జనగామ : జనగామ మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కారు. ఇంటి నిర్మాణానికి మార్టిగేజ్ చేసిన స్థలం రిలీజ్ కోసం లంచం డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య, రాజు విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. లింగాలఘణపురం మండలం బండ్లగూడెం గ్రామానికి చెందిన చిట్టిపల్లి రాజు జిల్లా కేంద్రంలోని సూర్యాపేటరోడ్డు కెమిస్ట్రీ భవనం ఎదురుగా 2022 జూన్‌లో జీ ప్లస్–3 భవన నిర్మాణం చేపట్టారు.
నిర్మాణ సమయంలో నిబంధనల మేరకు 10 శాతం స్థలం మున్సిపల్ పేరిట మార్టిగేజ్ చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా నిర్మాణ పనులు పూర్తి కావడంతో, మార్టిగేజ్ స్థలం రిలీజ్ చేయాలని దరఖాస్తు చేయగా, కమిషనర్ రూ.40వేలు నగదు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రాజు సహాయంతో ఫోన్ సంభాషణల రికార్డులను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, సోమవారం కమిషనర్‌ను ట్రాప్ చేసేందుకు జనగామకు వచ్చారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు రాజు కమిషనర్‌కు ఫోన్ చేసి డబ్బులు తీసుకు వచ్చానని చెప్పడంతో ఇంటి వద్ద ఉన్న ఆమె ఆఫీసుకు చేరుకున్నారు. రాజు కమిషనర్‌కు నగదు ఇచ్చే ప్రయత్నం చేయగా ఆమె తీసుకోకుండా, కారు డ్రైవర్ నవీన్‌కు ఇవ్వాలని చెప్పారు.
అదే సమయంలో టౌన్ ప్లానింగ్‌లో ఓ అధికారి లేకపోవడంతో డబ్బులను డ్రైవర్‌కు ఇవ్వగా, అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు.. వల పన్ని డ్రైవర్ వద్ద ఉన్న రూ.40వేల నగదును స్వాధీనం చేసుకుని విచారించారు. కమిషనర్ రజిత ఆదేశాల మేరకు రాజు వద్ద డబ్బులు తీసుకున్నానని నవీన్ ఒప్పుకొని తమకు వాంగ్మూలం ఇచ్చినట్లు డీఎస్‌పీ సాంబయ్య తెలిపారు. కమిషనర్‌తో పాటు డ్రైవర్ నవీన్‌ను కస్టడీలోకి తీసుకుని, నేడు(మంగళవారం) హైదరాబాద్ నాంపల్లి ఏసీబీ కోర్టులో రిమాండ్ చేస్తామన్నారు. కాగా జనగామలో కమిషనర్ ఉంటున్న అద్దె ఇంటితో పాటు ఆమెకు సంబంధించిన పలు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేసినట్టు సమాచారం.
తరువాయి.. టౌన్ ప్లానింగేనా?
జనగామ పురపాలికలో లంచాలకు అడ్డు లేకుండా పోతుందనే విమర్శలు లేకపోలేదు. భవన నిర్మాణ అనుమతి, పునర్నిర్మాణం, ఎక్స్ టెన్షన్ ఇలా ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి, లబ్ధిదారుల నుంచి అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటి నిర్మాణానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి చిన్న కారణాలతో తిరస్కరిస్తూ, ఖద్దర్ దుస్తులు వేసుకున్న ఇద్దరు.. పైరవీల పేరిట ముడుపుల పేరిట అనుమతులు ఇప్పిస్తున్నారని ప్రచారం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలకు సైతం వీరిని సంప్రదిస్తే.. గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే అంటూ పుకార్లు ఉన్నాయి. లంచాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన మున్సిపల్ బాగోతంలో కమిషనర్ ఏసీబీకి ట్రాప్ కావడంతో.. మిగతా భాగస్వామ్యులకు భయం పట్టుకుంది. కాగా టౌన్ ప్లానింగ్‌లో అనేక అక్రమాలు జరుగుతున్నట్లు ప్రచారంతో ఏసీబీ ఇందులో పనిచేస్తున్న ఓ అధికారిపై ఆరా తీసినట్టు సమాచారం.
రూ.60వేలు డిమాండ్ చేశారు
మార్టిగేజ్‌లో ఉన్న స్థలం రిలీజ్ కోసం కమిషనర్ రజిత మొదటగా రూ.60వేలు డిమాండ్ చేశారు. తన వద్ద అంత డబ్బు లేదని బతిమిలాడడంతో బంపర్ ఆఫర్‌గా రూ.40వేలకు సెటిల్ చేశారు. భవన నిర్మాణ సమయం నుంచి తనను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయగా, ఏసీబీని కలిసి, ఇక్కడ జరుగుతున్న అవినీతి, అక్రమాల బాగోతంపై చెప్పాను. ఏసీబీ అధికారుల సూచనల మేరకు కమిషనర్ రజిత, డ్రైవర్ నవీన్ పట్టుబడ్డారు.
– చిట్టిపల్లి రాజు, బాధితుడు
Comments
Please login to add a commentAdd a comment