
పెనంలూరు అగ్గికి... ఉమా ఆజ్యం!
విజయవాడ : పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాల మధ్య ఏర్పడ్డ విభేదాలు ఆ పార్టీని కుదిపేస్తున్నాయి. పార్టీ అధికార ప్రతినిధి వైవీబీ రాజేంద్రప్రసాద్, దివంగత చలసాని పండు వర్గానికి చెందిన బోడే ప్రసాద్‌ల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరడం అధినేత చంద్రబాబునే అసహనానికి గురిచేస్తోంది. వీటిని పరిష్కరించేందుకు పార్టీ పరిశీలకుడు సుజనాచౌదరి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.
ప్రస్తుతం స్థానిక ఎంపీ కొనకళ్ల నారాయణ ఇరు వర్గాల మధ్య విభేదాలను చక్కదిద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్య నేతలు చెప్పారు కాబట్టి సరే అంటారు తప్ప... వాస్తవంగా రాబోయే రోజుల్లో ఈ రెండు గ్రూపులు కలిసే పరిస్థితి లేదని సీనియర్ నేతలు ఇప్పటికే చంద్రబాబునాయుడుకు ఒక నివేదిక పంపినట్లు సమాచారం. పండు, వైవీబీ వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరడానికి కారణం ఏమిటనే అంశంపై కూడా పార్టీ వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తోంది.
అగ్నికి ఆజ్యం పోస్తున్న ఉమా!
పెనమలూరు నియోజకవర్గానికి ఇన్‌చార్జి లేరు. ఈ నియోజకవర్గంపై మొదటి నుంచి కన్నేసిన జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు ఇక్కడ ఇన్‌చార్జిని నియమించకుండా జాగ్రత్తపడుతూ వచ్చారు. దీనికి తోడు రెండు వర్గాలను సమానంగా పెంచి పోషిస్తూ వస్తున్నారు. మరికొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అటు వైవీబీ వర్గం.. ఇటు బోడె వర్గం సీటు కోసం పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు చంద్రబాబు ఎదురుగానే తలపడ్డాయి. వారి మధ్య విభేదాలు మరింత తీవ్రస్థాయికి చేరితే మాధ్యేమార్గంగా తాను ఇక్కడ నుంచి రంగంలోకి దిగాలని దేవినేని ఉమామహేశ్వరరావు ఆలోచిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జోరుగా సాగుతోంది.
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేశినేని శ్రీనివాస్ (నాని)తో కూడా దేవినేని ఉమాకు పొసగడం లేదు. దీనికితోడు మైలవరం నియోజకవర్గ ప్రజలు కూడా ఉమా మాటలు నమ్మి ఈసారి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరని సర్వేలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తనకు సురక్షితంగా ఉండే పెనమలూరు నియోజకవర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు దేవినేని ఉమా కొద్ది నెలలు తనదైన శైలిలో పావులు కదుపుతూ ఇరువర్గాల మధ్య విభేదాలు కొనసాగేలా చూశారని అంటున్నారు. ఇదే విషయం చంద్రబాబు వద్ద చర్చకు వచ్చిందని, విభేదాలు తీవ్రస్థాయికి వెళ్లేవరకు జిల్లా పార్టీ ఏంచేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
దేవినేని చందు కన్ను?
పెనమలూరు నియోజకవర్గం తనకు దక్కకపోతే తన కుటుంబానికి చెందినవారికి దక్కేవిధంగా చూడాలని దేవినేని ఉమా పథకం రచిస్తున్నట్లు సమాచారం. గతంలో కేశినేని నానిని అంటిపెట్టుకుని ఉన్న అర్బన్ తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని చంద్రశేఖర్ పెనమలూరులో సొంతగా కార్యాలయం పెట్టుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వైవీబీ వర్గానికి, బోడె వర్గానికి మధ్య విభేదాలు ఉన్నందున తనకు అవకాశం కల్పించాలంటూ చివరి నిమిషంలో చందు కూడా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పెనమలూరు నియోజకవర్గంలో ఏర్పడ్డ విభేదాలు ‘దేశం’ సీనియర్ నేతలకు తలనొప్పిగా మారాయి. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే సామాజిక వర్గం ఓట్లు నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నప్పటికీ నేతల మధ్య ఐక్యత లేని కారణంగా ఈసారి కూడా పరాజయం తప్పదనే భావన వారిలో వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వర్గం వారికి నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తే, రెండో వర్గం తప్పనిసరిగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుందని అంటున్నారు. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలు సరిగా జరగకపోవడంతో క్యాడర్ కూడా వేరే పార్టీల వైపు చూస్తోంది. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో పార్టీని చక్కదిద్దడం అంటే తలకు మించిన భారంగానే పార్టీ నేతలు భావిస్తున్నారు.