=మేనేజ్‌మెంట్ సీట్ల పేరుతో వసూళ్లు
=సీటు ఖరీదు రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షలు
నర్సీపట్నం, న్యూస్‌లైన్: డీఎడ్‌కు పెరిగిన డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కళాశాలల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. కన్వీనర్ కోటా పక్కన పెడితే మేనేజ్‌మెంట్ సీట్ల పేరుతో కృత్రిమ డిమాండ్ సృష్టిస్తున్నాయి. అధిక మొత్తంలో గుంజుతుండటంతో పేద విద్యార్థులు డీఎడ్‌కు దూరమవుతున్నారు. ఎస్‌జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులే అర్హులని నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం ప్రకటించడంతో విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. డీఎడ్‌కు ఇంటర్మీడియట్ అర్హతగా పరిగణించడంతో ఎక్కువమంది ఈ కోర్సుపై మక్కువ చూపిస్తున్నారు. బీఈడీతో పోలిస్తే డీఎడ్ కళాశాలలు తక్కువ స్థాయిలో ఉండటంతో సీట్లకు డిమాండ్ ఏర్పడింది. దీంతో కళాశాలల యాజమాన్యాలు సీట్ల భర్తీ విషయంలో కృత్రిమ కొరతను సృష్టిస్తూ విద్యార్థుల నుంచి భారీగా గుంజుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా సుమారు 17 కళాశాలల్లో ఈ కోర్సును నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క కళాశాలలో 50 సీట్లకు ప్రభుత్వం పరిమితం చేసింది. వీటిలో కన్వీనర్ కోటాగా 40, మిగిలిన వాటిని మేనేజ్‌మెంట్ సీట్లుగా భర్తీ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు ఎస్‌జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. స్కూల్ అసిస్టెంట్లతో పోలిస్తే ఎస్‌జీటీ పోస్టులు ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.
ఏజెన్సీలో పోస్టులు సైతం ఎస్టీలకు ప్రత్యేకంగా కేటాయించడంతో వీరిలో ఎక్కువ మంది ఈ కోర్సులపై మొగ్గు చూపుతున్నారు. కన్వీనర్ కోటా విషయంలో ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం ఏటా విద్యార్థుల నుంచి రూ.12,500 వరకు వసూలు చేస్తున్నారు. మేనేజ్‌మెంట్ కోటా విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. నర్సీపట్నంలోనే రెండు ప్రయివేటు కళాశాలలున్నా, చుట్టుపక్కల విద్యార్థులకు తగ్గట్టు సీట్లు లేకపోవడంతో అధిక డిమాండ్ ఉంది. దీనిపై విద్యాశాఖాధికారులు దృష్టి సారించి మేనేజ్‌మెంట్ సీట్ల వసూళ్లపై నియంత్రణ విధించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
డీఎడ్ కళాశాలల్లో ‘మేనేజ్‌మెంట్’ దోపిడీ
Published Mon, Dec 23 2013 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM
Advertisement
Advertisement