జీవనోపాధి లేక రోడ్డున పడిన యువకుడి విషాదగాధ
దిల్‌సుఖ్‌నగర్ బాంబుపేలుళ్ల బాధితుడి దుస్థితి
ఉద్యోగం ఇప్పిస్తామని మొండిచేయి చూపిన ప్రజాప్రతినిధులు
అంగవైకల్యంతో మూడేళ్లుగా ఎదురుచూస్తున్న వైనం
పాపం ఒకరిదైతే.. శిక్ష అనుభవిస్తోంది మరొకరు. ఉన్నత చదువు చదివి.. తల్లిదండ్రులను ఏలోటూ లేకుండా చూసుకోవాలని తాపత్రయపడిన ఆ యువకుడి భవిష్యత్తుపై ఉగ్రపంజా కోలుకోలేని దెబ్బతీసింది. మృత్యుముఖం వరకు వెళ్లొచ్చిన అతడిని అంగవైకల్యం వెక్కిరించగా, ప్రభుత్వ కొలువుతో జీవితానికి భరోసా కల్పిస్తామన్న ప్రజాప్రతినిధుల హామీ నీటిరాతగానే మిగిలింది. చిన్న ఉద్యోగం ఇవ్వండంటూ అతడు మూడేళ్లుగా ప్రాధేయపడుతున్నా.. పాలకుల మనస్సు కరగడం లేదు.
చింతూరుకు చెందిన పురాలశెట్టి దుర్గాప్రసాద్ హైదరాబాద్‌లో ఎంబీఏ చదువుతుండగా, 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబుపేలుళ్లలో తీవ్రంగా గాయపడ్డాడు. కాలికి, చేతులకు తీవ్ర గాయాలయ్యా యి. ప్రాణాపాయం నుంచి బయటపడిన అతడు మధ్యలోనే చదువు నిలిపేశాడు. ఆరు నెలల పాటు వైద్యసేవలు పొందిన అనంతరం పట్టుదలతో ఎంబీఏ పూర్తిచేశాడు. అతడిని పరామర్శించేందుకు వచ్చిన నేతలు ప్రభుత్వం తరపున ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. వారి హామీ నేటికీ నెరవేరకపోవడంతో దుర్గాప్రసాద్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఎంబీఏ పూర్తిచేసిన అతను ఉద్యోగ వేటలో అలసిపోయి, ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత అతడిపైనే ఉండడంతో కంటబడిన నేతలందరినీ ఉద్యోగం కోసం ప్రాధేయపడుతున్నాడు.
అప్పట్లో ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రితో పాటు భద్రాచలం ఎమ్మెల్యేను కలిశాడు. హైదరాబాద్‌లో ఘటన జరగడంతో తెలంగాణ ప్రభుత్వం ఏమైనా ఉద్యోగం ఇస్తుందేమోనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు డిప్యూటీ సీఎం, హోంమంత్రి, అసెంబ్లీ స్పీకర్‌ను కలసి తన గోడును వెళ్లబోసుకున్నాడు. పోనీ ఆంధ్రాలో ఉంటున్నందున ఇక్కడి ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందన్న ఆశతో విలీన మండలాల పర్యటనకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి చినరాజప్పను కలసి ప్రాధేయపడ్డాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. అంగవైకల్యంతో ఉన్న తనకు ఇప్పటికైనా ప్రభుత్వం దయతలచి ఉద్యోగం ఇవ్వాలని దుర్గాప్రసాద్ కోరుతున్నాడు.
ముక్కలైన భవిష్యత్తు
Published Sun, Feb 21 2016 12:14 AM | Last Updated on Fri, Sep 28 2018 4:46 PM
Advertisement
Advertisement