శ్రీకాకుళం అర్బన్ :ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంతోపాటు జిల్లా పరిషత్ వేదికగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ జెడ్పీ ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, విప్, అధికార ప్రతినిధులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు నీరు-చెట్టు కార్యక్రమం పేరుతో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, దీనిపై ప్రశ్నించాలని సూచించారు.
తమ పరిధిలోని సమస్యలను జెడ్పీ సమావేశంలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అధికార పార్టీ ప్రజల్లో అపఖ్యాతిపాలవడంతోపాటు వైఎస్సార్ సీపీ బలంగా తయారైందన్నారు. పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం మాట్లాడుతూ పంచాయతీలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని దుయ్యబట్టారు. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీలకు ఇచ్చిన అధికారులకు కోత పెడుతుందని విమర్శించారు. ప్రజలకు వీటన్నింటిని వివరించి అభివృద్ధి ఏవిధంగా కుంటుపడుతుందో తెలియజేయాలన్నారు.
పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ చంద్రబాబు ఒక పార్టీకి మాత్రమే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా రాక్షసపాలన చేస్తున్నారని విమర్శించారు. అందరం కలిసి ప్రజా సమస్యలపై పోరాడుదామని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ ప్రజలు చెల్లించే పన్నులో కొంత భాగం జెడ్పీకి వస్తుందని, దీన్ని ఆయా గ్రామాల్లో తాగునీరు, ఇతరత్రా పనులకు వినియోగిస్తారన్నారు. దురదృష్టవశాత్తు పచ్చచొక్కాలకే నిధులు కేటాయిస్తున్నారని విమర్శించారు.
టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ జెడ్పీలో వైఎస్సార్‌సీపీ సభ్యులకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు మీసాల నీలకంఠంనాయుడు, నర్తు రామారావు, పాలవలస విక్రాంత్, దువ్వాడ వాణి, అంధవరపు సూరిబాబు, కర్నిక సుప్రియ, పేరాడ తిలక్, కోణార్క్ శ్రీను, మామిడి శ్రీకాంత్, ఎన్ని ధనుంజయ్, రొక ్కం సూర్యప్రకాశరావు, కరిమి రాజేశ్వరరావు, కిల్లి వెంకట సత్యన్నారాయణ, సువ్వారి గాంధీ, మండవిల్లి రవి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
జెడ్పీ ఫ్లోర్ లీడర్‌గా ధర్మాన పద్మప్రియ కృష్ణదాస్
జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్‌గా ధర్మాన పద్మప్రియ కృష్ణదాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఆనెపు రామకృష్ణ, విప్‌గా గొర్లె రాజగోపాల్, అధికార ప్రతినిధిగా కురమాన బాలకృష్ణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ధర్మాన పద్మప్రియ కృష్ణదాస్ మాట్లాడుతూ ఈ పదవితో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ప్రజా సమస్యలను సభ దృష్టికి తెసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఆనెపు రామకృష్ణ మాట్లాడుతూ 13వ ఆర్థిక సంఘం నిధులు లేవని, దీనికోసం దరఖాస్తులు పెట్టుకోవద్దని ప్రభుత్వమే లేఖలు రాయడం శోచనీయమన్నారు. జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల అధికారాలను ప్రభుత్వం లాక్కొంటుందని, జన్మభూమి కమిటీ సభ్యులకే ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
పోరాడదాం.. ఎండగడదాం
Published Thu, Mar 10 2016 12:41 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement