సూర్య కిరణాల వెలుగులో మెరిసిపోతున్న ఆదిత్యుని మూలవిరాట్టు, ఆలయ ప్రవేశం చేస్తున్న సూర్యకిరణాలు
దసరా దేవి నవరాత్రుల్లో ఆదిత్యుడు అద్భుత దర్శన భాగ్యాన్ని కలిగించాడు. దశాబ్దాల కాలం తర్వాత ఇంతటి కాంతితో, తేజోవంతుడిగా మూలవిరాట్టు మెరిసిపోయింది.
– శంకరశర్మ, ఆలయ ప్రధాన అర్చకుడు
అరసవల్లి (శ్రీకాకుళం): శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో కొలువైన ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామిని తొలి సూర్యకిరణాలు తాకిన అద్భుత దృశ్యం బుధవారం భక్తులకు కనువిందు చేసింది. ఉత్తరాయణం నుంచి దక్షిణాయన కాలమార్పుల్లో భాగంగా సూర్యకిరణాల కాంతిలో ఆదిత్యుడు బంగారు ఛాయలో మెరిసిపోయాడు. సూర్య కిరణాలు రాజాగోపురం నుంచి అనివెట్టి మండపం దాటుతూ ధ్వజస్తంభాన్ని తాకుతూ అంతరాలయం దాటుకుంటూ నేరుగా గర్భాలయంలోని ఆదిత్యుని మూలవిరాట్టును తాకాయి. కాంతితేజంలా కన్పించిన ఈ అద్భుత దృశ్యాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. ఆలయ ఈవో వి.హరిప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించగా.. ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
కిరణాలు తాకాయిలా...
- బుధవారం ఉదయం సరిగ్గా 6.04 నిమిషాల సమయంలో దివ్య తేజస్సుతో తొలి లేలేత బంగారు వర్ణ కిరణాలు ఆదిత్యుని మూలవిరాట్టు పాదాలను తాకాయి.
- అదే నిమిషం నుంచి అలా అలా.. పైపైకి కిరణ కాంతులు స్వామి ఉదరం, వక్ష భాగాలను స్పృశిస్తూ.. ముఖ భాగం, కిరీట భాగాన్ని తాకాయి.
- ఒక్కసారిగా గర్భాలయమంతా కాంతివంతమైంది.
- ఏడు గుర్రాలతో నిత్యం స్వారీ చేస్తున్న వెలుగుల రేడును అదే ఏడు నిమిషాలపాటు కిరణాలు అంటిపెట్టుకుని ఉండిపోయాయి.
- గత కొన్ని దశాబ్దాల కాలంలో ఇలాంటి కిరణ దర్శనం కలుగలేదని సాక్షాత్తు అర్చకులు చెబుతున్నారు.
ఆలయ చరిత్ర
గంగా వంశరాజు గుణశర్మ వారసుడైన కళింగరాజు దేవేంద్రవర్మ క్రీ.శ.663లో ఈ దేవాలయాన్ని నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. క్రీ.శ. 16వ శతాబ్దంలో హర్షవల్లి ప్రాంతానికి నిజాం నవాబు సుబేదార్‌గా వచ్చిన షేర్ మహమ్మద్ ఖాన్, తానే ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లుగా ఒక శాసనంలో చెప్పుకున్నారు. ఆయన వద్ద ఉద్యోగిగా ఉన్న సీతారామస్వామి అనే పండితుడు.. మహమ్మద్ ఖాన్, హర్షవల్లిపై దండెత్తుతాడని తెలుసుకుని మూలవిరాట్టును తీసుకుని సమీపంలోని ఒక బావిలో దాచారట. క్రీ.శ 1778లో ఎలమంచిలి పుల్లాజీ పంతులు ఆ బావిలో మూలవిరాట్టును కనుగొని, తర్వాత ధ్వంసమైన ఆలయాన్ని పునర్నిర్మించి, విగ్రహ ప్రతిష్ట చేశారు.
నాడు హర్షవల్లి.. నేడు అరసవల్లి
శ్రీసూర్యనారాయణ స్వామి వారు కొలువైన ఏకైక దివ్యక్షేత్రంగా, దేశంలోనే నిత్య పూజలందుకుంటున్న ఏకైక సూర్యదేవాలయంగా అరసవల్లి విరాజిల్లుతోంది. ఇక్కడి సూర్యదేవుణ్ని దర్శించుకుని అభిషేకాలు, సూర్యనమస్కారాలు చేసిన వారు, తమ కోర్కెలు ఫలించగా,ఎంతో హర్షితులై తిరిగి వెళ్లేవారు. అందువల్ల ఈ క్షేత్రాన్ని హర్షవల్లి అని పిలిచేవారు. కాలక్రమేణా ఇది అరసవల్లిగా మారింది.
ఏడాదికి రెండు సార్లు
మూలవిరాట్టు ఉన్న స్థానబలం వల్ల ప్రతి ఏటా ఉత్తరాయణ, దక్షిణాయన కాలమార్పుల్లో నేరుగా తొలి లేత కిరణాలు నేరుగా స్వామి వారి మూలవిరాట్టును ప్రతి భాగమూ స్పృశించడం ఇక్కడి క్షేత్ర మహత్మ్యం. ప్రతి ఏటా మార్చి 9,10,11,12 తేదీల్లోనూ, అలాగే అక్టోబర్ 1,2,3,4 తేదిల్లోనూ స్వామి వారిని సూర్య కిరణాలు తాకుతుంటాయి.
అక్కడ తిరుమలలో.. ఇక్కడ అరసవల్లిలో
తిరుమలలో వెంకన్న స్వామికి, ఇక్కడ అరసవల్లి ఆదిత్యునికి కూడా నడుముకు చురిక (చిన్న కత్తి)ను ఆయుధంగా ధరించినట్లుగా కొలువుతీరడం ప్రత్యేకం. ఈ సూర్యక్షేత్రంలో శ్రీ ఉషా పద్మిని ఛాయా దేవి అనే ముగ్గురు భార్యలతో సూర్యభగవానుడు శాలిగ్రామ ఏక శిలతో విగ్రహరూపుడై ఉంటారు. స్వామి సింహలగ్న జాతకుడైనందున ఆయన విరాట్టుపై సింహతలాటం ఉంటుంది. ఆయనకు రెండు హస్తాలుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment