
భక్తిశ్రద్ధలతో బక్రీద్
జిల్లా వ్యాప్తంగా ముస్లింలు సోమవారం భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండుగను జరుపుకున్నారు. అన్ని ఈద్గాలలో సామూహిక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇరుగుపొరుగువారి సుఖసంతోషాల కోసం కృషిచేసేవారినే అల్లాహ్ అభిమానిస్తాడని మత పెద్దలు పేర్కొన్నారు. ప్రజలంతా ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. కడపలో పెద్ద దర్గా పీఠాధిపతి బక్రీద్ ప్రార్థనలు చేయించారు.
కడప కల్చరల్ :
బక్రీద్ పండుగ ద్వారా అల్లాహ్ అందించిన సందేశం మానవులందరికీ ఆచరణీయమని మత గురువు ముఫ్తీ మహమ్మద్ న్యాయమతుల్లా సాహెబ్ పేర్కొన్నారు. బక్రీద్‌పండుగను పురస్కరించుకుని సోమవారం కడప నగరం బిల్టప్ ఈద్గాలో ముస్లింలు సామూహికంగా ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముఫ్తీ న్యాయమతుల్లా పండుగ బయాన్ ఇచ్చారు. హజరత్ ఇబ్రహీం, ఆయన కుమారుడు ఇస్మాయిల్ అల్లాహ్ పెట్టిన పరీక్షలో నెగ్గిన విధానాన్ని ఆయన కళ్లకు కట్టినట్లు వివరించారు. వారి త్యాగాలు మానవాళికి ఆదర్శమన్నారు. బక్రీద్ ప్రార్థనలు నిర్వహించవలసిన పద్ధతులను వివరించారు. ఈ పండుగ సందర్బంగా ఇచ్చే ఖుర్చానీని దైవం పేరిట ఇవ్వాలన్నారు.
ఇరుగు పొరుగు సుఖ సంతోషాల కోసం కృషి చేసే వారినే అల్లాహ్ అభిమానిస్తాడని, ప్రజలంతా ఆనందంగా కలిసిమెలిసి ఉండాలన్నారు. అనంతరం పెద్దదర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ హాజరైన భక్తులతో బక్రీద్ ప్రార్థనలు చేయించారు. ఈ సందర్బంగా ఆయన ఆశీస్సుల కోసం ప్రజలు ఆరాటపడ్డారు. పలువురు ముస్లిం ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు పొందారు. ప్రజలు ఒకరినొకరు హత్తుకుని సాంప్రదాయబద్దంగా ‘ఈద్ ముబారక్ హో’ అంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రార్థనలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈద్గా అంతటా షామియానాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పెద్దదర్గా ప్రతినిధులు నయీమ్, అమీర్, బైజు, మున్నా, మాజీమంత్రి అహ్మదుల్లా, ఆయన కుమారుడు అస్రఫ్, నగర ప్రముఖులు అమీర్‌బాబు, సుభాన్‌బాష, నజీర్ అహ్మద్, దుర్గాప్రసాద్, సీఆర్‌ఐ సుబ్బారెడ్డి, ఎన్‌ఆర్‌ఐ తోట కృష్ణ, మగ్బూల్‌బాష తదితరులు పాల్గొన్నారు.