నా వెనుక పవన్‌ ఉన్నాడు.. కిరణ్‌ రాయల్‌ బెదిరింపులు | Victim Laxmi Files Complaint Against Jana Sena Kiran Royal at Tirupati SP Grievance Cell | Sakshi
Sakshi News home page

నా వెనుక పవన్‌ ఉన్నాడు.. కిరణ్‌ రాయల్‌ బెదిరింపులు

Published Mon, Feb 10 2025 1:38 PM | Last Updated on Mon, Feb 10 2025 3:16 PM

Victim Laxmi Files Complaint Against Jana Sena Kiran Royal at Tirupati SP Grievance Cell

సాక్షి, తిరుపతి : జనసేన పార్టీ ఇన్‌చార్జి కిరణ్‌ రాయల్‌, బాధిత మహిళ లక్ష్మి కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఎప్పుడో పదేళ్ల కిందట సమసిపోయిన వ్యవహారాన్ని ఇప్పుడు తెరపైకి తెస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన కిరణ్‌ రాయల్‌కు బాధిత మహిళ లక్ష్మి కౌంటర్‌ ఇచ్చారు. తాజాగా, మరోసారి కీలక ఆధారాల్ని మీడియా ఎదుట బహిర్ఘతం చేశారు. 

చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కిరణ్‌ రాయల్‌ మోసాన్ని వివరిస్తూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే.. కిరణ్‌రాయల్‌ తనను బెదిరించి.. రూ.కోటికిపైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళ మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. ఈ తరుణంలో సోమవారం కిరణ్ రాయల్ వ్యవహారంపై బాధితురాలు లక్ష్మి ఎస్పీను కలిసి గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని, కిరణ్ రాయల్ చేసిన అన్యాయానికి సంబంధించిన ఆధారాల్ని అందించారు. అనంతరం, ఆమె మీడియాతో మాట్లాడారు.

‘నేనో కిలాడీ లేడీ అని, నాపై ఎన్నో కేసులు ఉన్నాయని కిరణ్‌ రాయల్‌ అంటున్నాడు. నా మీద కేసులు ఉన్నాయి. ఎందుకంటే మా ఇద్దరి మధ్య జరిగిన మనీ ట్రాన్సాక్షన్‌ వల్ల, ఒక లక్ష నా అకౌంట్‌ నుంచి అతని సహచరుడి అకౌంట్‌కు వెళ్లినందు వల్లే కేసులు నమోదయ్యాయి.  ఆ అబ్బాయి గతంలో జనసేనలో పనిచేశాడు. ఆ తర్వాత కిరణ్‌ రాయల్‌ కోసం పనిచేశాడు. డబ్బులు ట్రాన్సాక్షన్‌ విషయంలో సదరు వ్యక్తిని తన వైపుకు తిప్పుకున్నాడు.  

ఒక మహిళగా ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే కుటుంబ పరువుపోతుంది. ఇలా మాట్లాడినందుకే నా అనుకున్న వాళ్లే నాకు దూరమయ్యారు. నాకు ఆపద వచ్చినప్పుడు ఎవరు నాకు సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. అందుకే నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను.

నెలన్నర క్రితం నా బిడ్డకు ఆపరేషన్‌ జరుగుతుంది డబ్బులు కావాలని అడిగితే కిరణ్‌ రాయల్‌ నానా దూర్భషలాడాడు. నా ఖాళీ చెక్‌ తీసుకుని, లక్ష రూపాయలు నాకు ఇచ్చాడు.  అందుకు మా ఇంటి సీసీ కెమెరా, అతని అనుచరులే సాక్ష్యం.

ఆ ఘటన జరిగిన తర్వాత నాపై అసభ్యపదజాలంతో దూషించాడు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పు అని బెదిరించాడు. వెంటనే మా ఇంటికి వచ్చి నన్ను దారుణంగా కొట్టాడు. ఆపై బెదిరించాడు. ఎవరొస్తారో రానియ్‌. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో. పోలీసులకు చెబుతావా. నన్ను ఎవరు వచ్చినా ఏం చేయలేరు. నా వెనుక జనసేన ఉంది. పవన్‌ కళ్యాణ్‌,నాదెండ్ల మనోహర్‌ ఉన్నాడు. నా వెనకాల జనసేన వీరమహిళలు ఉన్నారు.

వీళ్లందరూ మహిళల్ని మోసం చేయమని కిరణ్‌ రాయల్‌కు చెప్పారా? పవన్‌ కళ్యాణ్‌ చాలా గట్టిగా చెప్పారు. ఏ ఆడబిడ్డకు కష్టం వస్తే ముందు ఉంటానన్నారే.. కిరణ్‌ రాయల్‌ పార్టీకి దూరంగా ఉండాలని నోట్‌ విడుదల చేస్తే సరిపోతుందా.

2013 నుంచి 2016 వరకు మా ఇద్దరి మధ్య స్నేహం ఉందని, ఆ తర్వాత ఇద్దరం విడిపోయామని మీడియాకు కిరణ్‌ రాయల్‌ చెప్పాడు. అలాంటప్పుడు 2023లో కిరణ్‌ రాయల్‌ నాకు డబ్బులు ఎలా ఇచ్చాడు.? ఆ సమయంలో అతను డబ్బులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది. దీని గురించి కిరణ్‌ రాయల్‌ అనుకూల మీడియా ప్రశ్నించిందా? నేతలు ప్రశ్నించారా? లేదు. ఎందుకంటే జనసేన అధికారంలో ఉంది కాబట్టి.

అన్యాయం జరిగిన నాకు న్యాయం చేయాల్సింది పోయింది. అందరు తనకు మద్దతుగా ఉంటూ నన్ను కామెంట్స్‌ చేస్తున్నారా? అవును. జనసేన నేత కిరణ్‌ రాయల్‌ను నేను నమ్ము తప్పు చేశాను. 2015, 2016 నాకు తనకు ఎలాంటి మాటల్లేవన్న కిరణ్‌ రాయల్‌ డబ్బులు ఎందుకు ఇచ్చాడు.  2025, 2026 సంవత్సరం పేరుతో చెక్స్‌ ఎందుకు ఇచ్చాడు.

కిరణ్‌ రాయల్‌ చేతిలో మోస పోయింది నేనే కాదు.. మరో అమ్మాయి కూడా మోస పోయింది. ఆమె తన సొంత బిడ్డను కూడా వదిలేసింది. నాకు  ఏ పార్టీతో కానీ, ఏ నేతలు కూడా తెలియదు. కిరణ్‌ రాయల్‌పై నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. ఎక్కడ ఆడపడుచు కష్టాల్లో ఉన్న పవన్‌ కల్యాణ్ తనకు న్యాయం చేయాలి. ఇద్దరు బిడ్డలతో న్యాయ పోరాటం చేస్తున్నా. నాకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కిరణ్‌ రాయల్‌ నుంచి నాకు ప్రాణహాని ఉంది.  అధికార బలగాన్ని ఉపయోగించి  నా ప్రాణం తీసినా.. నా ఇద్దరు బిడ్డలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా’అని పలు ఆడియో,వీడియో,చెక్స్‌,బాండ్‌ పేపర్స్‌ను బహిర్ఘతం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement