rajita
-
ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్ రజిత
జనగామ : జనగామ మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కారు. ఇంటి నిర్మాణానికి మార్టిగేజ్ చేసిన స్థలం రిలీజ్ కోసం లంచం డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య, రాజు విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. లింగాలఘణపురం మండలం బండ్లగూడెం గ్రామానికి చెందిన చిట్టిపల్లి రాజు జిల్లా కేంద్రంలోని సూర్యాపేటరోడ్డు కెమిస్ట్రీ భవనం ఎదురుగా 2022 జూన్‌లో జీ ప్లస్–3 భవన నిర్మాణం చేపట్టారు. నిర్మాణ సమయంలో నిబంధనల మేరకు 10 శాతం స్థలం మున్సిపల్ పేరిట మార్టిగేజ్ చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా నిర్మాణ పనులు పూర్తి కావడంతో, మార్టిగేజ్ స్థలం రిలీజ్ చేయాలని దరఖాస్తు చేయగా, కమిషనర్ రూ.40వేలు నగదు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రాజు సహాయంతో ఫోన్ సంభాషణల రికార్డులను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, సోమవారం కమిషనర్‌ను ట్రాప్ చేసేందుకు జనగామకు వచ్చారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు రాజు కమిషనర్‌కు ఫోన్ చేసి డబ్బులు తీసుకు వచ్చానని చెప్పడంతో ఇంటి వద్ద ఉన్న ఆమె ఆఫీసుకు చేరుకున్నారు. రాజు కమిషనర్‌కు నగదు ఇచ్చే ప్రయత్నం చేయగా ఆమె తీసుకోకుండా, కారు డ్రైవర్ నవీన్‌కు ఇవ్వాలని చెప్పారు. అదే సమయంలో టౌన్ ప్లానింగ్‌లో ఓ అధికారి లేకపోవడంతో డబ్బులను డ్రైవర్‌కు ఇవ్వగా, అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు.. వల పన్ని డ్రైవర్ వద్ద ఉన్న రూ.40వేల నగదును స్వాధీనం చేసుకుని విచారించారు. కమిషనర్ రజిత ఆదేశాల మేరకు రాజు వద్ద డబ్బులు తీసుకున్నానని నవీన్ ఒప్పుకొని తమకు వాంగ్మూలం ఇచ్చినట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు. కమిషనర్‌తో పాటు డ్రైవర్ నవీన్‌ను కస్టడీలోకి తీసుకుని, నేడు(మంగళవారం) హైదరాబాద్ నాంపల్లి ఏసీబీ కోర్టులో రిమాండ్ చేస్తామన్నారు. కాగా జనగామలో కమిషనర్ ఉంటున్న అద్దె ఇంటితో పాటు ఆమెకు సంబంధించిన పలు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేసినట్టు సమాచారం. తరువాయి.. టౌన్ ప్లానింగేనా? జనగామ పురపాలికలో లంచాలకు అడ్డు లేకుండా పోతుందనే విమర్శలు లేకపోలేదు. భవన నిర్మాణ అనుమతి, పునర్నిర్మాణం, ఎక్స్ టెన్షన్ ఇలా ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి, లబ్ధిదారుల నుంచి అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటి నిర్మాణానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి చిన్న కారణాలతో తిరస్కరిస్తూ, ఖద్దర్ దుస్తులు వేసుకున్న ఇద్దరు.. పైరవీల పేరిట ముడుపుల పేరిట అనుమతులు ఇప్పిస్తున్నారని ప్రచారం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలకు సైతం వీరిని సంప్రదిస్తే.. గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే అంటూ పుకార్లు ఉన్నాయి. లంచాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన మున్సిపల్ బాగోతంలో కమిషనర్ ఏసీబీకి ట్రాప్ కావడంతో.. మిగతా భాగస్వామ్యులకు భయం పట్టుకుంది. కాగా టౌన్ ప్లానింగ్‌లో అనేక అక్రమాలు జరుగుతున్నట్లు ప్రచారంతో ఏసీబీ ఇందులో పనిచేస్తున్న ఓ అధికారిపై ఆరా తీసినట్టు సమాచారం. రూ.60వేలు డిమాండ్ చేశారు మార్టిగేజ్లో ఉన్న స్థలం రిలీజ్ కోసం కమిషనర్ రజిత మొదటగా రూ.60వేలు డిమాండ్ చేశారు. తన వద్ద అంత డబ్బు లేదని బతిమిలాడడంతో బంపర్ ఆఫర్‌గా రూ.40వేలకు సెటిల్ చేశారు. భవన నిర్మాణ సమయం నుంచి తనను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయగా, ఏసీబీని కలిసి, ఇక్కడ జరుగుతున్న అవినీతి, అక్రమాల బాగోతంపై చెప్పాను. ఏసీబీ అధికారుల సూచనల మేరకు కమిషనర్ రజిత, డ్రైవర్ నవీన్ పట్టుబడ్డారు. – చిట్టిపల్లి రాజు, బాధితుడు -
గురుకులం: వేద విద్యామణులు
నలుగురు అక్కచెల్లెళ్లు. లక్ష్మి ఆర్య, కవిత ఆర్య, రజిత ఆర్య, సరిత ఆర్య. వీరిది తెలంగాణలోని ఓ వ్యవసాయ కుటుంబం. ఈ నలుగురూ వేదాలను అభ్యసించారు. కంప్యూటర్ యుగంలో అందులోనూ ఆడపిల్లలకు వేదాలెందుకు అనేవారి నోళ్లను మూయిస్తూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ, అపార పాండిత్యంతో ఔరా అనిపిస్తూ సంస్కృతంలో విద్యార్థులను నిష్ణాతులు చేస్తూ తమ ప్రతిభను చాటుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఎదిర గ్రామమైన ఈ అక్కాచెల్లెళ్లను కలిస్తే వేదాధ్యయనం గురించి ఎన్నో విషయాలు ఇలా మన ముందుంచారు. ‘‘మా అమ్మానాన్నలు ఆంచ సుమిత్ర, జంగారెడ్డి. నాల్గవ తరగతి వరకు ఊళ్లోనే చదువుకున్నాం. మా మామయ్య విద్వాంసుడవడంతో అతని సూచన మేరకు మా నలుగురు అక్కచెల్లెళ్ల ను కాశీలోని పాణిని కన్యా మహావిద్యాలయంలో చేర్చారు. కాశీ అంటేనే విద్యానగరి. విద్యలన్నీ అక్కడ సులభంగా లభిస్తాయని ప్రతీతి. అక్కడే పదేళ్లపాటు వేదాదేవి సాన్నిధ్య శిష్యరికాలలో విద్యాభ్యాసం చేశాం. ఆత్మరక్షణ కోసం శస్త్ర, శాస్త్రాలు సాధన చేశాం. ► ఆడపిల్లలకు వేదాలా..? వేదాలు బ్రాహ్మణులు కదా చదివేది అనేవారున్నారు. ఆడపిల్లలకు వేదం ఎందుకు అన్నారు. ఎక్కడ రాసుంది స్త్రీ వేదాలు చదవకూడదని, వేద మంత్రమే చెబుతుంది ప్రతి ఒక్కరూ వేదాన్ని పఠించవచ్చు అని. మేం చదివిన గురుకులాన్ని కూడా ప్రజ్ఞాదేవి, భేదాదేవి అనే అక్కచెల్లెళ్లు ఎంతో కృషితో నడిపిస్తున్నారు. రిషిదయానంద్ అనే విద్వాంసుడు స్త్రీని బ్రహ్మ పదవిపై కూర్చోబెట్టారు. వారి వద్ద విద్యను నేర్చుకున్న ఆ అక్కచెల్లెళ్లు వాళ్లు. ఆడపిల్లలు వేదాలు వినడమే నిషేధం అనే రోజుల్లోనే వారిద్దరూ వేదాధ్యయనం చేసి, గురుకులాన్ని స్థాపించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారి శిష్యులు గురుకులాలు స్థాపించి, వేదాన్ని భావితరాలకు అందిస్తున్నారు. ► అన్ని కర్మలు ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలను ఔపోసన పట్టడమే కాదు పౌరోహిత్యం, పుట్టినప్పటి నుంచి మరణించేవరకు మధ్య ఉన్న అన్ని కర్మలూ విధి విధానాలతో చేస్తున్నాం. కొంతమంది ‘ఇదేం విచిత్రం’ అన్నవారూ లేకపోలేదు. అనేవారు చాలా మందే అంటారు. కానీ, మేం వాటికి మా విద్య ద్వారానే సమాధానం చెబుతున్నాం. పురాణ, ఇతిహాసాల్లో గార్గి, మైత్రి, ఘోశ, అపాల .. వంటి స్త్రీలు వేదాభ్యాసం చేసి, తమ సమర్థత చూపారు. అయితే, చాలా మందికి వారి గురించి తెలియదు. ► ఉచిత తరగతులు మా నలుగురిలో లక్ష్మి ఆర్య, సరిత ఆర్య చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో విద్యార్థులకు వేదవిద్యను బోధిస్తున్నారు. పౌరహిత్యంతో పాటు ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్లైన్లోనూ భగవద్గీత, సంస్కృత పాఠాలను ఉచితంగా చెబుతున్నాం. మా నలుగురి ఆలోచన ఒక్కటే సంస్కృతం విస్తృతంగా ప్రచారం కావాలి. ఆడపిల్లలూ వేద విద్యలో ముందంజలో ఉండాలి. మా వద్ద పిల్లలతోపాటు పెద్దవాళ్లు కూడా సంస్కృతం అభ్యసిస్తున్నారు’’ అని వివరించారు ఈ నలుగురు అక్కచెల్లెళ్లు. నేటి కాలంలో వేద విద్యపై ఎవరూ ఆసక్తి చూపడం లేదని, అందుకోసమే తాము వేద విద్యలో పట్టు సాధించాలనుకున్నాం అని తెలిపారు ఈ సోదరీమణులు. తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి సంస్కృత వ్యాకరణంలో రజిత ఆర్య, సరిత ఆర్య పీహెచ్డీ పట్టా అందుకుని ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. – నిర్మలారెడ్డి – బాలయ్య, కొందుర్గు, రంగారెడ్డి జిల్లా, సాక్షి -
ఉగ్రదాడిలో కాలు కోల్పోయా..
ఉగ్రదాడిలో కాలు కోల్పోయా.. ఇక జీవితం లేదనుకున్నా.. వందసార్లు నాకు నేనే ప్రశ్నించుకున్న బతికి సాధించాలన్న నిర్ణయానికి వచ్చా దిల్సుఖ్నగర్ బాంబుపేలుళ్ల బాధితురాలు రజిత అప్పుడు ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న. ప్రాజెక్టు వర్క్ కోసం దిల్‌సుఖ్‌నగర్‌లోని ఇనిస్టిట్యూట్‌కు వెళ్లి తిరిగి హాస్టల్‌కు వచ్చేందుకు బస్టాప్ దగ్గర నిల్చున్న. నాతో పాటు మా హాస్టల్ వార్డెన్ కూడా ఉంది. ఒక్క సెకన్లో భారీ విస్పోటం. ఎక్కడ చూసినా భయానక దృశ్యం. నాకు ఒళ్లన్నీ దెబ్బలే. కాలు తెగిపోయింది. కింద పడిపోయి అటూ ఇటూ చూస్తున్న. నొప్పితో అరుస్తున్నా. మా మేడం చనిపోయింది. చాలామంది గాయాలపాలయ్యారు. అక్కడి దృశ్యమంతా ఒక్కసారిగా మారిపోయింది. నేనూ సాయం కోసం అరుస్తుంటే కొంతసేపటికి కొందరు వచ్చి నన్ను ఆటోలో ఎక్కించుకుని హాస్పిటల్ కు తీసుకుపోయిండ్రు.. అంటూ నాటి సంఘటనను గుర్తు చేసుకుంది రజిత. సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని శివ్వాయిపల్లికి చెందిన అంజయ్య, నాగమణిల కూతురు రజిత హైదరాబాద్‌లో ఎంబీఏ చదువుతుండేది. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో హాస్టల్‌కు వెళ్లేందుకు బస్టాప్‌లో నిలబడగా, ఒక్కసారిగా బాంబుపేలుడు జరిగింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా బీభత్సంగా మారింది. కొందరు చనిపోయారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. కాపాడమంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ ఘటనలో రజిత కాలు తెగిపోయింది. లేవలేని స్థితిలో ‘కాపాడండి’ అంటూ అరుస్తోంది. కొంతసేపటికి కొందరు యువకులు వచ్చి రజితను మలక్‌పేటలోని యశోదా ఆస్పత్రిలో చేర్పించారు. కుడికా లు మోకాలి కింది వరకు తొలగించారు. ఆస్పత్రిలోనే రెండునెలలు ఉండాల్సి వచ్చింది. అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలు వచ్చి పరామర్శించి అండగా ఉంటామన్నారు. ఎంతో బాధపడ్డా.. రెండునెలల తరువాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి అక్కడే రూంలో ఉన్నానని, ఆ సమయంలో ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యానని రజిత తెలిపింది. ‘‘ఈ జీవితం ఇంతే అనుకున్న. ఏంతో బాధపడ్డా. ఏడ్చిఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయినయి. కానీ నామీద నాకున్న నమ్మకంతో ఒకటికి వంద సార్లు ప్రశ్నించుకున్న. నేను సాధించాల్సింది ఎంతో ఉందనిపించింది. గుండె నిబ్బరం చేసుకున్నా. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన పదిరోజులకే పరీక్షలు వచ్చాయి. ఆ పదిరోజులు చదివి పరీక్షలు రాసి పాసయ్యా. దీంతో ఇంకా నమ్మకం పెరిగిందని రజిత వివరించింది. కృత్రిమకాలు సహాయంతో.. ఏడాది కాలంపాటు ఎటూ వెళ్లలేని పరిస్థితి.. ఇంటిదగ్గరే ఉండేదాన్ని.. తరువాత కృత్రిమ కాలును సమకూర్చారు. అది కొంత ఉపయోగపడింది. ఏడాది క్రితం హీరోయిన్ సమంత జర్మనీ నుంచి కృత్రిమ కాలును తెప్పించి ఇచ్చారు. దానితో సులువుగా నడువగలుగుతున్నా. ప్రభుత్వం నాకు రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం కల్పించింది. ఇప్పుడు కామారెడ్డి కలెక్టరేట్లో పనిచేస్తున్నా’ అని పేర్కొంది రజిత. ‘మా అమ్మా, నాన్న, అన్నయ్య, తమ్ముడు, బాబాయ్ లు నాకు అండగా నిలిచారు. నాకు ఎంతో ధైర్యాన్నిచ్చారు. ఎంతో సేవ చేశారు. వారి సహకారం ఎంతో ఉంది’ అని తెలిపింది. కృత్రిమ కాలు సాయం తో నడుస్తున్న రజిత స్కూటీపై విధులకు వెళ్లి వస్తోంది. లక్ష్యం గ్రూప్–2.. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నా. డిపార్టుమెంటర్ టెస్టులన్నీ రాశాను. కానీ నా లక్ష్యం గ్రూప్–2. సాధించాలన్న పట్టుదలతో ఉన్నా. నోటిఫికేషన్ రాగానే గ్రూప్ 2 ద్వారా మంచి ఉద్యోగం సాధిస్తా. నాలాగా కాలుతో ఇబ్బంది పడేవారికి కృత్రిమ కాళ్లు ఇప్పించే ప్రయత్నం చేస్తా. కష్టాలు ఎన్నో వస్తుంటాయి. తట్టుకునే శక్తి ఉండాలి. అవి మనల్ని చూసి భయపడాలి. నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ రంగంలోనైనా రాణించొచ్చు. ముఖ్యంగా ఆడపిల్లలు ధైర్యంగా ఎదుర్కొనాలి. – రజిత, శివ్వాయిపల్లి -
మాపై ఎటువంటి ఒత్తిడి లేదు : జంపన్న
-
వివాహిత ఆత్మహత్యాయత్నం
ఆదిలాబాద్ జిల్లా దండేపల్లికి చెందిన రజిత(30) అనే వివాహిత సోమవారం ఉదయం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. 90శాతం మేర శరీరం కాలిపోవడంతో చికిత్సనిమిత్తం ఆమెను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబకలహాలవల్లే ఆమె ఆత్మహత్యకు యత్నించిందని ఇరుగు పొరుగువారు చెబుతున్నారు. ఆమె వాగ్మూలం ఇస్తేకానీ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు స్పష్టంగా తెలిసే అవకాశం లేదు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
పండుగకు వెళుతూ.. పరలోకాలకు..
రాఘవాపురం(పాలకుర్తి) : తండాలో జరుగుతున్న పండుగకు వెళుతూ ఇద్దరు మృత్యు ఒడికి చేరారు. కారు అదుపుతప్పి బోల్తాపడడంతో కానరానిలోకాలకు చేరారు. ఈ సంఘటన పాలకుర్తి -హన్మకొండ రహదారిపై రాఘవాపురం స్టేజీ సమీపంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... రాయపర్తి మండలం కేశవాపురం గ్రామ శివారు పీతల తండాకు చెందిన మాలోతు స్వరూప, మాలోతు యాకూబ్ దంపతులు కాజీపేట ప్రశాంత్‌నగర్‌లో నివాసముంటున్నారు. ఇదే తండాకు చెందిన మాలోత్ రాము(32), రజిత దంపతులు కాజీపేటలోని ఫాతిమానగర్‌లో ఉంటున్నారు. యూకూబ్ ట్రాక్టర్ డ్రైవర్‌గా, రాము కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. పాలకుర్తి మండలం బమ్మెర శివారు ఎల్లమ్మగడ్డ తండాలో స్వరూప తల్లిగారింట్లో పండుగ చేసుకుంటుండడంతో ఆమె భర్త యూకూబ్, కుమార్తెలు ఇందూ(6), బిందుతో కలిసి రాము కారును అద్దెకు మాట్లాడుకుని బయల్దేరారు. ఈ క్రమంలో రాఘవాపురం గ్రామం స్టేజీ దాటిన తర్వాత ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొని బోల్తాపడింది. దీంతో తీవ్రగాయూలపాలైన డ్రైవర్ రాము(32)తోపాటు చిన్నారి ఇందూ(6) సంఘటన స్థలంలోనే మృతిచెందారు. మృతుడు రాముకు కొన్నాళ్ల క్రితమే వివాహ మైందని, అతడి భార్య ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి అని బంధువులు తెలిపారు. అలాగే స్వరూప, యాకూబ్, వారి చిన్నకూతురు మాలోతు బిందుకు తీవ్ర గాయాలయ్యూరుు. వారిని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎల్లమ్మగడ్డ తండా వాసులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. రాము, ఇందూ మృతితో ఎల్లమ్మగడ్డ తండా, పీతల తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలాన్ని పాలకుర్తి సీఐ తిరుపతి, ఎస్సై ఉస్మాన్ షరీఫ్ సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
డాపౌట్ నుంచి.. ‘డాక్టర్’ దాకా
ఎంబీబీఎస్ చదువుకు ఆర్థిక అడ్డంకి * కార్డియాలజిస్ట్ కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న నిరుపేద విద్యార్థిని * చేయూతనందించాలని వేడుకోలు కూలి పనులకు వెళితే గానీ పూట గడవని నిరుపేద కుటుంబం ఆ విద్యార్థినిది. అందుకేనేమో తనకు తొమ్మిదేళ్లు వచ్చేంత వరకూ బడిబాట ఎరుగదు. అనంతరం మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ (ఎంవీఎఫ్) సహకారంతో ఓనమాలు నేర్చింది. ఇలా గురుకులంలో ప్రవేశం పొంది టెన్త్, ఇంటర్ పట్టుదలతో చదివి ప్రతిభ నిరూపించుకున్న మునగాల మండలం తాడువాయికి చెందిన మాతంగి రజిత ఈ ఏడాది ఎంసెట్ రాసి నేడు ఎంబీబీఎస్ సీటు సాధించింది. నిరుపేద కుటుంబానికి చెందిన ఈమె ప్రస్తుతం తన చదువును కొనసాగించేందుకు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. పేదప్రజలకు సేవచేస్తా.. పేద కుటుంబంలో పుట్టిన తాను భవిష్యత్‌లో కార్డియాలజిస్ట్‌ను అయ్యి గ్రామీణ ప్రాంతాలలోని పేద ప్రజలకు వైద్యసేవలు అందిస్తా. నిరుపేద కుటుంబానికి చెందిన నన్ను ఆదుకుని ఆర్థికసాయం అందిస్తే ఎంబీబీఎస్ పూర్తిచేసి డాక్టర్నై సేవచేస్తా. - రజిత, ఎంబీబీఎస్ విద్యార్థిని తాడువాయి (మునగాల) : మునగాల మండలం తాడువాయి గ్రామానికి చెందిన మాతంగి పెద్దులు-అక్కమ్మ దంపతులది నిరుపేద దళిత కుటుంబం. రెక్కాడితే పూట గడవని పరిస్థితి. అయితే పదేళ్ల క్రితం పెద్దులు కాలికి గాయమై కార్పొరేట్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స చేయించుకునే ఆర్థికస్తోమత లేక ప్రస్తుతం వికలాంగుడిగా మారి ఇంటివద్దనే ఉంటున్నాడు. వీరికి నలుగురు సంతానం ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, వీరిలో పెద్దకుమారుడు వెంకన్న, పెద్ద కుమార్తె నాగమణికి వివాహాలు అయ్యాయి. రెండో కుమారుడు రమేష్ ప్రస్తుతం మెదక్ జిల్లా సంగారెడ్డిలోని డీవీఆర్ కళాశాలలో ఎంటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. రెండో కుమార్తె రజిత తొమ్మిదేళ్ల వయస్సు వచ్చే వరకు పాఠశాల అంటే ఎరుగదు. ఈ క్రమంలో 2005లో ఎంవీ ఫౌండేషన్ సభ్యులు గ్రామంలో డ్రాపౌట్ పిల్లలను బడిలో చేర్పించే కార్యక్రమంలో భాగంగా రజితను గుర్తించారు. వెంటనే ఆమె తల్లిదండ్రులను ఒప్పించి సంవత్సరం పాటు తమ ఆధీనంలో ఉంచుకుని ఓనమాలు నేర్పించారు. గురుకులంలో ప్రవేశం పొంది.. ఎంవీఎఫ్ వలంటీర్లు 2006లో నిర్వహించిన గురుకుల ప్రవేశ పరీక్షకు రజితను సన్నద్ధం చేశారు. ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణురాలైన రజిత తుంగతుర్తిలోని గురుకుల పాఠశాలలో ఐదో తరగతిలో ప్రవేశం పొందింది. అక్కడే పదో తరగతి వరకు చదివింది. 2011లో పదో తరగతిలో రజిత 554 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిల్చింది. ఆ విద్యార్థిని తెలివితేటలు, ప్రతిభను గుర్తించిన చిలుకూరు మండలంలోని కవిత జూనియర్ ప్రైవేట్ కళాశాల యాజమాన్యం ఉచితంగా ఇంటర్ విద్యనందించింది. ఈ క్రమంలో 2013లో ఇంటర్మీడియట్ బైపీసీ విభాగంలో 967మార్కులు సాధించి కోదాడ టౌన్ టాపర్‌గా నిల్చింది. సోదరుడు రమేష్ ప్రోత్సాహంతో ఈ ఏడాది ఎంసెట్ రాసిన రజిత జనరల్ కేటగిరిలో 6,622, ఎస్సీ కోటాలో 106ర్యాంక్ సాధించింది. ఇటీవల నిర్వహించిన కౌన్సెలింగ్‌లో వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం పొందింది. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు ఐదేళ్ల పాటు కొనసాగించాల్సిన వైద్యవిద్యలో ప్రతియేటా రూ.50నుంచి రూ.లక్ష వరకు వ్యయం కానున్నట్లు రజిత సోదరుడు రమేష్ న్యూస్‌లైన్‌కు తెలిపారు. తన సోదరి డాక్టరు కావాలంటే దయా హృదయం గల దాతలు ముందుకు వచ్చి ఆర్థికసాయం అందిస్తే ఎంబీబీసీ పూర్తి చేయనుందని వేడుకుంటున్నాడు. తమ సోదరి చదువు కోసం ఆర్థికసాయం చేయదల్చుకున్న వారు సెల్ : 87902 53550, 9573962957 నంబర్లలో సంప్రదించాలని, అలాగే మునగాల ఎస్బీహెచ్ బ్రాంచి ఖాతా నంబర్లో 62364215604లో అమౌంట్‌ను జమచేయవచ్చని కోరుతున్నాడు.