
గన్నవరం వైపు నెహ్రూ చూపు
* తూర్పు నియోజకవర్గానికి గుడ్‌బై?
* నేడు నున్నలో కీలక సమావేశం
* హాజరుకానున్న నెహ్రూ
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) విజయవాడ తూర్పు నియోజకవర్గానికి గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన రానున్న ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. తూర్పు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే యలమంచిలి రవి వచ్చే ఎన్నికల్లో కూడా అక్కడ నుంచే పోటీ చేయటానికి సుముఖంగా ఉన్నారు. విజయవాడ నగరానికి ద గ్గర్లో ఖాళీగా ఉన్న గన్నవరం నియోజకవర్గం నుంచి నెహ్రూను పోటీ చేయించటానికి సమాలోచనలు జరుగుతున్నట్లు సమాచారం.
గత నెల రోజులుగా నెహ్రూ గన్నవరం నియోజకవర్గానికి వస్తున్నట్లు అక్కడి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు శనివారం నున్నలో విజయవాడ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి దేవినేని నెహ్రూను ముఖ్య అతిథిగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆహ్వానించారు. ఆయన కూడా అందుకు అంగీకరించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు.
ఈ మేరకు నియోజకవర్గంలో గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల పరిధిలో ఉన్న ముఖ్య కాంగ్రెస్ నాయకులను కూడా నున్నలో జరిగే సమావేశానికి రమ్మని ఆహ్వానించారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన పార్టీ మారి నూజివీడు నుంచి పోటీ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. గత కొద్దిరోజులుగా గన్నవరంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలన్నీ నిలిచిపోయాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు నాయకుడు లేక దిక్కుమొక్కూ లేని పరిస్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో కొందరు ప్రస్తుత పరిస్థితిలో తమకు అండ కోసం నెహ్రూను తమ తమ నియోజకవర్గాల నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు.
గన్నవరంతో నెహ్రూకు అనుబంధం...
గన్నవరం నియోజకవర్గంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో దేవినేని రాజశేఖర్ (నెహ్రూ)కు అనుబంధం ఉంది. గతంలో నెహ్రూ కంకిపాడు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కంకిపాడు నుంచి విజయవాడ రూరల్ మండలం వరకు పార్టీ నాయకులు క్యాడర్‌తో నెహ్రూకు సంబంధాలు ఉండేవి. విజయవాడ రూరల్, గన్నవరం, ఉంగుటూరు మండలాల్లో నెహ్రూకు బంధువులు ఉన్నారు. ఆయా ప్రాంతాలలో సర్పంచ్‌లు, కాంగ్రెస్ నాయకులు ఇప్పటీకీ నెహ్రూ వర్గీయులుగా ముద్రపడి ఉన్నారు. వీటన్నిటిపై నెహ్రూను ఈ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చే యించేందుకు ఆయన వర్గీయులు పావులు కదుపుతున్నట్లు సమాచారం.