భక్తులు మెచ్చాలి | devotees have to praise | Sakshi
Sakshi News home page

భక్తులు మెచ్చాలి

Published Sun, Jan 5 2014 6:04 AM | Last Updated on Thu, Mar 21 2019 8:29 PM

devotees have to praise


 భద్రాచలం, న్యూస్‌లైన్ :
 భద్రాచలంలో ఈనెల 10,11 తేదీల్లో జరిగే తెప్పోత్సవం, ఉత్తర ద్వారదర్శనం వేడుకలను భక్తులు మెచ్చే రీతిలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీ నరేష్ అన్నారు. ముక్కోటి ఉత్సవాల ఏర్పాట్లపై శనివారం రాత్రి రామాలయం ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసేలా ఉత్సవాలను నిర్వహించేందుకు అధికారులంతా కృషి చేయాలన్నారు. భక్తులకు సరిపడా వసతి  సౌకర్యాలు కల్పించేందుకు శ్రద్ధ తీసుకోవాలన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. స్వామి వారి తెప్పోత్సవం,  ఉత్తర ద్వార దర్శనం వేడుకలను భక్తులు తిలకిచేందుకు వీలుగా ప్రధాన కూడళ్లలో ఎల్‌ఈడీలను తగినన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
 
 భవిష్యత్తులో ఉత్సవాలను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు వీలుగా  జిల్లా ఎస్పీ రంగనాథ్ సూచన మేరకు  జనసంచారం ఉన్న ప్రదేశాల్లో ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలని సమాచార శాఖ అధికారులను ఆదేశించారు. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను రెండు రోజుల ముందుగానే పూర్తి చేయాలన్నారు. గోదావరి నదిలో స్వామి వారి తెప్పోత్సవం  నిర్వహణకు హంసవాహనం తయారీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ నెల 7న గోదావరి నదిలో హంస వాహనం ట్రయల్ రన్ వేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ముక్కోటి ఉత్సవాలకు సంబంధించిన టిక్కెట్లు సిద్ధమైనట్లుగా ఈవో రఘునాధ్ తెలిపారు. వీఐపీ, ఇతర సెక్టార్‌లకు సంబంధించిన టిక్కెట్లను ముద్రించి ముందుగానే తెప్పించినట్లుగా వివరించారు. టిక్కెట్ల విక్రయం నిమిత్తం ఈ నెల 7న ఆయా శాఖల అధికారులకు వాటిని అప్పగిస్తామని చెప్పారు. అదే విధంగా పోలీసు శాఖ వారి సూచనల మేరకు రామాలయ పరిసర ప్రాంగణాల్లో ఈసారి ఎక్కువగా సీసీ కెమేరాలను ఏర్పాటు చేస్తున్నట్లు  చెప్పారు. సెంట్రల్ కంట్రోల్ రూమ్ ద్వారా వీటిని ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షిస్తారని ఆయన వివరించారు.
 
 పారిశుధ్య చర్యలు బాగాలేవు :
 రామాలయ పరిసరాల్లో పారిశుధ్య పనులు సరిగా లేవని ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని  ఐటీడీఏ పీవో వీరపాండియన్ అన్నారు. రామాలయానికి ఎదురుగా ఉన్న రహదారిపై డ్రైనేజీ నుంచి దుర్గంధం వస్తోందని, దీనిని వెంటనే శుభ్రం చేసి విస్తృతంగా ఫాగింగ్ చేయాలన్నారు. అదే విధంగా గోదావరి స్నానఘట్టాలకు ఆనుకొని ఉన్న కరకట్టపై గల ముళ్ల పొదలను వెంటనే తొలగించాలని, దీనిపై తాను చెప్పినప్పటికీ ఇంకా పనులు మొదలుకాలేదన్నారు.  
 
 తప్పుడు నివేదికలు ఇస్తే సస్పెండ్ చేస్తా  :
 ఆహార పదార్థాల తనిఖీ, తూనికల కొలతల శాఖ అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భద్రాచలంలో హోటళ్ల యజమానులు ఎక్కువ ధరలను వసూలు చేయటమే కాకుండా, పరిశుభ్రత పాటించటం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ముక్కోటి సందర్భంగా ఇప్పటి వరకూ ఎన్ని సార్లు భద్రాచలంలో తనిఖీలు చేశారని ప్రశ్నించగా సదరు శాఖాధికారులు తెల్లమొహం వేశారు. దీంతో జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ కల్పించుకొని ఆహారపదార్థాల తనిఖీ, తూనికల కొలతల శాఖాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముక్కోటి ఉత్సవాలు ముగిసేంత వరకూ తనకు రోజు వారీ నివేదికలు ఇవ్వాలంటూ ఆదేశించారు. తప్పుడు నివేదికలు ఇచ్చినట్లుగా తేలితే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ఆహార పదార్థాల తనిఖీ విషయంలో పోలీస్ శాఖ పరంగా ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేస్తామని జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. వీరు సాధారణ భక్తుల మాదిరే ఉత్సవాల రెండు రోజులూ  హోటళ్లు, లాడ్జీల్లో తిరిగి రేట్ల వివరాలను సేకరిస్తారని చెప్పారు.
 
 సామాన్యులకు వసతి లేదా..?
  ముక్కోటి ఉత్సవాల సందర్భంగా 10,11 తేదీల్లో భద్రాచలం పట్టణంలోని లాడ్జీలు, ఇతర సత్రాల్లో సామాన్యులకు వసతి దొరికే పరిస్థితి లేదని తెలుసుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ  ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఉత్సవాల సమయంలో భద్రాచలంలో ఉన్న లాడ్జీల్లో ఉన్న గదుల  కేటాయింపులు ఎలా ఉంటాయనే దానిపై ఆర్‌డీవో  వెంకటేశ్వర్లు వివరించారు. 50 శాతం రెవెన్యూ వారికి, 30 శాతం పోలీసులకు, మిగతా 20 శాతం  లాడ్జీల యజమానులకు కేటాయిస్తున్నట్లుగా వెల్లడించారు. దీంతో సామాన్య భక్తులకు వసతి కష్టాలు తప్పవని అధికారులు సమావేశం సాక్షిగా తేల్చి చెప్పారు.  
 
 ఏర్పాట్లు పరిశీంచిన కలెక్టర్ :
  ముక్కోటి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అధికారులతో కలసి పరిశీలించారు. తెప్పోత్సవం నిర్వహించే గోదావరి నదీ తీరం, రామాలయ ప్రాంగణాలను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు సూచనులు చేశారు. ఈ సమావేశంలో   భద్రాచలం ఏఎస్పీ ప్రకాష్‌రెడ్డి, భద్రాచలం, పాల్వంచ ఆర్డీవోలు కాసా వెంకటేశ్వర్లు, శ్యాంప్రసాద్, ఇరిగేషన్ ఈఈ శ్రావణ్‌కుమార్, డీఎంఅండ్‌హెచ్‌వో భానుప్రకాష్‌తో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement