మల్లమ్మ
సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా చోరులు ఖరీదైన ప్రాంతాలనే టార్గెట్‌గా చేసుకుంటారు. అయితే బాలమ్‌రాయ్‌కి చెందిన పసుపుల కల్పన అలియాస్ మల్లమ్మ శైలి దీనికి విరుద్ధం. కేవలం మధ్య తరగతి ప్రజలు ఉండే కాలనీల్లోనే తన చేతికి ‘పని’ చెబుతుంది. భార్యభర్తలు ఉద్యోగస్తులుగా ఉన్న, పనులపై బయటికి వెళ్తున్న వారు ఇంటి తాళాలను ఎక్కడ దాస్తారో ఈమెకు బాగా తెలుసు. ఇప్పటికే అనేకసార్లు జైలుకు వెళ్లి వచ్చిన మల్లమ్మను తాజాగా మార్కెట్ పరిధిలో జరిగిన నేరానికి సంబంధించి ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఘటన చోటు చేసుకున్న మూడు రోజుల్లోనే ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితురాలి నుంచి రూ.4.7 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ పి.రాధాకిషన్‌రావు ఆదివారం వివరాలు వెల్లడించారు. బాలమ్‌రాయ్ ప్రాంతానికి చెందిన మల్లమ్మ వృత్తిరీత్యా హౌస్ కీపింగ్ పని చేసేది. అయితే తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం నేరాల బాట పట్టింది. ఇప్పటి వరకు ఈమెపై కుషాయిగూడ, నాచారం, బేగంపేట ఠాణాల్లో 13 కేసులు నమోదై ఉన్నాయి. పగలు–రాత్రి తేడా లేకుండా చేతివాటం చూపించే ఈమె గతంలో పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చింది.
ఓ స్క్రూడ్రైవర్, కటింగ్ ప్లేయర్ పట్టుకుని మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో సంచరిస్తుంటుంది. బయట నుంచి తాళం వేసున్న ఇల్లు కనిపిస్తే వెంటనే అప్రమత్తమవుతుంది. చుట్టుపక్కల పరిస్థితులను అధ్యయనం చేసి తనకు అనుకూలంగా ఉన్న ఇంటి ఎంచుకుంటుంది. ముందుగా ఆ ఇంటి వద్దకు వెళ్ళి బయటపక్కన తాళం చెవులు పెట్టడానికి అవకాశం ఉండే అన్నిచోట్లా వెతుకుతుంది. అవి లభిస్తే వాటిని వినియోగించి... లేదా తన వద్ద ఉన్న కటింగ్ ప్లేయర్, స్క్రూడ్రైవర్‌లతో తాళం పగులకొట్టి ఇంట్లోకి వెళ్తుంది. అక్కడున్న బీరువాలు, అల్మరాల్లో గాలించే మల్లమ్మ వెండి, బంగారు ఆభరణాలతో పాటు నగదు ఎత్తుకెళ్లేది. గురువారం మార్కెట్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఆదయ్య నగర్‌లో చోరీ చేసింది. ఆ రోజు ఉదయం ఎస్.శైలజ అనే మహిళ ఇంటి తాళం పగుల కొట్టి లోపలకు ప్రవేశించి 135.2 గ్రాముల బంగారు, 50 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు వాచీలు తదితరాలు ఎత్తుకెళ్లింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును ఛేదించడానికి నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సైలు కేఎస్ రవి, కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్, జి.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన బృందం సీసీ కెమెరాలను పరిశీలించి మల్లమ్మను అనుమానితురాలిగా గుర్తించారు. ఆదివారం వలపన్ని నిందితురాలిని అదుపులోకి తీసుకుని చోరీ సొత్తురికవరీ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితురాలితో పాటు రికవరీ చేసిన సొత్తును మార్కెట్ పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment