మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లిదండ్రులు, వివరాలు సేకరిస్తున్న పోలీసులు
హుజూరాబాద్‌రూరల్ : ఆడుతూ..పాడుతూ సరదాగా ఉండే చిన్నారి తెల్లారెసరికి విగతజీవిగా మారింది. కథలు..కబుర్లు చెబుతూ..కాపాడాల్సిన తాతయ్యే కాలయముడయ్యాడు. సొంత మనుమరాలి గొంతునొలిమి చంపిన ఘటన హుజూరాబాద్ మండలం చెల్పూర్‌లో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన నిజవపురం సంతోష్–స్వరూపలకు కుమారుడు రితీశ్(7), కుమార్తె సిరివల్లి(6) సంతానం.
సంతోష్ దంపతులు జమ్మికుంటలో ఉంటుండడంతో పిల్లలు సైతం అక్కడి ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్నారు. రంజాన్ నేపథ్యంలో పాఠశాలకు సెలవులు రావడంతో సిరివల్లిని చెల్పూర్‌లోని సంతోష్ తల్లిదండ్రుల వద్ద మూడు రోజుల క్రితం మేనమామ దించేసివచ్చాడు. సోమవారం తెల్లవారుజామున చిన్నారి మృతిచెంది ఉన్నట్లు సిరివల్లి బాపమ్మ పేర్కొంది.
ఈ విషయంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. హుజూరాబాద్‌టౌన్ సీఐ దామోదర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా మృతురాలి తాతయ్య రవి వేలిముద్రలు సిరివల్లి మెడపై ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
తాతయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా తనే చంపినట్లు అంగీకరించాడు. తన కొడుకు సంతోష్‌ను కోడలు కొన్ని రోజులుగా తమ నుంచి దూరంగా ఉంచుతుండడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు రవి తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కాగా రవి కొంతకాలంగా మానసికవ్యాధికి సంబంధించిన మందులు వాడుతున్నట్లు పేర్కొన్నారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలి : బాలల హక్కుల ప్రజాధ్వని సభ్యులు
అభం శుభం తెలియని చిన్నారిని హతమార్చిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల ప్రజాధ్వని రాష్ట్ర కమిటీ సభ్యులు అనుమాండ్ల శోభారాణి, జిల్లా అధ్యక్షుడు సంపత్, కమిటీ సభ్యులు చల్లూరి రాజు, సదాశివరెడ్డి డిమాండ్ చేశారు. చట్టాలు కఠినతరం చేసినప్పుడే బాలికల హత్యలు తగ్గుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment