
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూపించేందుకు తాను సిద్ధమని.. ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ చేసిందేమిటో చూపించాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి సవాల్ చేశారు. హుజూరాబాద్‌లోని అంబేడ్కర్ చౌరస్తాలో ఈ నెల 5న బహిరంగ చర్చకు వేచి చూస్తానని ఆయన ప్రకటించారు. టీఆర్‌ఎస్ పార్టీ శాసనసభా పక్ష కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్‌లో ఏమీ సాధించని ఈటల రాజేందర్ గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.
స్వగ్రామం కమలాపూర్‌లో కనీసం బస్టాండ్ కూడా ఈటల నిర్మించలేకపోయారని, సిద్దిపేట, సిరిసిల్ల తరహాలో హుజూరాబాద్‌లో అభివృద్ధి ఎందుకు సాధించలేక పోయారో ఈటల రాజేందర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈటల రాజేందర్‌ను జోకర్‌లా చూస్తున్నారని, బీజేపీలో చేరిన తర్వాత ఆయన పరిస్థితి దిగజారిపోయిందని ఎద్దేవా చేశారు. అధికారిక కార్యక్రమాలకు ఈటల రాజేందర్‌ను నియోజకవర్గ అధికారులు ఆహ్వానిస్తున్నా రావడం లేదని, శిలాఫలకాలపై తనతో పాటు ఈటల పేరు లేకుంటే ముక్కు నేలకు రాస్తానని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు.
చదవండి: టీఆర్‌ఎస్‌కు షాక్.. బీజేపీలోకి మంత్రి సోదరుడు!
Comments
Please login to add a commentAdd a comment