండాలి. సొంతంగా ఎదగలేని వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరు హీరోనో ఎవరు జీరోనో త్వరలో తెలుస్తుంది’ అని ఈటల రాజేందర్ అన్నారు. -
హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కౌశిక్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ అభ్యర్థిగా పాడి కౌశిక్‌రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం ఆదివారం రాత్రి ప్రకటించింది. ఆయనకు బీ ఫారం అందించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాలకుగాను 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్‌ను సీపీఐకి అప్పగించింది. హుజూరాబాద్, కోరుట్ల స్థానాలకు పదిరోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది. టీపీసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ సిఫార్సు మేరకు హుజూరాబాద్‌ను కౌశిక్‌రెడ్డికి.. కోరుట్ల జువ్వాడి నర్సింగరావుకు ప్రకటించారు. ఈ మేరకు ఇద్దరు అభ్యర్థులకు బీ ఫారాలను అందించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. -
అమరుల స్తూపాలను కూల్చడం హేయం
వీణవంక(హుజూరాబాద్) : అమరవీరులకు కనీస మర్యాద ప్రభుత్వం ఇవ్వడం లేదని, అమరుల స్తూపాలను కూల్చడం హేయమైన చర్య అని తెలంగాణ జన సమితి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి గాదె ఇన్నయ్య అన్నారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకోడానికే స్తూపాలను నిర్మిస్తారని, అలాంటి అమరుల స్తూపాలను ప్రభుత్వం కూల్చేస్తూ రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. వీణవంక మండలం అచ్చంపల్లి గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ జనసభ నేత అల్గివెల్లి రవీందర్‌రెడ్డి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు నిర్మిస్తున్న స్తూపాన్ని ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు కూల్చేశారు. మంగళవారం టీజేఎస్ నాయకులు అచ్చంపల్లి గ్రామాన్ని సందర్శించారు. రవీందర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కల్వల ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఆనాడు 33రోజులపాటు రవీందర్‌రెడ్డి నిరాహార దీక్షకు పూనుకున్నాడని, ఆయన ఎదుగుదలను జీర్ణించుకోలేని వ్యక్తులు రాజకీయ హత్య చేశారని పేర్కొన్నారు. జమ్మికుంటలో జరిగిన సభలో రవీందర్‌రెడ్డి తెలంగాణ కోసం అమరుడైనట్లు కేసీఆర్ ప్రకటించాడని, ఇప్పుడు ఆయన స్తూపాన్నే కూల్చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధన కోసం అమరుడైన రవీందర్‌రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వాలు ఆదుకోలేదని, ఆయన జ్ఞాపకార్థం గ్రామ పంచాయితీ అనుమతితో కుటుంబసభ్యులు స్తూపాన్ని నిర్మించుకుంటే కూల్చేయడం సరికాదని తెలంగాణ జనసమితి జిల్లా కన్వీనర్ ముక్కెర రాజు అన్నారు. మంత్రి ఈటల రాజేందర్‌కు అమరులు, ఉద్యమకారుల మీద గౌరవం ఉంటే సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ ఇన్చార్జి పత్తి వేణుగోపాల్‌రెడ్డి, పెరమండ్ల సంపత్‌గౌడ్, ఉడుగుల మహేందర్, నీల కుమారస్వామి, అంకూస్, శరత్, శ్రీనివాస్, అనిల్, నిరంజన్, మహేందర్, పరుశరాములు పాల్గొన్నారు. -
మనుమరాలిని హతమార్చిన తాత
హుజూరాబాద్‌రూరల్ : ఆడుతూ..పాడుతూ సరదాగా ఉండే చిన్నారి తెల్లారెసరికి విగతజీవిగా మారింది. కథలు..కబుర్లు చెబుతూ..కాపాడాల్సిన తాతయ్యే కాలయముడయ్యాడు. సొంత మనుమరాలి గొంతునొలిమి చంపిన ఘటన హుజూరాబాద్ మండలం చెల్పూర్లో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన నిజవపురం సంతోష్–స్వరూపలకు కుమారుడు రితీశ్(7), కుమార్తె సిరివల్లి(6) సంతానం. సంతోష్ దంపతులు జమ్మికుంటలో ఉంటుండడంతో పిల్లలు సైతం అక్కడి ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్నారు. రంజాన్ నేపథ్యంలో పాఠశాలకు సెలవులు రావడంతో సిరివల్లిని చెల్పూర్లోని సంతోష్ తల్లిదండ్రుల వద్ద మూడు రోజుల క్రితం మేనమామ దించేసివచ్చాడు. సోమవారం తెల్లవారుజామున చిన్నారి మృతిచెంది ఉన్నట్లు సిరివల్లి బాపమ్మ పేర్కొంది. ఈ విషయంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. హుజూరాబాద్‌టౌన్ సీఐ దామోదర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా మృతురాలి తాతయ్య రవి వేలిముద్రలు సిరివల్లి మెడపై ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తాతయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా తనే చంపినట్లు అంగీకరించాడు. తన కొడుకు సంతోష్‌ను కోడలు కొన్ని రోజులుగా తమ నుంచి దూరంగా ఉంచుతుండడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు రవి తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కాగా రవి కొంతకాలంగా మానసికవ్యాధికి సంబంధించిన మందులు వాడుతున్నట్లు పేర్కొన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి : బాలల హక్కుల ప్రజాధ్వని సభ్యులు అభం శుభం తెలియని చిన్నారిని హతమార్చిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల ప్రజాధ్వని రాష్ట్ర కమిటీ సభ్యులు అనుమాండ్ల శోభారాణి, జిల్లా అధ్యక్షుడు సంపత్, కమిటీ సభ్యులు చల్లూరి రాజు, సదాశివరెడ్డి డిమాండ్ చేశారు. చట్టాలు కఠినతరం చేసినప్పుడే బాలికల హత్యలు తగ్గుతాయన్నారు. -
పరీక్షలు ఫెయిలయ్యాననే..
హుజూరాబాద్‌రూరల్ : పరీక్షల్లో ఫెయిలయ్యానని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన హుజూరాబాద్ మండలం కొత్తపల్లిలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన మిసరగండ్ల రవీందర్-లక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. తండ్రి హమాలీ పనిచేస్తుండగా తల్లి దినసరి కూలీ. వీరి కుమార్తె రచన(20) హుజూరాబాద్‌లోని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ సెకండియర్ చదువుతుంది. ఇటీవల విడుదలైన సెమిస్టర్ ఫలితాల్లో కొన్ని సబెక్టుల్లో ఫెయిలైంది. మానసిక వేదనకు గురైన రచన సోమవారం తెల్లవారు జామున వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో కూతురు కనిపించకపోవడంతో చుట్టుపక్క ల ప్రాంతాల్లో గాలించారు. గ్రామానికి సమీపంలోని వ్యవసాయబావి వద్దకు వెళ్లినట్లు గ్రామస్తులు తెలపగా.. అక్కడికెళ్లి చూడగా శవమై కనిపించింది. జీవచ్చవంలా పడి ఉన్న కూతురును చూసి తల్లిదండ్రులు గుండె లవిసేలా రోదించారు. మృతదేహాన్ని పోస్టుమా ర్టం కోసం హుజూరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్సై లింగారెడ్డి పంచనామా చేశారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దామోదర్‌రెడ్డి తెలిపారు. -
10న హుజూరాబాద్‌లో ‘రైతు బంధు’
సాక్షి, హైదరాబాద్ : రైతు బంధు చెక్కులు, కొత్త పట్టాదారు పాస్ పుస్త కాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కె.చంద్రశేఖర్‌రావు మే 10న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ప్రారంభించనున్నారు. మరుసటి రోజు ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7.30 వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ మేరకు చెక్కులు, పాస్ పుస్తకాల పంపిణీ కేంద్రాల వద్ద టెంట్లు వేయాలని, మంచి నీటి సౌకర్యాన్ని కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలకు చేరిన పాసు పుస్తకాలు, చెక్కులను పరిశీలించి గ్రామాల వారీగా పంపించాలని సూచించారు. కార్యక్రమం జరిగే రోజుల్లో రెవెన్యూ, వ్యవసాయ శాఖ మంత్రులతో పాటు, అధికారులు గ్రామాల్లో పర్యవేక్షించాలని ఆదేశించారు. నేడు సివిల్స్ టాపర్‌కు సీఎం విందు సివిల్స్‌లో టాపర్‌గా తెలంగాణ బిడ్డ నిలవడం రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆలిండియా టాపర్ అనుదీప్, అతని తల్లిదండ్రులను సోమవారం మధ్యాహ్న భోజనానికి సీఎం ఆహ్వానించారు. -
హుజూరాబాద్‌లో ‘రైతుబంధు’కు శ్రీకారం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రైతుబంధు పథకానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కరీంనగర్ జిల్లా నుంచి శ్రీకారం చుట్టనున్నారు. మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్‌లో ఈ నెల 10న పథకాన్ని ప్రారంభించి రైతులకు చెక్కులు అందజేయనున్నారు. హుజూరాబాద్ మండలం చెల్పూర్ సమీపంలోని ఇందిరానగర్–శాలపల్లిలో లేదా ధర్మరాజుపల్లిలో సీఎం సభను ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, సీపీ కమలాసన్‌రెడ్డి, హుజూరాబాద్ ఆర్డీవో బి.చెన్నయ్య మొద ట హుజూరాబాద్ పట్టణంలోని హైస్కూల్ క్రీడా మైదానాన్ని పరిశీలించారు. అనం తరం మండలంలోని శాలపల్లి, ధర్మరాజుపల్లి గ్రామాల్లో సభ నిర్వహణకు అనువుగా ఉన్న ఖాళీ స్థలాలను సందర్శించారు. -
ఏ తల్లి కన్నబిడ్డో... పాపం !
హుజూరాబాద్‌రూరల్ : ‘ఇంకా కళ్లు తెరవని ఆ పసికందు లోకా న్ని చూడకుండా నే పరలోకాలకు వెళ్లాడు. ఏ తల్లి కన్నబిడ్డో కెనా ల్కాలువలో విగతజీవిగా పడిఉన్నాడు. ఇంకా నెలలు కూడా నిండని ఆ పసికందు మృతదేహం కెనాల్కాలువలో కనబడిన తీరు స్థానికులను కలచివేసింది. మండలంలోని బోర్నపల్లి గ్రామంలోని ఎస్సారెస్పీ కాలువలో ఆదివారం అప్పుడే పుట్టిన ఓ పసికందు మృతదేహం లభ్యమైంది. గ్రామానికి చెందిన కొందరు యువకులు కాలువలో చేపలు పట్టడానికి వెళ్లేసరికి వారికి మగశిశువు మృతదేహం కనిపించింది. వెంటనే వారు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు అక్కడికి చేరుకుని శిశువు మృతదేహం గురించి ఆరా తీస్తున్నారు. -
మరుగుదొడ్లకు రూ.22 కోట్లు
మార్చిలోగా వందశాతంపూర్తిచేయాల లేకుంటే ప్రజాప్రతినిధులు నావద్దకు రావొద్దు వచ్చే బడ్జెట్లో అన్ని గ్రామాలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఆర్థిక, పౌర సరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ : మరుగుదొడ్ల నిర్మాణాల కోసం రాష్ట్రవ్యాప్తంగా రూ.50 కోట్లు కేటాయిస్తే, అందులో కరీంనగర్ జిల్లాకే రూ.22 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణంపై హుజూరాబాద్ సాయిగార్డెన్స్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో గురువారం సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ అధికారులు సమష్టిగా కృషి చేసి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. మార్చి నెలాఖరు వరకు వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, లేనిపక్షంలో ప్రజాప్రతినిధులు తన వద్దకు పనుల కోసం రావొద్దని అన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలకు కావాల్సిన మెటీరియల్‌ను స్థానికంగానే తయారు చేసుకుంటే ముడి సరుకులు సబ్సిడీపై అందిస్తామన్నారు. రానున్న బడ్జెట్లో అన్ని గ్రామాలకు ఇళ్లు కేటాయించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రానున్న ఏడాదిలో హుజూరాబాద్ నియోజకవర్గంలో మట్టి రోడ్లు కనిపించకుండా సిమెంట్ రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. నిధులకు ఢోకా లేదని పనులు త్వరగా చేయాలని చెప్పారు. మరుగుదొడ్ల నిర్మాణంలో లక్ష్యసాధనపై ప్రజాప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ, బిల్లుల చెల్లింపులో జాప్యముండదని అన్నారు. ప్రజలకు అవగాహన కల్పించి మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. ఆయా గ్రామాల్లో సీజ్ చేసిన ఇసుక మరుగుదొడ్ల నిర్మాణాలకు వాడుకోవాలని సూచించారు. ఇప్పటికే 100 శాతం నిర్మాణాలతో లక్ష్యాన్ని సాధించిన కమలాపూర్ మండలం శంభునిపల్లి, జమ్మికుంట మండలం శాయంపేట గ్రామాల సర్పంచులు, కార్యదర్శులను కలెక్టర్ అభినందించారు. సమావేశంలో అడిషనల్ జాయింట్ కలెక్టర్ నాగేంద్ర, డ్వామా పీడీ గణేశ్, ఆర్డీవో చంద్రశేఖర్, ఎంపీపీలు వొడితల సరోజినీదేవి , గంగారపు లత, లాండిగె లక్ష్మణ్‌రావు, నగర పంచాయతీ చైర్మన్ విజయ్‌కమార్ తదితరులు పాల్గొన్నారు. -
కరీంనగర్లో మహిళ దారుణ హత్య
హుజూరాబాద్: కరీంనగర్ జిల్లాలో బుధవారం దారుణం జరిగింది. హుజూరాబాద్ పట్టణంలో ఒక మహిళ హత్యకు గురైంది. స్థానిక పాత టెలిఫోన్ ఎక్స్చేంజి సమీపంలో నివాసం ఉండే అయిత సురేందర్, భాగ్యలక్ష్మీ(44) దంపతులకు ఇద్దరు కూతుళ్లు. సురేందర్ ఓ ప్రైవేటు ఉద్యోగి. బుధవారం ఉదయం ఆయన విధులకు, ఇద్దరు పిల్లలు స్కూలుకు వెళ్లగా భాగ్యలక్ష్మీ ఒక్కరే ఇంట్లో ఉంది. ఆ ఇంటి కింది పోర్షన్లో అద్దెకు ఉండే మహిళ ఆమె కోసమని మధ్యాహ్నం పై అంతస్తులోకి వెళ్లింది. హాలులో భాగ్యలక్ష్మీ రక్తపు మడుగులో పడి ఉండటం గమనించి, చుట్టుపక్కల వారికి విషయాన్ని చెప్పింది. అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని ఆగంతకులు ఆమె మెడలోని గొలుసు తెంపుకు పోయే ప్రయత్నంలో... ఆమె ప్రతిఘటించడంతో హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ రమణమూర్తి పరిశీలించారు. -
మాకేదీ ఆసరా..?
నేను సచ్చిపోయిన్నట ..! ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు అపరాద బుచ్చిమల్లమ్మ. హుజూరాబాద్‌లోని పోచమ్మవాడకు చెందిన ఈమె ఏనభైఏళ్లపైనే ఉంటుంది. భర్త చాలా ఏళ్ల కిందట చనిపోయాడు. పిల్లలు లేరు. ఈమెకు కళ్లు మొత్తానికే కనిపించవు. కాళ్లు, చేతులు చక్కగా పనిచేయవు. వృద్ధురాలు, వితంతువు. మూడింటిలో ఏ ఒక్క కోటాలోనైనా ఈమెకు పింఛన్ ఇవ్వాలి. కానీ, కళ్లు లేవని ఆధార్‌కార్డును తిరస్కరించారు. ఆధార్ లేదని రేషన్‌కార్డు పోయింది. ఇవన్నీ లేవని ఓటర్ లిస్టులో పేరు కూడా తొలగించారు. దిక్కుమొక్కులేని బుచ్చిమల్లమ్మను ఆమె మరిది కొడుకులు చూస్తున్నారు. తమ పెద్దమ్మకు పింఛన్ రావడం లేదని అధికారులకు చెప్పగా.. ఇంతకీ ఆమె బతికే ఉందా? ఆమె పేరు ఎందులో కూడా లేదు కదా? అని చెప్పడంతో ప్రయత్నాలు విరమించుకున్నట్లు ‘సాక్షి’ ఎదుట వాపోయారు. ‘నేను సచ్చిపోయినా అంటుండ్రట. నేను బతికే ఉన్నా... బిడ్డా గీ సచ్చిపోయే ముంగట పింఛన్ అచ్చేటట్టు జెయ్యండ్రి. కడుపు నిండ తింట’ అని బుచ్చిమల్లమ్మ బతిమిలాడింది. - హుజూరాబాద్