
బిల్లు గట్టెక్కించేందుకే దిగ్విజయ్ రాక!
హైదరాబాద్‌లోనే నేటి నుంచి రెండ్రోజుల మకాం
సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ: విభజన బిల్లుపై శాసనసభలో చర్చను సజావుగా ముగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం నడుం బిగించింది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో పాటు కార్యదర్శులు తిరునావుక్కరసు, కుంతియాలు గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. రెండ్రోజుల పాటు ఇక్కడే మకాం వేయనున్నారు. శుక్రవారం రాత్రి తిరిగి ఢిల్లీకి వెళతారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. సమైక్యవాదం వినిపిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో సొంత పార్టీ నేతలతో పాటు విభజనకు సహకరిస్తున్న ఇతర పార్టీల నాయకులతో దిగ్విజయ్ ఈ రెండ్రోజులూ చర్చలు సాగించనున్నారని తెలిసింది. విభజన బిల్లుపై చర్చ సాఫీగా, సజావుగా ముగింపచేసి ఎక్కువమంది మద్దతు పలికేలా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలతో మంతనాలు చేయనున్నారు.
ఎంపీలపై చర్యలు: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన నోటీసిచ్చిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలపై చర్యలుంటాయని దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేశారు. తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని వారిని కోరానని, అలా చేయని పక్షంలో పార్లమెంటు మార్గదర్శకాల మేరకు నడుచుకుంటామని తెలిపారు. బుధవారం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు తనను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన బిల్లుకు ఆమోదం లభించేలా తాను హైదరాబాద్ వెళ్లి నేతలతో చర్చిస్తానన్నారు.