Government programs
-
‘పరిషత్’ ఫలితాల్లో ప్రతిబింబించిన ప్రభుత్వ పనితీరు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పనితీరు పరిషత్ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వివిధ పథకాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మార్గ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కలెక్టర్లు, జిల్లాల యంత్రాంగం, సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు.. ఇలా అందరి పని తీరు కారణంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు వచ్చాయన్నారు. నాడు– నేడు నుంచి మహిళా సాధికారత, రైతు సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలన్నీ చక్కటి ఫలితాలనిస్తున్నాయని చెప్పారు. అన్ని పథకాలను, ప్రభుత్వ కార్యక్రమాలను అంకిత భావంతో అమలు చేస్తున్నారని, తద్వారా ఏపీ చరిత్రలోనే కాదు, బహుశా దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ ఇలాంటి ఫలితాలను చూసి ఉండరని అన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఆది నుంచి ఇవే ఫలితాలు ► మొదటి నుంచీ ఇలాంటి ఫలితాలే వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 86 శాతం సీట్లు, పార్లమెంటు స్థానాల్లో 88 శాతం సీట్లు సాధించాం. ఇదే ట్రెండ్ సర్పంచి ఎన్నికల్లోనూ కొనసాగింది. మా పార్టీ మద్దతుదారులు 81 శాతం చోట్ల గెలుపొందారు. ► తర్వాత మునిసిపల్ ఎన్నికల్లోనూ ఇదే కొనసాగింది. 75 మునిసిపాల్టీల్లో 74 చోట్ల అంటే 98 శాతం గెలుపొందాం. కార్పొరేషన్లలో 12కు 12 చోట్ల అంటే 100 శాతం గెలిచాం. జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. 100 శాతం జెడ్పీలు గెలిచాం. ► దేవుడి దయ వల్ల మంచి పనితీరు చూపుతున్నాం. ప్రతి పథకాన్ని ప్రజల ముంగిటకు చేరుస్తున్నాం. వివక్ష, అవినీతి లేకుండా అత్యంత పారదర్శక పద్ధతిలో వారికి ప్రయోజనాలు అందిస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగేలా చూడాలి. ► ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను అంకిత భావంతో అమలు చేస్తున్న మీకందరికీ అభినందనలు. మీ పనితీరు ద్వారానే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మీరు అక్కడ మంచిగా పని చేస్తే, అది ప్రజల గుండెల్లో ప్రభుత్వ పనితీరు కింద ప్రతిబింబిస్తుంది. తద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ► ఇతరత్రా ఎక్కడైనా అవినీతి ఉంటే ఏరిపారేయాల్సిన అవసరం ఉంది. అక్కడా మంచి వ్యవస్థను, సుపరిపాలనను తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంతిమంగా దేవుడి దయవల్ల 2024లో కూడా ఇవే ఫలితాలు కొనసాగడమే కాదు.. భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి. -
ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలని విద్యార్థులను బలవంత పెట్టొద్దు
సాక్షి, అమరావతి: స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలు, రాజ్యాంగంలోని అధికరణ 51ఏలో నిర్దేశించిన కార్యక్రమాలు మినహా, మిగిలిన ఏ కార్యక్రమంలోనైనా పాల్గొనాలంటూ పాఠశాల, కళాశాల విద్యార్థులను బలవంతం చేయడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం తన ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని తీరాలంటూ ఒత్తిడి చేయడమంటే వారిని నిర్బంధ ప్రేక్షకులుగా మార్చడమేనని, రాజ్యాంగం వారికి ప్రసాదించిన హక్కులను కాలరాయడమేనని స్పష్టం చేసింది. బలవంతం మీద విద్యార్థులు ఏదైనా ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అవాంఛనీయ ఘటన జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించి, ఆ విద్యార్థులు లేదా వారి కుటుంబాలకు నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. పాఠశాలల వెలుపల నిర్వహిస్తున్న ర్యాలీలు, ధర్నాలతో పాటు రాజకీయ ప్రయోజనాలు ముడిపడి ఉన్న కార్యక్రమాల్లో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను బలవంతంగా పాల్గొనేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేస్తూ విద్యార్థుల హక్కులను కాలరాస్తోందంటూ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎ.రామకృష్ణ గతేడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్.హరినాథ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వనం–మనం కార్యక్రమానికి విద్యార్థులను తీసుకెళుతుండగా 2018 జూలై 14న తూర్పుగోదావరి జిల్లా, పశువులంక వద్ద పడవ ప్రమాదం జరిగి 6 విద్యార్థులు మృతి చెందా రని తెలిపారు. పాఠశాలల వెలుపల నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొనేలా విద్యార్థులను ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారని, ఇది వారి హక్కులను హరించడమేనన్నారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. హరినాథ్‌రెడ్డి వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. పాఠశాల వెలుపల నిర్వహిస్తున్న కార్యక్రమానికి తీసుకెళ్లడం వల్లే ఆ విద్యార్థులు మృతి చెందారంది. నేతల ప్రాపకం కోసం ...: ‘స్వేచ్ఛగా జీవించే హక్కును రాజ్యాంగంలోని అధికరణ 21 ఈ దేశ పౌరులకు కల్పిస్తోంది. అయితే ప్రభుత్వం వనం–మనం కార్యక్రమానికి విద్యార్థులను వారి ఇష్టానికి విరుద్ధంగా తీసుకెళ్లడం ద్వారా వారి హక్కులను హరించింది. అలాగే సెలవు రోజున విశ్రాంతి తీసుకునేందుకు పిల్లలు అర్హులు. ప్రభుత్వం ఆ హక్కునూ కాలరాసింది. దీనివల్ల విద్యార్థులు మానసిక, శారీరక అలసటకు గురయ్యారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా విద్యార్థుల జీవితాలు ప్రమాదంలోకి వెళ్లాయి. రాజకీయ బాసుల ప్రాపకం కోసం పెద్ద సంఖ్యలో విద్యార్థులను చూపించేందుకు అధికారులు చూపిన అత్యుత్సాహం ఆరుగురి ప్రాణాలు బలిగొంది.’ అని ధర్మాసనం పేర్కొంది. -
హామీలు.. దిగాలు!
► మాటల ముఖ్యమంత్రి ► రెండేళ్ల కాలంలో 10 విడతల పర్యటన ► జిల్లాకు ఇచ్చిన హామీలు 76 ► ఇప్పటి వరకు అమలు చేసినవి 25 ► కరువు సీమపై కపట ప్రేమ కర్నూలు(అగ్రికల్చర్): తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈనెల 8వ తేదీ నాటికి రెండేళ్లు పూర్తయింది. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో పదిసార్లు పర్యటించారు. ఏడు పర్యటనల సందర్భంగా జిల్లాకు సుమారు 76 హామీలు ఇచ్చారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం పేరిట వరాల వర్షం కురిపించడం తప్పిస్తే.. వీటిలో అధిక శాతం ఇప్పటికీ అమలుకు నోచుకోని పరిస్థితి. మొత్తం హామీల్లో 25 పరిష్కరించినట్లు చూపుతున్నా.. అందులోనూ స్పష్టత కరువయింది. దాదాపు పరిష్కరించిన హామీల్లోనూ 40 శాతం పురోగతిలో ఉన్నట్లు అధికారులే అంగీకరిస్తున్నారు. వాస్తవానికి 10 హామీలకు సంబంధించిన జీఓలు మాత్రమే ఇప్పటి వరకు జారీ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్ర పరిపాలన సారథి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకే దిక్కు లేకపోతే.. ఇక అభివృద్ధి ఎలా సాధ్యమనే చర్చ జరుగుతోంది. మాటల్లోనే ఆర్థిక సంక్షోభం రాష్ర్ట విభజన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పాలకులు అనేక సందర్భాల్లో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని.. రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్ వెంటాడుతోందని మాట్లాడటం సర్వసాధారణమైంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ముఖ్యమంత్రి విచ్చలవిడి ఖర్చు చూస్తే రాష్ట్రం నిజంగానే ఆర్థిక సంక్షోభంలో ఉందా అనే సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఆర్థిక సమస్యలే ఉంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇంతటి ఆర్భాటం అవసరమా? ఏడు రోజుల నవ నిర్మాణ దీక్షలను ఇంతటి అట్టహాసంగా చేపడతారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక్క కర్నూలు జిల్లాలోనే ముఖ్యమంత్రి పర్యటన ఖర్చు రూ.10కోట్లు దాటిందంటే ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రజాధనం వృథా చేస్తుందో అర్థమవుతోంది. ముఖ్యమంత్రి జిల్లాల్లో పర్యటించాల్సిందే.. క్షేత్ర స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందే.. వీటికి లేని ఆర్థిక ఇక్కట్లు హామీల అమలు విషయంలో అడ్డు రావడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. -
పార్టీ పెద్దలే టికెట్లు అమ్ముకున్నారు
-
యంత్రాంగం.. నిర్లక్ష్యం..
‘అధికారులు అలక్ష్యం వద్దు.. యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి సాగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రెండు నెలల్లో మరోసారి వస్తా. రెండు రోజులపాటు సమీక్ష నిర్వహిస్తా. అందరూ సన్నద్ధంగా ఉండాలి’ - సోమవారం సమీక్షలో కేసీఆర్ ⇒ సీఎం సమీక్షలో వెల్లడైన అధికారుల అలక్ష్యం ⇒ వరంగల్ ఆర్అండ్బీ ఈఈ జనార్దన్‌రెడ్డి సరెండర్ ⇒ సీఎం ఫోన్ చేసినా స్పందించని ఈఈ ⇒ ఉత్సవాల తేదీల ఖరారుపై అసంతృప్తి సాక్షి ప్రతినిధి, వరంగల్ : పరిపాలన, అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యక్రమాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రోడ్లు, భవనాల శాఖ వరంగల్ డివిజన్ ఈఈ జనార్దన్‌రెడ్డిపై వేటు పడింది. ఈఈ జనార్దన్‌రెడ్డిని ఆ శాఖ రాష్ట్ర కార్యాలయానికి సరెండర్ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబాబాద్ ఈఈ చిన్నపుల్లదాస్కు వరంగల్ ఈఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పరిపాలన అంశాల విషయంలో జిల్లా యంత్రాంగం తీరుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమీక్షలో జిల్లా అభివృద్ధి విషయంలో అధికారుల వైఖరి కేసీఆర్‌ను అసహనికి గురి చేసింది. ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా తాను ఫోన్ చేసి చెప్పినా అంశాలను పట్టించుకోకపోవడంతో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ జి.కిషన్ సహా పలువురు శాఖల అధికారుల పనితీరు, సమావేశంలో ఇచ్చే వివరణపై అసంతృప్తి దాచుకోలేకపోయారు. అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష కోసం సోమవారం జిల్లాకు వచ్చిన కేసీఆర్.. ప్రధానంగా టెక్స్టైల్ పార్క్, రోడ్ల నిర్మాణం, కాకతీయ ఉత్సవాలపై సమీక్షించారు. వరంగల్ నగరంలోని ప్రధాన రహదారుల విషయంలో సమగ్ర సమాచారం ఇవ్వాలని ఇటీవల కేసీఆర్ నేరుగా వరంగల్ డివిజన్ రోడ్లు, భవనాల శాఖ వరంగల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జనార్దన్‌రెడ్డిని ఆదేశించారు. స్వయంగా సీఎం ఫోన్ చేసి చెప్పినా జనార్దన్‌రెడ్డి పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని సీఎం సమీక్ష సమావేశంలో ప్రస్తావించారు. జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖ సూపరింటెండెంట్ ఇంజనీరును ప్రశ్నించారు. అందరూ ఏమి తెలియదని చెప్పినట్లుగా ఉండడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈఈ జనార్దన్‌రెడ్డికి మద్దతుగా ఈ శాఖ ఎస్ఈ మోహన్‌నాయక్ సర్ది చేప్పేందుకు ప్రయత్నించారు. ఎస్ఈ తీరుపైనా కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఈఈ జనార్దన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సమీక్ష సమావేశంలో ఉన్న రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు సూచించారు. అటవీ శాఖపై.. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కోసం అవసరమైన భూముల స్థలాల సమాచారంపైనా కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. టెక్స్టైల్ పార్క్ కోసం కనీసం వెయ్యి ఎకరాలు తగ్గకుండా స్థలాలు కావాలని సూచించినా.. జిల్లా అధికారులు 500 లోపు ఎకరాలు ఉన్న స్థలాలనే ప్రతిపాదనల్లో పెట్టారు. ఈ కారణంతోనే కేసీఆర్ ఏరియల్సర్వే షెడ్యూల్ మారింది. నగరానికి సమీపంలో ఒకే చోట 2 వేల ఎకరాల వరకు ఉన్న స్థలాలను సూచించాలని సమీక్షలో అటవీ అధికారులను ఆదేశించారు. నగరానికి 20 కి.మీ పరిధిలో, 30 కి.మీ పరి ధిలోని అటవీ శాఖ భూముల వివరాలను అటవీ శాఖ ముఖ్య అధికారి రాజారావు ఇవ్వలేకపోయారు. గంటలోపు కావాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇలా చెప్పిన 45 నిమిషాల తర్వాత అటవీ శాఖ అధికారులకు సీఎం గుర్తు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. కాకతీయ ఉత్సవాలపైనా.. కాకతీయ ఉత్సవాల నిర్వహణ తేదీలను కలెక్టర్ జి.కిషన్ ప్రకటించడంపైనా ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. తేదీలను ఎలా ప్రకటిస్తారని పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ.ఆచార్య మొదట కలెక్టర్ జి.కిషన్‌ను ప్రశ్నిం చారు. ప్రజాప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించకుం టే ఎలా అని సీఎం కేసీఆర్ అన్నట్లు తెలిసింది. సమీక్ష సమావేశానికి సంధించిన సమాచారాన్ని పొందుపరిచిన పుస్తకాలను సమావేశంలో ముఖ్యమంత్రి పక్కన కూర్చున్న స్పీకర్, మంత్రులకే ఇవ్వడంపై రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్.. కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. మనది పారదర్శక ప్రభుత్వమని ఎంపీలు, ఎమ్మెల్యేలకు సమీక్ష వివరాలు అందరికీ ఇవ్వకపోతే ఎలా అని కలెక్టర్ జి.కిషన్‌ను కేసీఆర్ ప్రశ్నించారు. ఈ సమాచార పుస్తకం నేరుగా రాష్ట్ర కార్యాలయం నుంచే వచ్చాయని కలెక్టర్ వివరణ ఇచ్చుకున్నారు. మొత్తంగా ప్రధాన అంశాలపై అధికారుల తీరు సరిగా లేకపోవడంతో కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ‘అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సాగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. 2 నెలల్లో మరోసారి వస్తా. రెండు రోజులపాటు సమీక్ష నిర్వహిస్తా. అప్పుడు అందరం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలి’ అని కేసీఆర్ చెప్పారు. రోడ్లు, భవనాల శాఖ తీరుతో జిల్లా యంత్రాంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, రాష్ట్ర ఉన్నతాధికారులకు చులకన భావం ఏర్పడిందని జిల్లా ఉన్నతాధికారులే అంగీకరిస్తున్నారు. -
జిల్లా ప్రయోజనాలను.. ముంచేసి!
కర్నూలు(విద్య) : ప్రభుత్వ కార్యక్రమాలు, సమీక్ష సమావేశాల్లో అధికార పార్టీకి చెందిన నేతలు అధికారులపై చిందులు వేసేందుకు అందరికంటే ముందు ఉంటారు. కానీ రాజకీయ భిక్ష పెట్టిన అన్నదాతకు మాత్రం అండగా ఉండేందుకు కుంటిసాకులు చెబుతున్నారు. న్యాయబద్ధంగా జిల్లాకు రావాల్సిన వాటా నీటిని పక్క జిల్లాలకు మళ్లించేందుకు అనుమతులు ఇచ్చినా కూడా అధికార పార్టీ నేతలు పట్టించుకోవడం లేదు. దీంతో ఈ ఏడాది కూడా టీబీ డ్యామ్‌లో కర్నూలు-కడప కాలువ ఆయకట్టుకు రావాల్సిన వాటా నీటిని అనంతపురం జిల్లాకు మళ్లించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. కేసీ కెనాల్‌కు తుంగభద్ర జలాశయం నిల్వ నీటిలో 10 టీఎంసీల నీటిని బచావత్ ట్రిబ్యునల్ 1976లో కేటాయించింది. టీబీ డ్యామ్‌లో పూడిక చేరిందనే సాకుతో 2014-15 సంవత్సరంలో నీటి లభ్యత ఆధారంగా అధికారులు మొదటిసారి ఈ ఏడాది 6.8 టీఎంసీల నీటిని కేటాయించారు. అనంతరం నవంబర్ నెలలో జరిగిన తుంగభద్ర బోర్డు మీటింగ్‌లో 0.3 టీఎంసీల నీటిని తగ్గించి 6.5 టీఎంసీలుగా నిర్ణయించారు. ఇందులో నుంచి మొదటి విడత కింద 1.5 టీఎంసీలు, రెండో విడతగా 2.5 టీఎంసీలు నీటిని మళ్లించుకునేందుకు ప్రభుత్వం నుంచి అనంతపురం జిల్లాకు చెందిన మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అనుమతి తీసుకున్నారు. నీటి మళ్లింపుపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చేందుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కేసీ కింద ఖరీఫ్ చివరలో వేసిన వరి, పత్తి, మిరప, పసుపు పంటలు సుమారుగా 30 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. నీటి మళ్లింపులో ఈ ఆయకట్టు సాగు, 285 గ్రామాల తాగునీటి ముప్పు వచ్చే అవకాశం ఉంది. నాడు బాబు జారీ చేసిన జీవోల వల్లే.. అనంతపురం జిల్లా తాగునీటి కష్టాలు తీర్చేందుకు టీబీ డ్యామ్‌లో కేసీ వాటాగా ఉన్న నీటి నుంచి పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పీఏబీఆర్)కు 5 టీఎంసీల నీటిని మళ్లించేందుకు 2004 జనవరి 21న జీవో నెంబర్ 10ని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జారీ చేస్తూ భవిష్యత్తులో అవసరమైతే మరో 5 టీఎంసీలు మళ్లించుకోవచ్చని అందులో పేర్కొన్నారు. ఈ జీఓను అనుసరించి 2005లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన జేసీ దివాకర్‌రెడ్డి తన చాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పీఏబీఆర్‌కు 5 టీఎంసీల నుంచి 10 టీఎంసీలకు పెంచుతూ జీవో నెం.10ని పాక్షికంగా సవరించి జీవో నెం.698ని జారీ చేశారు. ఇందుకు 2005లో నంద్యాల ఎంపీగా ఉన్న ఎస్.పి.వై.రెడ్డి, నాటి ఎమ్మెల్యేలు శిల్పా మోహన్‌రెడ్డి, ఏరాసు ప్రతాప్‌రెడ్డి అంగీకరిస్తూ సంతకాలు కూడా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో కేసీ రైతులకు అన్యాయం జరగకూడదనే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి కేసీ కెనాల్ 0 కి.మీ నుంచి 150 కి.మీ వరకు సాగునీరు అందించేందుకు ప్రత్యామ్నాయంగా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి దగ్గర 5 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకునేందుకు సుమారు రూ.120 కోట్లతో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. స్థానిక రాజకీయ నాయకుల వల్ల పనులు ఆగిపోయాయి. 151 కి.మీ నుంచి 306 కి.మీ వరకు శ్రీశైలం నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా వరద నీటిని వాడుకునేందుకు తాత్కాలికంగా అనుమతి ఇచ్చారు. ఈ ఏడాది అనంతపురం జిల్లా తాగునీటి కోసమని కోట్లు పెట్టి నిర్మించిన హంద్రీనీవా ద్వారా 10 టీఎంసీల నీటిని తీసుకుంటున్నారు. ఇప్పటికే 9 టీఎంసీల దాకా వాడుకున్నారు. నీటి మళ్లింపుపై కేసు పెండింగ్.. కేసీ వాటా నీటిని మళ్లింపుపై నందికొట్కూరు ప్రాంతానికి చెందిన రైతులు లోకాయుక్తలో కేసు వేశారు. ఈ కేసు ప్రస్తుతం విచారణ జరుగుతోంది. కోర్టు తీర్పు ఇవ్వకముందే నీటి మళ్లింపునకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీనిని బట్టి చూస్తే అధికార పార్టీకి న్యాయస్థానాలపై ఎంతమాత్రం గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. మాకెలాంటి సమాచారం లేదు తుంగభద్ర డ్యామ్‌లో వున్న కేసీ కెనాల్ వాటా నుంచి అనంతపురం జిల్లాకు మళ్లించినట్లు మాకెలాంటి సమాచారం అందలేదు. కేసీకి 2.5 టీఎంసీలు ఇవ్వాలని ఇది వరకే నాలుగుసార్లు ప్రభుత్వానికి లేఖ రాశాం. నీటి విడుదలకు ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఒకవేళ మళ్లింపునకు అనుమతి ఇచ్చి వుంటే టీబీ డ్యామ్ నుంచి కేసీకి రావాల్సిన వాటా నీరు కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చేది. - ఆర్.నాగేశ్వరరావు, నీటి పారుదల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ అధికార పార్టీ నాయకుల అసమర్ధత వల్లే కేసీ వాటాను మళ్లిస్తున్నారు.. తుంగభద్ర జలాశయంలో కడప, కర్నూలు కాల్వకు కేటాయించిన నీటిలో నుంచి అనంతపురం తాగునీటి అవసరాల కోసం తాత్కాలికంగా మళ్లించేందుకు మాత్రమే గత ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. చంద్రబాబు నాయుడు 2004లో జారీ చేసిన జీఓ వల్లే పదేళ్లుగా కేసీ వాటా నీటిని మళ్లిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయకులు స్పందించకపోవడం బాధాకరం. రైతులకు నష్టం జరిగితే సహించేది లేదు. వాటాలో నుంచి కర్నూలు నగర ప్రజల కోసం 2 టీఎంసీల నీరు ఇవ్వాల్సిందే. కేసీ కెనాల్ కింద ఉన్న ఆయకట్టులో ఒక్క ఎకరం ఎండినా కూడా సహించే ప్రసక్తి లేదు. దీనిపై అధికార పార్టీ నాయకులు స్పందించి తక్షణమే నీటి మళ్లింపునకు ఇవ్వదలచిన ఉత్తర్వులను నిలిపి వేయించాలి. - ఎస్వీ మోహన్‌రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా మళ్లించడం అన్యాయం కేసీ కెనాల్ వాటా నీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా అనంతపురం జిల్లాకు మళ్లించడం అన్యాయం. ఈ విషయం గురించి ఇటీవలే ప్రభుత్వానికి లేఖ రాశాను. అనంతపురం తాగునీటి అవసరాల కోసం హంద్రీనీవా నుంచి ఇప్పటికే దాదాపు 9 టీఎంసీల నీటిని తీసుకున్నారు. కేసీ కెనాల్ పరిధిలో ఉన్న ఆయకట్టు గురించి పట్టించుకోకుండా వాటా నీటిని మళ్లించడం మంచిది కాదు. దీనిపై ఆయకట్టుదారుల తరపున అసెంబ్లీలో ప్రస్తావిస్తాను. కేసీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి దగ్గర నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయకుండానే మళ్లించడమనేది చట్ట విరుద్ధం. - గౌరు చరిత, పాణ్యం ఎమ్మెల్యే