సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందో ఇంకా తేలకపోయినా, ఆ నియోజకవర్గం రాష్ట్రంలో మరోమారు హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు టీఆర్‌ఎస్ వర్సెస్ ఈటలగా సాగుతున్న రాజకీయం, తాజాగా కౌశిక్‌రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా మారింది. తనకు టీఆర్‌ఎస్ టికెట్ ఖాయమని, యువకులందరినీ సమీకరించాలని కోరుతూ స్థానిక యువ నాయకుడు ఒకరితో.. కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి పాడి కౌశిక్‌రెడ్డి జరిపిన ఫోన్ సంభాషణ లీకవడం, తదనంతర వరుస పరిణామాలు ఇందుకు కారణమయ్యాయి.
హెచ్చరించినా మార్పు రాలేదు
ఆడియో సంభాషణలపై సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో మాట్లాడిన ఆ పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఎం.కోదండరెడ్డి వెంటనే కౌశిక్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. గతంలో కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి, మంత్రి కేటీఆర్‌ను కలిసినందుకు షోకాజ్ నోటీసు ఇచ్చామని, అదే నెల 12వ తేదీన హెచ్చరించినా ప్రవర్తనలో మార్పు రాలేదని ఆ నోటీసులో పేర్కొన్నారు. తాజా ఆడియో సంభాషణ కూడా క్రమశిక్షణా రాహిత్యం కిందకే వస్తుందని తెలిపారు. 24 గంటల్లో తగిన వివరణ ఇవ్వకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామినవుతా..
అయితే, సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన కౌశిక్‌రెడ్డి.. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాసిన రాజీనామా లేఖను మీడియాకు విడుదల చేశారు. తాను పార్టీలో ఉండగానే ఈటల కాంగ్రెస్‌లోకి వస్తే గెలిచేవారని టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ఎలా ఉంటారని ప్రశ్నించారు. టీపీసీసీ పదవి కోసం మాణిక్యం ఠాగూర్‌కు రేవంత్‌రెడ్డి రూ.50 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. తాను పార్టీని వీడతానని, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామిని అవుతానని కౌశిక్ వెల్లడించారు.
కేసీఆర్, కేటీఆర్‌లే మాట్లాడిస్తున్నారు
ఈ నేపథ్యంలో కౌశిక్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు కోదండరెడ్డితో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియాకు తెలిపారు. ఆ తర్వాత మహేశ్‌కుమార్ గౌడ్ గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ కౌశిక్‌రెడ్డి బొమ్మ మాత్రమేనని, ఆయనతో చిలుక పలుకులు పలికిస్తున్నది కేసీఆర్, కేటీఆర్‌లేనని విమర్శించారు. ఈటల ఎపిసోడ్ మొదలైన నాటి నుంచి కౌశిక్ చదువుతున్న స్క్రిప్ట్ కేటీఆర్ ఇచ్చిందేనన్నారు. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను ఆయన బంధువు, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఖండించారు. రేవంత్, మాణిక్యం ఠాగూర్‌లనుద్దేశించి కౌశిక్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని బెంగళూరు జిందాల్ ఆశ్రమం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయం ఎవరు?
హుజూరాబాద్ ఇన్‌చార్జిగా ఉన్న కౌశిక్‌రెడ్డిని బహిష్కరించడంతో అక్కడ పార్టీ తరఫున ఎవరు పోటీ చేయాలన్న దానిపై కాంగ్రెస్ అప్పుడే ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. వీణవంక మండల కేంద్రానికి చెందిన ఓ మీడియా అధిపతి, కౌశిక్ సమీప బంధువు పాడి రాకేశ్‌రెడ్డి, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణరావులతో పాటు మరో బీసీ నేత పేరును కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
కౌశిక్ వర్సెస్ కాంగ్రెస్
Published Tue, Jul 13 2021 1:23 AM | Last Updated on Tue, Jul 13 2021 1:23 AM
Advertisement