ఉగ్రదాడిలో కాలు కోల్పోయా.. | mental stress with dilsukhnagar bomb blast Victim women | Sakshi
Sakshi News home page

ఉగ్రదాడిలో కాలు కోల్పోయా..

Published Sun, Feb 11 2018 2:19 PM | Last Updated on Thu, Mar 21 2019 8:31 PM

mental stress with dilsukhnagar bomb blast Victim women - Sakshi

ఉగ్రదాడిలో కాలు కోల్పోయా.. ఇక జీవితం లేదనుకున్నా.. వందసార్లు నాకు నేనే ప్రశ్నించుకున్న బతికి సాధించాలన్న నిర్ణయానికి వచ్చా దిల్‌సుఖ్‌నగర్‌ బాంబుపేలుళ్ల బాధితురాలు రజిత అప్పుడు ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న. ప్రాజెక్టు వర్క్‌ కోసం దిల్‌సుఖ్‌నగర్‌లోని ఇనిస్టిట్యూట్‌కు వెళ్లి తిరిగి హాస్టల్‌కు వచ్చేందుకు బస్టాప్‌ దగ్గర నిల్చున్న. నాతో పాటు మా హాస్టల్‌ వార్డెన్‌ కూడా ఉంది. ఒక్క సెకన్‌లో భారీ విస్పోటం. ఎక్కడ చూసినా భయానక దృశ్యం. నాకు ఒళ్లన్నీ దెబ్బలే. కాలు తెగిపోయింది. కింద పడిపోయి అటూ ఇటూ చూస్తున్న. నొప్పితో అరుస్తున్నా. మా మేడం చనిపోయింది. చాలామంది గాయాలపాలయ్యారు. అక్కడి దృశ్యమంతా ఒక్కసారిగా మారిపోయింది. నేనూ సాయం కోసం అరుస్తుంటే కొంతసేపటికి కొందరు వచ్చి నన్ను ఆటోలో ఎక్కించుకుని హాస్పిటల్‌ కు తీసుకుపోయిండ్రు.. అంటూ నాటి సంఘటనను గుర్తు చేసుకుంది రజిత.  

సాక్షి, కామారెడ్డి:  కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని శివ్వాయిపల్లికి చెందిన అంజయ్య, నాగమణిల కూతురు రజిత హైదరాబాద్‌లో ఎంబీఏ చదువుతుండేది. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో హాస్టల్‌కు వెళ్లేందుకు బస్టాప్‌లో నిలబడగా, ఒక్కసారిగా బాంబుపేలుడు జరిగింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా బీభత్సంగా మారింది. కొందరు చనిపోయారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. కాపాడమంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ ఘటనలో రజిత కాలు తెగిపోయింది. లేవలేని స్థితిలో ‘కాపాడండి’ అంటూ అరుస్తోంది. కొంతసేపటికి కొందరు యువకులు వచ్చి రజితను మలక్‌పేటలోని యశోదా ఆస్పత్రిలో చేర్పించారు. కుడికా లు మోకాలి కింది వరకు తొలగించారు. ఆస్పత్రిలోనే రెండునెలలు ఉండాల్సి వచ్చింది. అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలు వచ్చి పరామర్శించి అండగా ఉంటామన్నారు.

ఎంతో బాధపడ్డా..
రెండునెలల తరువాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి అక్కడే రూంలో ఉన్నానని, ఆ సమయంలో ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యానని రజిత తెలిపింది. ‘‘ఈ జీవితం ఇంతే అనుకున్న. ఏంతో బాధపడ్డా. ఏడ్చిఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయినయి. కానీ నామీద నాకున్న నమ్మకంతో ఒకటికి వంద సార్లు ప్రశ్నించుకున్న. నేను సాధించాల్సింది ఎంతో ఉందనిపించింది. గుండె నిబ్బరం చేసుకున్నా. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన పదిరోజులకే పరీక్షలు వచ్చాయి. ఆ పదిరోజులు చదివి పరీక్షలు రాసి పాసయ్యా. దీంతో ఇంకా నమ్మకం పెరిగిందని రజిత వివరించింది.

కృత్రిమకాలు సహాయంతో..
ఏడాది కాలంపాటు ఎటూ వెళ్లలేని పరిస్థితి.. ఇంటిదగ్గరే ఉండేదాన్ని.. తరువాత కృత్రిమ కాలును సమకూర్చారు. అది కొంత ఉపయోగపడింది. ఏడాది క్రితం హీరోయిన్‌ సమంత జర్మనీ నుంచి కృత్రిమ కాలును తెప్పించి ఇచ్చారు. దానితో సులువుగా నడువగలుగుతున్నా. ప్రభుత్వం నాకు రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం కల్పించింది. ఇప్పుడు కామారెడ్డి కలెక్టరేట్‌లో పనిచేస్తున్నా’ అని పేర్కొంది రజిత. ‘మా అమ్మా, నాన్న, అన్నయ్య, తమ్ముడు, బాబాయ్‌ లు నాకు అండగా నిలిచారు. నాకు ఎంతో ధైర్యాన్నిచ్చారు. ఎంతో సేవ చేశారు. వారి సహకారం ఎంతో ఉంది’ అని తెలిపింది. కృత్రిమ కాలు సాయం తో నడుస్తున్న రజిత స్కూటీపై విధులకు వెళ్లి వస్తోంది.  

లక్ష్యం గ్రూప్‌–2..
ఇప్పుడు జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నా. డిపార్టుమెంటర్‌ టెస్టులన్నీ రాశాను. కానీ నా లక్ష్యం గ్రూప్‌–2. సాధించాలన్న పట్టుదలతో ఉన్నా. నోటిఫికేషన్‌ రాగానే గ్రూప్‌ 2 ద్వారా మంచి ఉద్యోగం సాధిస్తా. నాలాగా కాలుతో ఇబ్బంది పడేవారికి కృత్రిమ కాళ్లు ఇప్పించే ప్రయత్నం చేస్తా. కష్టాలు ఎన్నో వస్తుంటాయి. తట్టుకునే శక్తి ఉండాలి. అవి మనల్ని చూసి భయపడాలి. నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ రంగంలోనైనా రాణించొచ్చు. ముఖ్యంగా ఆడపిల్లలు ధైర్యంగా ఎదుర్కొనాలి.  
– రజిత, శివ్వాయిపల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement