మరుగుదొడ్లకు రూ.22 కోట్లు
మార్చిలోగా వందశాతంపూర్తిచేయాల లేకుంటే ప్రజాప్రతినిధులు నావద్దకు రావొద్దు వచ్చే బడ్జెట్‌లో అన్ని గ్రామాలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఆర్థిక, పౌర సరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్
హుజూరాబాద్ : మరుగుదొడ్ల నిర్మాణాల కోసం రాష్ట్రవ్యాప్తంగా రూ.50 కోట్లు కేటాయిస్తే, అందులో కరీంనగర్ జిల్లాకే రూ.22 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణంపై హుజూరాబాద్ సాయిగార్డెన్స్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో గురువారం సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ అధికారులు సమష్టిగా కృషి చేసి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. మార్చి నెలాఖరు వరకు వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, లేనిపక్షంలో ప్రజాప్రతినిధులు తన వద్దకు పనుల కోసం రావొద్దని అన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలకు కావాల్సిన మెటీరియల్‌ను స్థానికంగానే తయారు చేసుకుంటే ముడి సరుకులు సబ్సిడీపై అందిస్తామన్నారు. రానున్న బడ్జెట్‌లో అన్ని గ్రామాలకు ఇళ్లు కేటాయించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
రానున్న ఏడాదిలో హుజూరాబాద్ నియోజకవర్గంలో మట్టి రోడ్లు కనిపించకుండా సిమెంట్ రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. నిధులకు ఢోకా లేదని పనులు త్వరగా చేయాలని చెప్పారు. మరుగుదొడ్ల నిర్మాణంలో లక్ష్యసాధనపై ప్రజాప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ, బిల్లుల చెల్లింపులో జాప్యముండదని అన్నారు. ప్రజలకు అవగాహన కల్పించి మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. ఆయా గ్రామాల్లో సీజ్ చేసిన ఇసుక మరుగుదొడ్ల నిర్మాణాలకు వాడుకోవాలని సూచించారు. ఇప్పటికే 100 శాతం నిర్మాణాలతో లక్ష్యాన్ని సాధించిన కమలాపూర్ మండలం శంభునిపల్లి, జమ్మికుంట మండలం శాయంపేట గ్రామాల సర్పంచులు, కార్యదర్శులను కలెక్టర్ అభినందించారు. సమావేశంలో అడిషనల్ జాయింట్ కలెక్టర్ నాగేంద్ర, డ్వామా పీడీ గణేశ్, ఆర్డీవో చంద్రశేఖర్, ఎంపీపీలు వొడితల సరోజినీదేవి , గంగారపు లత, లాండిగె లక్ష్మణ్‌రావు, నగర పంచాయతీ చైర్మన్ విజయ్‌కమార్ తదితరులు పాల్గొన్నారు.