![మద్యం పాలసీపై పీటముడి - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/71427051510_625x300.jpg.webp?itok=8DQlccH_)
మద్యం పాలసీపై పీటముడి
నూతన మద్యం విధానంపై
ఎటూ తేల్చని సర్కారు
మరింత చర్చ జరగాలంటూ
నిర్ణయాన్ని వాయిదా వేసిన సీఎం
పట్టు బిగిస్తోన్న లిక్కర్ లాబీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం పాలసీపై పీటముడి పడింది. ఎక్సైజ్ ఏడాది ముగుస్తున్నప్పటికీ నిర్ణయం ప్రకటించకుండానే కేబినెట్ సమావేశం ముగిసింది. పాత విధానమే కొనసాగించాలని కొందరు.. తమిళనాడు తరహా మద్యం విధానం అమలు చేయాలని మరికొందరు మంత్రులు పట్టుబట్టడమే ఇందుకు కారణమని తెలిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో నూతన మద్యం పాలసీపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని ముందుగా ప్రకటించారు. ఈ మేరకు మద్యం పాలసీని అజెండాలో చేర్చారు.
మద్యం పాలసీపైనే తొలుత మంత్రి మండలి చర్చ ప్రారంభించింది. సుమారు గంటపాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం పాలసీపై చర్చించారు. తమిళనాడు తరహా మద్యం పాలసీ వల్ల కల్తీ మద్యం అరికట్టడంతోపాటు లిక్కర్ మాఫియా ఆధిపత్యం తగ్గుతుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వివరించారు. ప్రభుత్వం నేరుగా రిటైల్ మద్యం వ్యాపారం నిర్వహించడం ద్వారా అవినీతిని తగ్గించవచ్చని తెలిపారు. యనమలకు మద్దతుగా మంత్రులు రావెల కిషోర్‌బాబు, మాణిక్యాలరావులు నిలిచారు.
అయితే పాత విధానమే కొనసాగించాలని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, మృణాళిని, గంటా శ్రీనివాసరావులు పట్టుబట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రుల నడుమ స్వల్ప వాగ్వాదాలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర మాత్రం మౌన ముద్ర దాల్చడం గమనార్హం. చివరకు సీఎం జోక్యం చేసుకుని మద్యం పాలసీపై మరింత చర్చ జరగాలంటూ వాయిదా వేశారు. మద్యం పాలసీపై మంత్రుల నడుమ భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు మంత్రి పల్లె మీడియాకు ధ్రువీకరించారు. కేబినెట్‌పైనా లిక్కర్ లాబీ పట్టు బిగించిందనడానికి మద్యం పాలసీ ప్రకటించకపోవడమే నిదర్శనమని విమర్శలు వినవస్తున్నాయి.