జిల్లా ప్రయోజనాలను.. ముంచేసి! | Dipped in the interests of the district ..! | Sakshi
Sakshi News home page

జిల్లా ప్రయోజనాలను.. ముంచేసి!

Published Wed, Dec 17 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM

జిల్లా ప్రయోజనాలను..  ముంచేసి!

జిల్లా ప్రయోజనాలను.. ముంచేసి!

కర్నూలు(విద్య) : ప్రభుత్వ కార్యక్రమాలు, సమీక్ష సమావేశాల్లో అధికార పార్టీకి చెందిన నేతలు అధికారులపై చిందులు వేసేందుకు అందరికంటే ముందు ఉంటారు. కానీ రాజకీయ భిక్ష పెట్టిన అన్నదాతకు మాత్రం అండగా ఉండేందుకు కుంటిసాకులు చెబుతున్నారు. న్యాయబద్ధంగా జిల్లాకు రావాల్సిన వాటా నీటిని పక్క జిల్లాలకు మళ్లించేందుకు అనుమతులు ఇచ్చినా కూడా అధికార పార్టీ నేతలు పట్టించుకోవడం లేదు. దీంతో ఈ ఏడాది కూడా టీబీ డ్యామ్‌లో కర్నూలు-కడప కాలువ ఆయకట్టుకు రావాల్సిన వాటా నీటిని అనంతపురం జిల్లాకు మళ్లించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
 
 కేసీ కెనాల్‌కు తుంగభద్ర జలాశయం నిల్వ నీటిలో 10 టీఎంసీల నీటిని బచావత్ ట్రిబ్యునల్ 1976లో కేటాయించింది. టీబీ డ్యామ్‌లో పూడిక చేరిందనే సాకుతో 2014-15 సంవత్సరంలో నీటి లభ్యత ఆధారంగా అధికారులు మొదటిసారి ఈ ఏడాది 6.8 టీఎంసీల నీటిని కేటాయించారు. అనంతరం నవంబర్ నెలలో జరిగిన తుంగభద్ర బోర్డు మీటింగ్‌లో 0.3 టీఎంసీల నీటిని తగ్గించి 6.5 టీఎంసీలుగా నిర్ణయించారు.
 
 ఇందులో నుంచి మొదటి విడత కింద 1.5 టీఎంసీలు, రెండో విడతగా 2.5 టీఎంసీలు నీటిని మళ్లించుకునేందుకు ప్రభుత్వం నుంచి అనంతపురం జిల్లాకు చెందిన మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అనుమతి తీసుకున్నారు. నీటి మళ్లింపుపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చేందుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కేసీ కింద ఖరీఫ్ చివరలో వేసిన వరి, పత్తి, మిరప, పసుపు పంటలు సుమారుగా 30 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. నీటి మళ్లింపులో ఈ ఆయకట్టు సాగు, 285 గ్రామాల తాగునీటి ముప్పు వచ్చే అవకాశం ఉంది.
 
 నాడు బాబు జారీ చేసిన జీవోల వల్లే..
 అనంతపురం జిల్లా తాగునీటి కష్టాలు తీర్చేందుకు టీబీ డ్యామ్‌లో కేసీ వాటాగా ఉన్న నీటి నుంచి పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పీఏబీఆర్)కు 5 టీఎంసీల నీటిని మళ్లించేందుకు 2004 జనవరి 21న జీవో నెంబర్ 10ని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జారీ చేస్తూ భవిష్యత్తులో అవసరమైతే మరో 5 టీఎంసీలు మళ్లించుకోవచ్చని అందులో పేర్కొన్నారు. ఈ జీఓను అనుసరించి 2005లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన జేసీ దివాకర్‌రెడ్డి తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పీఏబీఆర్‌కు 5 టీఎంసీల నుంచి 10 టీఎంసీలకు పెంచుతూ జీవో నెం.10ని పాక్షికంగా సవరించి జీవో నెం.698ని జారీ చేశారు. ఇందుకు 2005లో నంద్యాల ఎంపీగా ఉన్న ఎస్.పి.వై.రెడ్డి, నాటి ఎమ్మెల్యేలు శిల్పా మోహన్‌రెడ్డి, ఏరాసు ప్రతాప్‌రెడ్డి అంగీకరిస్తూ సంతకాలు కూడా చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
 
  చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో కేసీ రైతులకు అన్యాయం జరగకూడదనే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి కేసీ కెనాల్ 0 కి.మీ నుంచి 150 కి.మీ వరకు సాగునీరు అందించేందుకు ప్రత్యామ్నాయంగా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి దగ్గర 5 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకునేందుకు సుమారు రూ.120 కోట్లతో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. స్థానిక రాజకీయ నాయకుల వల్ల పనులు ఆగిపోయాయి. 151 కి.మీ నుంచి 306 కి.మీ వరకు శ్రీశైలం నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా వరద నీటిని వాడుకునేందుకు తాత్కాలికంగా అనుమతి ఇచ్చారు. ఈ ఏడాది అనంతపురం జిల్లా తాగునీటి కోసమని కోట్లు పెట్టి నిర్మించిన హంద్రీనీవా ద్వారా 10 టీఎంసీల నీటిని తీసుకుంటున్నారు. ఇప్పటికే 9 టీఎంసీల దాకా వాడుకున్నారు.
 
 నీటి మళ్లింపుపై కేసు పెండింగ్..
 కేసీ వాటా నీటిని మళ్లింపుపై నందికొట్కూరు ప్రాంతానికి చెందిన రైతులు లోకాయుక్తలో కేసు వేశారు. ఈ కేసు ప్రస్తుతం విచారణ జరుగుతోంది. కోర్టు తీర్పు ఇవ్వకముందే నీటి మళ్లింపునకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీనిని బట్టి చూస్తే అధికార పార్టీకి న్యాయస్థానాలపై ఎంతమాత్రం గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు.
 
 మాకెలాంటి సమాచారం లేదు
 తుంగభద్ర డ్యామ్‌లో వున్న కేసీ కెనాల్ వాటా నుంచి అనంతపురం జిల్లాకు మళ్లించినట్లు మాకెలాంటి సమాచారం అందలేదు. కేసీకి 2.5 టీఎంసీలు ఇవ్వాలని ఇది వరకే నాలుగుసార్లు ప్రభుత్వానికి లేఖ రాశాం. నీటి విడుదలకు ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఒకవేళ మళ్లింపునకు అనుమతి ఇచ్చి వుంటే టీబీ డ్యామ్ నుంచి కేసీకి రావాల్సిన వాటా నీరు కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చేది.
 - ఆర్.నాగేశ్వరరావు, నీటి పారుదల శాఖ పర్యవేక్షక ఇంజినీర్
 
 అధికార పార్టీ నాయకుల అసమర్ధత వల్లే కేసీ వాటాను మళ్లిస్తున్నారు..
 తుంగభద్ర జలాశయంలో కడప, కర్నూలు కాల్వకు కేటాయించిన నీటిలో నుంచి అనంతపురం తాగునీటి అవసరాల కోసం తాత్కాలికంగా మళ్లించేందుకు మాత్రమే గత ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. చంద్రబాబు నాయుడు 2004లో జారీ చేసిన జీఓ  వల్లే పదేళ్లుగా కేసీ వాటా నీటిని మళ్లిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయకులు స్పందించకపోవడం బాధాకరం. రైతులకు నష్టం జరిగితే సహించేది లేదు. వాటాలో నుంచి కర్నూలు నగర ప్రజల కోసం 2 టీఎంసీల నీరు ఇవ్వాల్సిందే. కేసీ కెనాల్ కింద ఉన్న ఆయకట్టులో ఒక్క ఎకరం ఎండినా కూడా సహించే ప్రసక్తి లేదు. దీనిపై అధికార పార్టీ నాయకులు స్పందించి తక్షణమే నీటి మళ్లింపునకు ఇవ్వదలచిన ఉత్తర్వులను నిలిపి వేయించాలి.
 - ఎస్వీ మోహన్‌రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే
 
 ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా
 మళ్లించడం అన్యాయం
 కేసీ కెనాల్ వాటా నీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా అనంతపురం జిల్లాకు మళ్లించడం అన్యాయం. ఈ విషయం గురించి ఇటీవలే ప్రభుత్వానికి లేఖ రాశాను. అనంతపురం తాగునీటి అవసరాల కోసం హంద్రీనీవా నుంచి ఇప్పటికే దాదాపు 9 టీఎంసీల నీటిని తీసుకున్నారు. కేసీ కెనాల్ పరిధిలో ఉన్న ఆయకట్టు గురించి పట్టించుకోకుండా వాటా నీటిని మళ్లించడం మంచిది కాదు. దీనిపై ఆయకట్టుదారుల తరపున అసెంబ్లీలో ప్రస్తావిస్తాను. కేసీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి దగ్గర నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయకుండానే మళ్లించడమనేది చట్ట విరుద్ధం.            
 - గౌరు చరిత, పాణ్యం ఎమ్మెల్యే
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement