ఏసీబీ వలలో ‘కమీష’నర్
అమలాపురం టౌన్ : అమలాపురం మున్సిపల్ కమిషనర్ ఎ.శివనాగిరెడ్డి బుధవారం తన చాంబర్‌లో ఓ కాం ట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. నాగిరెడ్డి మున్సిపల్ కాంట్రాక్టర్ అరిగెల బాబి నుంచి రూ.15 వేలు తీసుకుంటుం డగా రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ ఎన్.వెంకటేశ్వరరావు, సీఐ రాజశేఖర్ దాడి చేసి పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మున్సిపాలిటీలోని 17వ వార్డులో కాంట్రాక్టరు బాబి రూ.3 లక్షలతో డ్రెయిన్ నిర్మిస్తున్నారు.
ఈ పనికి సంబంధించిన అప్పటికే పూర్తై పనికి రూ.1.90 లక్షలు మున్సిపాలిటీ చెల్లించింది. అయితే ఇంకా రూ.29 వేలు చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తం ఇవ్వటానికి కమిషనర్ రూ.20 వేలు లంచం డిమాండు చేశారన్నది కాంట్రాక్టరు బాబి అభియోగం. దీనిపై ఆయన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దానితో వారు కమిషనర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు పథకం పన్నారు. బుధవారం ఉదయం కాంట్రాక్టర్ బాబి నుంచి కమిషనర్ నాగిరెడ్డి రూ.15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కాంట్రాక్టర్‌ను కమిషనర్ రూ.20 వేలు లంచం డిమాండ్ చేస్తున్నప్పుడు వారి మధ్య సంభాషణలను ఈ నెల 22, 25 తేదీల్లో రికార్డు చేశామన్నారు. బుధవారం ఉదయం కాంట్రాక్టర్ నుంచి కమిషనర్ రూ.15 వేలు ఇస్తుండగా ప్రత్యక్షంగా పట్టుకున్నామని చెప్పారు.
లంచంగా ఇచ్చిన నోట్లపై ముందుగా తాము రాసిన రంగు కమిషనర్ చేతికి అంటుకున్నట్టు గుర్తించామన్నారు. అంతేకాక కాంట్రాక్టరు ఇచ్చిన సొమ్ములను కమిషనర్ తీసుకుని తన జేబులో పెట్టుకున్నట్లు కూడా గమనించామని చెప్పారు. ఈ ఆధారాలతో కమిషనర్‌పై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కాంట్రాక్టరు బాబి అమలాపురం మున్సిపాలిటీలో గత పదేళ్లుగా సివిల్ కాంట్రాక్టరుగా ఉన్నారని తెలిపారు. కాగా తాను చేసిన పనికి సంబంధించిన ఫైలును కమిషనర్ తొక్కిపెట్టుకుని అది ఏమైందో తెలియదంటూ, మిగిలిన బిల్లు ఇవ్వకుండా తిప్పించుకోవటమే కాక లంచం అడగడంతోనే ఏసీబీని ఆశ్రయించానని కాంట్రాక్టర్ అరిగెల బాబి విలేకరులకు తెలిపారు.
కమిషనర్ సచ్ఛీలుడన్న కౌన్సిలర్లు
కమిషనర్ శివనాగిరెడ్డి అమలాపురం కమిషనర్‌గా డిప్యుటేషన్‌పై రావడానికి ముందు హైదరాబాద్ సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ అధికారిగా ఉన్నారు. ఆరు నెలల కిందట పంచాయతీరాజ్ శాఖను వీడి, పురపాలక శాఖకు వచ్చి అమలాపురం కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. కాగా కమిషనర్‌పై ఏసీబీ దాడి జరుగుతోందన్న సమాచారం తెలుసుకుని అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకి చెందిన కౌన్సిలర్లందరూ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. కమిషనర్ అవినీతిపరుడు కాదని, ఆయనపై కొందరు కాంట్రాక్టర్లు కుట్ర పన్ని, పథకం ప్రకారం ఇలా ఇరికించారని ఏసీబీ డీఎస్పీకి చెప్పారు.