
అచ్చంపల్లిలో కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న టీజేఎస్ నాయకులు
వీణవంక(హుజూరాబాద్) : అమరవీరులకు కనీస మర్యాద ప్రభుత్వం ఇవ్వడం లేదని, అమరుల స్తూపాలను కూల్చడం హేయమైన చర్య అని తెలంగాణ జన సమితి ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి గాదె ఇన్నయ్య అన్నారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకోడానికే స్తూపాలను నిర్మిస్తారని, అలాంటి అమరుల స్తూపాలను ప్రభుత్వం కూల్చేస్తూ రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. వీణవంక మండలం అచ్చంపల్లి గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ జనసభ నేత అల్గివెల్లి రవీందర్‌రెడ్డి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు నిర్మిస్తున్న స్తూపాన్ని ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు కూల్చేశారు.
మంగళవారం టీజేఎస్ నాయకులు అచ్చంపల్లి గ్రామాన్ని సందర్శించారు. రవీందర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కల్వల ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఆనాడు 33రోజులపాటు రవీందర్‌రెడ్డి నిరాహార దీక్షకు పూనుకున్నాడని, ఆయన ఎదుగుదలను జీర్ణించుకోలేని వ్యక్తులు రాజకీయ హత్య చేశారని పేర్కొన్నారు. జమ్మికుంటలో జరిగిన సభలో రవీందర్‌రెడ్డి తెలంగాణ కోసం అమరుడైనట్లు కేసీఆర్ ప్రకటించాడని, ఇప్పుడు ఆయన స్తూపాన్నే కూల్చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ సాధన కోసం అమరుడైన రవీందర్‌రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వాలు ఆదుకోలేదని, ఆయన జ్ఞాపకార్థం గ్రామ పంచాయితీ అనుమతితో కుటుంబసభ్యులు స్తూపాన్ని నిర్మించుకుంటే కూల్చేయడం సరికాదని తెలంగాణ జనసమితి జిల్లా కన్వీనర్ ముక్కెర రాజు అన్నారు. మంత్రి ఈటల రాజేందర్‌కు అమరులు, ఉద్యమకారుల మీద గౌరవం ఉంటే సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జి పత్తి వేణుగోపాల్‌రెడ్డి, పెరమండ్ల సంపత్‌గౌడ్, ఉడుగుల మహేందర్, నీల కుమారస్వామి, అంకూస్, శరత్, శ్రీనివాస్, అనిల్, నిరంజన్, మహేందర్, పరుశరాములు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment