'అభివృద్ధి ఒకేచోట ఉండకూడదని ప్రజల్లో బలంగా ఉంది'
హైదరాబాద్: కొత్త రాజధాని అభివృద్ధి ఒకేచోట కేంద్రీకరించకూడదన్నఅభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బలంగా ఉందని మాజీ మంత్రి, వ్యవసాయ నిపుణుడు వడ్డే శోభానాద్రీశ్వరరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మాట్లాడిన వడ్డే.. రాజధాని గుంటూరు-విజయవాడ మధ్య ఉంటుందని ప్రకటించిన సీఎం చంద్రబాబు అభివృద్ధిని వికేంద్రీకరిస్తామని చెప్పారన్నారు. కానీ దానికి భిన్నంగా ఏపీ ప్రభుత్వం ఆలోచనలు సాగుతున్నాయన్నారు. ప్రజల్లో, రైతుల్లో అనేక రకాలైన అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. ఈ సమస్యలకు, సందేహాలకు ప్రభుత్వం నుంచి స్పష్టత రావడం లేదన్నారు.
నయా రాయ్ పూర్ కు కేవలం రెండు వేల ఎకరాల భూసమీకరణ చేసారన్న సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏడు వందల యాభై ఎకరాల్లో క్యాపిట్ కాంప్లెక్స్ లో అన్ని ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారని శోభానాద్రీశ్వరరావు తెలిపారు.
ఇదిలా ఉండగా గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీనగర్ లో 12 వేల ఎకరాల్లోనే జరిగిందన్నారు. అక్కడ 500 ఎకరాల్లో కేపిటల్ కాంప్లెక్స్ నిర్మాణం చేశారన్నారు. గ్రీన్ సిటీ మంచిది కాదని శివరామకృష్ణన్ స్పష్టం చేశారని వడ్డే తెలిపారు. ఇప్పుడు లక్షల ఎకరాల విస్తీర్ణంలో రాజధాని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారని.. దీనిపై పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్నాయన్నారు.
రాజధాని ఏర్పాటుకు 30 వేల ఎకరాలే అని ఎవ్వరూ అంతిమంగా చెప్పలేదని..భవిష్యత్తులో కూడా మరికొంత భూసమీకరణ చేస్తామని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం చెప్తోందన్నారు. ప్రభుత్వం తీసుకోవాల్సిన భూమిలో దేనికి ఎంతో ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.
విభజన చట్టంలో చాలా అంశాలు అమల్లోకి రాలేదన్నారు. రెండు రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలు వస్తే ఏది కరెక్టు.. ఏది కరెక్టు కాదు అని చెప్పే పరిస్థితులో కేంద్రం లేదన్నారు. జార్ఖండ్ కు రూ.800 కోట్లు, ఉత్తరాఖండ్ కు రూ.400 కోట్లు ఇచ్చారన్నారు. 2008 నుంచి నయా రాయ్ పూర్ నిర్మాణం ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. సింగపూర్, జపాన్ ల నుంచి వచ్చే నిధులు అప్పుగానే వస్తాయి గానీ, గ్రాంట్ గా ఇవ్వరన్న సంగతిని గుర్తుంచుకోవాలని వడ్డే శోభానాద్రీశ్వర్రావు తెలిపారు.