‘లింకు’ వివాదం
Published Mon, Dec 23 2013 3:23 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM
ఏలూరు, న్యూస్‌లైన్ :వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ)ల నిధులతో గ్రామాల్లో లింకురోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదానికి దారి తీసింది. ఏఎంసీ ఇంజినీరింగ్ విభాగాన్ని తోసిరాజని పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బీ ఇంజినీరింగ్ శాఖలకు నేరుగా నిధులు మళ్లించాలన్న నిర్ణయంపై ఏఎంసీ చైర్మన్లు గుర్రుగా ఉన్నారు. తమ శాఖ నిధులపై వేరే శాఖల పెత్తనం ఏమిటని భావించిన వారు అమీతుమీకిసిద్ధపడటంతో రోడ్ల అభివృద్ధి ప్రతిపాదనల స్థాయిలోనే నిలిచిపోయింది. ఏఎంసీల నిధలుఉ రాష్ట్ర వ్యాప్తంగా రూ.వందలాది కోట్లు ఉంటే ప్రభుత్వం కేవలం రూ.100 కోట్ల పనులకే అనుమతినివ్వడంపైనా విమర్శలు రేగుతున్నాయి. ఒక్కో ఏఎంసీ పరిధిలో పనులకు రూ.50 లక్షలు మంజూర య్యే అవకాశం కూడా కనిపించటం లేదని మార్కెటింగ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో 18 కమిటీల్లో రూ.75 కోట్లకుపైగా నిధులు మూలుగుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఇటీవలే ఐదారు కమిటీలకు కొత్త పాలకవర్గాలు ఏర్పాటు చేశారు. ఏలూరు కమిటీ పాలకవర్గం గడువు ముగిసి నెల అవుతున్నా ఇంకా కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు చేయలేదు.
నిషేధం తొలగిందనే ఆనందం మిగలలేదు
ఏఎంసీల పరిధిలో లింకురోడ్ల అభివృద్ధిపై నిషేధాన్ని 2005లో విధించారు. ఎన్నికల సీజన్ తరుమకొస్తుండటంతో ఎమ్మెల్యేలు, ఏఎంసీల చైర్మన్ల కోరిక మేరకు ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో జీవో జారీ చేసింది. ఆ రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు కోరింది. అయితే ఏఎంసీ ఇంజినీరింగ్ విభాగాన్ని విస్మరించి పాత పద్ధతిలోనే పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్ విభాగాలకు పనులను అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై చైర్మన్లు గుర్రుగా ఉన్నారు. పైగా ఇంజనీరింగ్ అధికారులు సర్వే చేసి గతంలో అభివృద్ది చేసిన గ్రావెల్ రోడ్లును బీటీ రోడ్లుగా మార్చేందుకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుండటంతో చైర్మన్లు ప్రతిపాదనలను అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో ఏ ఏఎంసీలోను ప్రతిపాదనలను రూపొందించే పరిస్థితి లేదు. కొద్ది నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే పనులు ప్రారంభించే అవకాశం ఎలాగూ ఉండదు.
సమీక్షించనున్న కలెక్టర్
మార్కెటింగ్ శాఖ పరిధిలో అన్ని కమిటీలకు పూర్తిస్థాయి కార్యదర్శుల నియామకం ఇటీవలే జరిగింది. దీంతో ఈ శాఖ పనితీరు, లింకురోడ్ల అభివృద్ధి తదితర అంశాలపై కలెక్టర్ సిద్ధార్థజైన్ రెండు మూడు రోజుల్లో జిల్లాలోని ఏఎంసీ మంది కార్యదర్శులతోను సమీక్షా సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఈ విషయంపై త్వరలోనే తుది నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నారు.
Advertisement
Advertisement