విలేకరులతో మాట్లాడుతున్న కౌశిక్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ / సాక్షి ప్రతినిధి, వరంగల్: హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పాడి కౌశిక్‌రెడ్డి, కమలాపూర్ మండలం మాదన్నపేటకి చెందిన విజయేందర్‌తో జరిపిన ఫోన్ సంభాషణ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయ్యి సంచలనం సృష్టించింది. ఈటల రాజేందర్ రాజీనామాతో జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున ఎవరు పోటీ చేస్తారు అనే ప్రశ్నకు అనూహ్యంగా సమాధానం దొరికినట్లయింది. తనకు టీఆర్‌ఎస్ టికెట్ ఖాయమైనట్లు ఆ ఫోన్ సంభాషణలో కౌశిక్‌రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు ‘ఎంత ఖర్చయినా పర్వాలేదు. యూత్ అందర్నీ పార్టీలోకి గుంజాలె..’అని కూడా అన్నారు.
టీఆర్‌ఎస్ అభ్యర్థిపై స్పష్టత!
హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థిని టీఆర్‌ఎస్ ప్రకటించలేదు. కానీ మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి ద యాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రెండు నెలలుగా నియోజకవర్గంలో ప్రచారం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు ఫోన్ సంభాషణలు వెలుగులోకి రావడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో.. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరడంపై, ఆ పార్టీ హుజూరాబాద్ అభ్యర్థి విషయంలో స్పష్టత వచ్చినట్టేనని అంటున్నారు. సీఎం కేసీఆర్ కూడా.. ఆదివారం తనను కలిసిన కొందరు నేతలతో కౌశిక్‌రెడ్డి అభ్యర్థి అయితే ఎలా ఉంటుందని ఆరా తీశారని సమాచారం.
అప్పట్నుంచే టచ్‌లో..: పీసీసీ తాజా మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వరుసకు సోదరుడైన కౌశిక్‌రెడ్డి.. ఈటల వ్యవహారం వెలుగులోకి వచ్చిన నాటి నుంచే టీఆర్‌ఎస్‌తో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. జిల్లా మంత్రి గంగుల కమలాకర్ ద్వారా ఆయన టీఆర్‌ఎస్ పెద్దలతో మాట్లాడినట్లు తెలిసింది. గత నెల 10న ఓ ప్రైవేటు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో కౌశిక్‌రెడ్డి భేటీ కావడం, రహస్యంగా మాట్లాడుకున్న ఫొటోలు కూడా లీకయ్యాయి. అయితే ప్రైవేటు కార్యక్రమంలో అనుకోకుండా కలిసిందేనని అప్పట్లో కొట్టిపారేశారు. అంతేకాదు రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యాక కౌశిక్‌రెడ్డి వెళ్లి ఆయన్ను కలిశారు. దీంతో కౌశిక్ కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని అంతా భావించారు. అయితే ఆదివారం వాట్సాప్ గ్రూపుల్లో కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్లు మెస్సేజ్‌లు వెల్లువెత్తాయి. దీనిపై కౌశిక్‌రెడ్డిని ఆదివారం రాత్రి ‘సాక్షి’ప్రశ్నించగా.. ఆ ప్రచారాన్ని ఖండించారు. కానీ తెల్లవారగానే కౌశిక్ జరిపిన ఫోన్ సంభాషణ లీకవడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. హుజూరాబాద్ టికెట్టు ఎవరికివ్వాలనేది సీఎం నిర్ణయమని, కౌశిక్‌రెడ్డి ఫోన్ సంభాషణపై ఏమీ వ్యాఖ్యానించలేమని ఓ ముఖ్య నాయకుడు ‘సాక్షి’తో అన్నారు.
16న టీఆర్‌ఎస్‌లోకి కౌశిక్‌రెడ్డి
సీఎం కేసీఆర్ సమక్షంలో చేరిక
సాక్షి, హైదరాబాద్: కౌశిక్‌రెడ్డి ఈ నెల 16న టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్‌లో తన అనుచరులతో కలసి టీఆర్‌ఎస్ కండు వా కప్పుకోనున్నారు. ఈ నెల 14న హుజూరాబా ద్‌కు చెందిన కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో రాజీనామా చేస్తారని కౌశిక్‌రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గంలో వివిధ స్థాయిలకు చెందిన సుమారు 2 వేల మంది కార్యకర్తలు తన వెంట టీఆర్‌ఎస్‌లో చేరుతారని కౌశిక్‌రెడ్డి సంకేతాలు ఇచ్చారు. త్వరలో జరిగే ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేస్తారని కొంత కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్‌ను ఓడించడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు కౌశిక్‌రెడ్డి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment